పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.
N.T.R. పార్కులో స్వచ్ఛ కార్యకర్తల + నడక మిత్రుల శ్రమ తీరు - @3824*
సొంత లాభం కొంత మాని, సమాజ చింతన బయలుదేరి, ఈ మంగళవారం (5.5.26) వేకువ 4:20-6.12 AM ల నడుమ 41+20 (కార్యకర్తలు + వాకర్స్) = 61 మంది నెరవేర్చిన సామాజిక సామూహిక శ్రమదానం కన్నార్పకుండా చూశాను!
వీరిలో 30% మంది ఇళ్ల వద్ద విశ్రాంతి తీసుకొనే వయసు వాళ్ళు, దర్జాగా బ్రతకగలిగిన స్థితిమంతులు! ఐనా వేకువ సమయాన ఐచ్చికంగా వచ్చి, గ్రామమంతటికీ బహుళ ప్రయోజనకరమైన NTR పార్కులో
1) గడ్డి పీకే,
2) తుక్కులేరే
3) పల్లాలను చదును చేసే
4) వాకింగ్ ట్రాక్ చుట్టూ చెట్లకు పాదులమర్చే
5) జిమ్ ప్రక్కన భారీ మట్టి పెళ్లల్ని త్రవ్వి తిరగేసే
6) పార్కు తూర్పు భాగంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లను ఎత్తే
7) పోటీలు పడి చెత్త డిప్పలు మోసి, చెత్త బండికందించే
8) పాము పుట్టల్ని తొలగించే....
రకరకాల శ్రమలకెందుకు పాల్పడినట్లు?
వాళ్లని ఏ ఆదర్శం రెండేసి గంటల సమయదానం చేయించింది?
దాదాపు 90% మందిని చెమటతో తడుస్తూ, ఉసూరుమనికాక - హుషారుగా పనికి పురికొల్పింది?
నావంటి వారికొచ్చే ఇలాంటి సందేహాలకు 6.25 కు జరిగిన సమావేశంలో DRK గారి నుండి సమాధానం వచ్చింది !
రాష్ట్రంలో మరెక్కడా సుదీర్ఘంగా, ఉత్సాహంగా జరగని ఇంత శ్రమదానానికి కారణం చల్లపల్లి ప్రత్యేకతట! ఎన్ని ప్రజాసంఘాలు, రాజకీయ పక్షాలు, పంచాయి తీ, గ్రామ ప్రముఖులు ఎంతగా సహకరించిందీ ఆయన ఏకరువు పెట్టారు!
గ్రామ ఉపసర్పంచ్ ముమ్మనేని నాని గారు ఈ పార్కు గత వర్తమాన పరిస్థితుల్ని వివరించి, ఇకముందు కూడ స్వచ్ఛ కార్యకర్తల - గ్రామస్తుల పరస్పర సహకారం తో పార్కు ఎలా ఉండబోతున్నదీ వివరించారు!
BC వసతి గృహ ఉద్యోగిని రమాదేవి గారి పని ఉత్సాహాన్ని చూశాను. ఆమె ప్రకటించిన నినాదాలను 60 మంది సమర్థించడం గ్రహించాను.
ఇందరు స్వచ్ఛంద శ్రమదాతల పట్టుదల, గామ్రస్తుల - ముఖ్యంగా నడక మిత్రుల చొరవ, సహకారాలతో ఈ చల్లపల్లి ప్రత్యేకత ఇకపై కూడ నిలిచి ఉంటుందని నమ్మాను!
రేపటి వేకువ కూడ ఇదే NTR పార్కులోనే పనిచేయాలనే నిర్ణయం తెలుసుకొన్నాను!
ప్రభుత్వాల ఆర్డర్లతొ
స్వచ్చ శుభ్రతా చర్యలు చాల వరకు నెరవేరెను
ఫ్లెక్సీలూ – సింగిల్ యూజ్ ప్లాస్టిక్కుల సంగతేమి?
ప్రభుత్వాల ఆర్డర్లతొ పనులన్నీ జరగవు గద!
చల్లపల్లి ప్రజలందుకు సహకరించి తీరవలెను!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
04.05.2026