3823* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.

ఈ నాటి (సోమ- 4.5.26) శ్రమదాన స్థలి NTR పార్కు - 3823*

               ఎందరి ఆలోచనలో-ఆర్థిక వనరులో-శ్రమలో తోడు కాగా, పట్టణ స్థాయికి చేరుతున్న చల్లపల్లికొక బహుళ ప్రయోజనకర పార్కు ఏర్పడింది. దాన్ని శుభ్రపరిచే సదవకాశం ఈ వేకువ 4:20-6:10 కాలంలో స్వచ్ఛ కార్యకర్తలకు దక్కింది!

               ఈ స్వచ్ఛంద శ్రమదాతలదేముంది - ఏ ఋతువైనా వాళ్ళకొకటే – ప్రతి రోజూ గంటన్నర సమయాన్ని తమ గ్రామ సమాజ సంక్షేమం కోసం గడుపుతూనే ఉంటారు! నిన్నటి దాక 6 రోజులపాటు పార్కు ప్రక్క పొలం, నేడు NTR పార్కు అంతర్భాగం! వాళ్ళకు కావలసింది ఈ బ్రహ్మకాలపు శ్రమతో శరీరారోగ్యమూ, సదరు శ్రమ తమ ఊరికి అక్కరకు వస్తుంది గదా అనే సంతోషంతో కలిగే మానసిక ఆరోగ్యమూ!

               ఈ పార్కులో ఈ పూట ఏకకాలంలో గ్రామస్తుల నడకలూ, జిమ్ లో కొందరి దేహదారుఢ్య చర్యలూ, షటిల్ వగైరా క్రీడలూ, 49 మంది కార్యకర్తల శ్రమ సమర్పణలూ జరిగిపోయినవి!

               2 ఎకరాల విశాలమైన పార్కు లోపలి నాలుగు వైపులా పడి ఉన్న ఎండుటాకులూ, పుల్లలూ, కొమ్మరెమ్మలూ ఇతర వ్యర్ధాల మీదే స్వచ్ఛ కార్యకర్తల దృష్టి పడింది. ఊడుపులూ, కాగిత వ్యర్ధాల ఏరుడులూ, డిప్పలతో వాటిని ట్రాక్టర్  లో నింపుడులూ..... అన్నీ ఇవాళ శాస్త్రోక్తంగా జరిగినవి!

               6.25 కు కాబోలు - అందరొక చోట చేరి, ముక్తకంఠాలతో అడపా గురవయ్య గారి ననుసరించి, శ్రమదానోద్యమ నినాద లాంఛనాన్నీ పాటించి,

               మాలెంపాటి డాక్టరు వారి నెలవారీ చందా 2,000/- DRK గారు అందుకుని,

               రేపటి వేకువ శ్రమదాన రంగస్థలం NTR పార్కుగా నిర్ణయించారు.

                    తక్కువేమి తినలే.

చుట్టు పట్ల గ్రామాలూ తక్కువేమి తినలే

యార్లగడ్డ - ఘంటశాల- అవనిగడ్డ – వక్కలగడ్డ...

వందలు - వేల దినమ్ముల స్వచ్చ సేవ లాచరించె

అందుకనే ఈ ప్రాంతము ఆదర్శము రాష్ట్రానికి!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   04.05.2026