3820* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.

3820* వ శ్రమదానాన్ని వివరిస్తా రండి!

               అది ప్రపంచ కార్మిక దినోత్సవమైన మేడే - (శుక్రవారం, 2026) నాటిది. వీధి శుభ్ర సుందరీకరణను ప్రక్కన పెట్టి, వరుసగా 4 వ నాడు కూడ స్వచ్ఛ కార్యకర్తలు బైపాస్ వీధి ప్రక్క – పాలకేంద్రం దగ్గరి 5 ఎకరాల ఖాళీ ప్రదేశాన్ని క్రీడా మైదానంగా మారుస్తున్న సజ్జా చలపతి గారి ప్రయత్నానికి చేయూతనిస్తున్న ఆదర్శ శ్రమదాన వర్తమాన చరిత్ర అది!

               ఎప్పటిలాగే 11 మంది కార్యకర్తల కష్టం 4.20 కే ప్రారంభమయింది. 2 గ్రామాలకు చెందిన 34 మందికి అందులో ప్రమేయమున్నది. మైదానం పెద్దది కనుక, కార్యకర్తల సంఖ్య పలచగా కనపడింది.

               ఎక్కువ మంది ఈ పొలం తూర్పు అంచున - క్రొత్తగా వేసిన సిమెంటు రోడ్డు బారునా కనిపించారు. వాళ్ళ చేతుల్లో పారలు, దంతెలు, డిప్పలు, కనిపించాయి. ఏరిన ప్లాస్టిక్ తుక్కుల కోసమూ, గడ్డి పరకల -  చిత్తు కాగితాల, ప్రాత చిరుగు గుడ్డల కోసమూ వాళ్లతో బాటు ఒక చెత్త ట్రాక్టరూ ఉన్నది. 6.10 సమయంలో చూద్దును గదా - అది నిండిపోయి కనిపించింది.

               పడమటి ప్రక్కన - ప్రభుత్వ కార్యాలయాల ప్రహరీ వెలుపల ఈత చెట్ల సుందరీకరణలో కొందరు నిమగ్నులయ్యారు. అక్కడ మర రంపం చప్పుడు NTR పార్కులోని పాదచారులకు కనిపించినా, వినిపించినా ఎవ్వరూ శ్రమదాతలకు సహకరించ పూనుకోలేదు.

               తెల్లారాక చూస్తే - మైదానంలో మట్టి గడ్డలు లేవు, మైదానాన్ని చదును చేసిన రోలర్ అక్కడే ఉన్నది. రాబోయే కాలంలో వందలాది విద్యార్థుల - వేలాది ప్రజల ఆటలకూ, నడకలకూ, సేద తీరేందుకూ పనికొచ్చే స్టేడియం నిర్మాణమంటే మాటలా? ఎంత ఖర్చు? ఎంత శ్రమ? అన్నిటికీ సిద్ధపడుతున్న సజ్జా చలపతి మహాశయునికి చాతనైనంత సహకరించడం కార్యకర్తలకే గాదు.. గ్రామస్తులకూ, వివిధ సంఘాలకూ ధర్మం!

               చల్లపల్లి శ్రమదానం పట్ల చాలకాలం వ్యవసాయ కూలీగా పనిచేసిన ఒక ముఖ్య కార్యకర్త అభిప్రాయం ఇలా ఉన్నది: “బరువు పనులకలవాటు పడిన కూలీలు సైతం ఒక్కోరాజు మొరాయిస్తారు; స్వచ్ఛ కార్యకర్తలు మాత్రం 3820* రోజుల నుండీ ప్రతిఫలం కోరక ఇలా ఊరి కోసం శ్రమిస్తున్నారు.”

నేటి తుది సమావేశంలో :

1) మాలెంపాటి అంజయ్య గారి మేఘ గర్జా సదృశ నినాదాలూ

2) DRK గారి సమీక్షా వచనాలూ,

3) 3 వ తేదీ మధ్యాహ్నం తన కుమార్తె ఓణీ  వేడుకకు సాధనాల వారి ఆహ్వానమూ,

4) రేపటితో ఈ క్రీడా మైదాన పని పూర్తి చేయాలనే నిర్ణయమూ జరిగెను.

               ఇదొక వ్యసనం - ఇదొక సవనం

ఎన్ని ఏళ్లగ చూచుచుంటినొ – ఇదొక వ్యసనం - ఇదొక సవనం

ఎందరెందరు పొగడ వింటినొ – ఇదొక త్యాగం - ఇదనివార్యం

ఎన్ని గ్రామములను సరించినొ - ఇదొక మార్గం ఇదొక జ్ఞానం

ఇంతకన్నా స్థిత ప్రజ్ఞత ఎక్కడున్నదొ చెప్పు నేస్తం!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   01.04.2026