3828* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.

3828* వ నాటి NH 216 సేవలివే!(శనివారం- 9.5.2026).

               ఆ రహదారి సంస్కరణలు గాని, సంస్కర్తల సంఖ్య గాని, పని వేళలు గాని మామూలుగా లేవు! సమయం 4.20 నుండి 6.10 ; కార్యకర్తల సంఖ్య 45; జరిగిన పనులైతే – ఇటు రహదారిలో 50-60 గజాలు, అటు చల్లపల్లి దిశగానైతే మరో 50-60 గజాలు! స్థానిక గుడి నుండి చెక్ పోస్టు దాకా మరీ లోతైన డ్రైను కూడ!

               కంటికి కనబడే ఈ కొలతలకేం గాని, ఈ 45 మంది మనసుల్లోని గ్రామం పట్ల ఔదార్యాన్నీ, తామే కాక- తమ గ్రామస్తులంతా మరింత శుభ్రంగా, సౌకర్యంగా, ఆహ్లాదంగా బ్రతకాలనుకొనే వాళ్ళ ఆశయాన్నీ ఎలా కొలవగలను?

               కనీసం 4 ఊళ్లకు చెందిన కార్యకర్తలు గడప దాటి, ఊరి పొలిమేరలుగడచి, కాలుష్యాల వేటలో 3-4 కిలోమీటర్లు వేకువ సమయాన వచ్చి, ఉక్కపోతను లెక్కచేయక, చెమటకు తడిసిన ముఖాలతో – బట్టలకు మరకలతో రోజూ ఇలాంటి శ్రమదానం ఎందుకు చేస్తారో ఎలా వివరించగలను?

               వందల సంఖ్యలో ఉన్న సమీప కాలనీ నుండి ఇద్దరంటే ఇద్దరు వచ్చి కార్యకర్తలకు సహకరించారంటే – అటు కాసానగర జనులు 2 రోజులకొక మారు పంచాయతి బండి వస్తున్నా రహదారినీ, డ్రైనునూ వ్యర్థాలతో నింపుతున్నారంటే- చెక్ పోస్టు వెనక డ్రైను బండెడు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లతో మునిగి తేలుతున్నదనగా – స్వచ్ఛ కార్యకర్తల శ్రమను అర్థం చేసుకున్నట్లా? 10% శాతం స్పూర్తయినా పొందనట్లా?

               ప్రస్తుతానికైతే మాత్రం ఇప్పటి, అప్పటి ఉపాధ్యాయులూ, ఆస్పత్రి సిబ్బందీ, వ్యాపార- వ్యవసాయ వృత్తుల వారూ, ఇంకా ఇతర పుణ్యాత్ములూ 3 డివైడర్లలో కలుపు పీకి, మొక్కలను సంరక్షించి, ఎక్కడా కాగితపు ముక్కైనా లేకుండా ఏరి, రహదార్లను ఊడ్చి, క్రొత్త సిమెంటు రోడ్డు దాహం తీర్చి, బండెడు తుక్కును ట్రాక్టర్ లోకి ఎక్కించి, ఆ జంక్షన్ ను సర్వాంగ సుందరం చేశారు!

               చూద్దాం – ఈ స్వచ్ఛ శుభ్రతలెంత కాలం నిలుస్తాయో, సిమెంటు బాటను స్థానికులు ఆరగారగా తడుపుతారో చూద్దాం!

               ఈ ఉదయం నల్లూరి శివకుమారి చందా 10,000/- మనకోసం మనం ట్రస్టుకు అందాయి! అకౌంటెంట్ శారద గళవినిర్గళ ఉద్యమ నినాదాలు వినిపించాయి!

               నేటి శ్రమ సందడికి DRK డాక్టరు తో సహా, సజ్జా చలపతి గారితో సహా చాలమంది మనసులు మురిశాయి!

               రేపటి వేకువ శ్రమ NTR పార్కులోననీ, ఆదివారం ఉదయం 9.00, 10.00 మధ్య బైపాస్ వీధి క్రికెట్ స్టేడియం MLA, MP గార్లతో ప్రారంభమనీ ప్రకటించారు.

               “అనగననగ రాగము....”

దశాబ్దాల-తరతరాల అలవాటులు బలమైనవి

చప్పున మారడమంటే సాధ్యపడక పోవచ్చును

“అనగననగ రాగము....” వలె ఆపవచ్చు అలవాట్లను

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లకు చెక్ పెట్టుట సాధ్యమే!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   09.05.2026