పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.
క్రీడా ప్రాంగణాల శ్రమదానమే – 6 వ నాడు కూడ! -@3822*
ఆదివారమంటే (3.5.26) స్వచ్ఛంద శ్రమదానంలో ఎపుడైనా ప్రత్యేకమే! కార్యకర్తల సంఖ్య ఆ రోజున అత్యధికమే! స్వార్థం లేని సామూహిక శ్రమదానంలో సందడి గురించి వేరే చెప్పాలా? నేటి కార్యకర్తల సంఖ్య అర్థశతకాన్ని దాటింది!
ఈ సందడి 18 మందితో 4.23 కే మొదలయింది, 6.12 దాక కొనసాగింది. ఆలోచించండి – 54 మంది ఇంత చీకటి వేళ - సొంత లాభానికి కాక - 28 వేల మంది గ్రామస్తుల ఆహ్లాద ప్రయోజనం కోసం పనిచేయడంలోని పరమార్ధమేమిటి? పొరుగూళ్ల నుండి కూడ కొందరు వచ్చి చేసే పనా అది? పోనీ - ఆ పనులెలాంటివి? చెత్త-మట్టి-బురద పనులా లేక సున్నితంగా బట్ట నలగకుండా - చెమట పట్టకుండా చేసే పనులా?
ముగ్గురు డాక్టర్లూ, ఇద్దరు వణిక్ప్రముఖులూ, ప్రస్తుత – గత కాలపు ఉద్యోగులూ, గృహిణులూ, రైతులూ చీకట్లో వచ్చి ఈ పొలం బాగు చేత పనుల్లో ఏం బావుకొందామని? ఇప్పటికే 12 ఏళ్లు ఊరి మంచి కోసం శ్రమించింది కాక, ఇంకెంత కాలం పాటుబడాలని?.... ఈ ప్రశ్నలన్నింటికీ చల్లపల్లి + పరిసర ప్రాంత ప్రజలు సమాధానాలు వెతకాల్సిందే!
సరే - వీళ్లంతా 6 రోజులుగా ఎవరేం చేశారు అనే దాని కన్నా – DRK డాక్టరుగారన్నట్లు – ‘అసలిందరు ఒక సామాజిక ప్రయోజనానికై చీకటితో ఇళ్ళు వదలి వచ్చి పనుల్లో దిగడమే ఒక సానుకూల పరిణామం!’ ఇందులో సగం మందికైతే ఈ శ్రమదానం అనివార్యం! కాళ్ళకో - చేతులకో దెబ్బలు తగిలినా - వాళ్లిక్కడికి రాక ఇళ్ల దగ్గర కూర్చోలేరనేది సత్యం!
“మనకున్న 24 గంటల్లో ఒక్క గంటైనా ఊరి మేలు కోసం పనిచేయకుంటే ఎలా?” అనేది వాళ్ళ దృక్పధం! పైగా ఈ సామూహిక సద్భావనా నందాన్నీ, DRK గారు వినిపించే సామాజిక – శారీరక ఆరోగ్యహితవచనాల్నీ, నందేటి వాని పాటల్నీ, శేషు గారి బోడి గుండు మీద పద్యాల్నీ వినకుండా ఉండలేరాయె!
ఈ పూట స్వచ్ఛ-సుందరోద్యమ నినాదాలు కూడ నందేటి శ్రీనువే!
నిన్నటి 5000/- విరాళం మాత్రం శంకర శాస్త్రీయం!
రేపటి వేకువ మనం కలుసుకొనేది NTR పార్కులో!
ఈ గాలిలొ చైతన్యము!
చల్లపల్లి లో మాత్రమె స్వచ్చోద్యమ విత్తనాలు
ముమ్మరముగ మొలకలెత్తి వృక్షాలుగ పెరుగునేల?
ఉన్నదేమొ ఈ గడ్డలొ ఉన్నతమగు భావజాల
మినుమడించుచుండు నేమొ ఈ గాలిలొ చైతన్యము!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
03.05.2026