3831* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.

మంగళవారం(12-5-26) శ్రమ వేడుక ఇలా ఉన్నది! -@3831*

               ఇది కూడా 4.20 కే 16 మందితో అకురార్పణ జరిగి, 6:00 కు బదులు 6:06 కు ముగిసింది. తుది సభలో నేను లెక్కించింది 46 మందిని. దృష్టి చికిత్స కారణంగా కొన్నాళు స్వచ్ఛ సేవకు హాజరు కాని సీనియర్ కార్యకర్త శ్రీమాన్ సజ్జా  ప్రసాదు గారు నేటి నినాదకుడు!

               NTR పార్కు, శుభ్ర - సుందరీకరణకు ఈ పూట 3 చోట్ల - 4 విధాలుగా ప్రయత్నం జరిగింది. పాతికమంది పార్కు దక్షిణ భాగపు ఎగుడుదిగుడు చోటులో కష్టించారు. ఆ 5 సెంట్ల జాగాలో పెరిగి ఎండిన గడ్డి పని బట్టడమే వాళ్ళ ధ్యేయం. కొందరు నేలపై చతికిలబడీ, కొందరు వంగీ, నిలబడి తమ సొంతింటి పనిలాగా చేసుకు పోతుంటే -,

               ఎప్పటికప్పుడు కోసిన – పీకిన, దంతెలతో ప్రోగులు చేసిన, తుక్కునూ - ప్లాస్టిక్ తదితర వ్యర్ధాలనూ డిప్పలతో ట్రాక్టర్ లోకి చేరుస్తుంటే –

               ఆ ట్రాక్టర్ లో ఆనందరావు మనుమరాలు ‘హారిక’ వాటిని సర్దుతుంటే –

               ఆ మనోహర శ్రమదాన దృశ్యాన్ని అరగంటపాటు కన్నార్పక చూశాను!

               రెండవ దృశ్యం పార్కు ఉత్తరాన 10 మంది పుల్లలేరిన, ఆకులు ప్రోగుచేసిన, మిగిలిపోయిన గడ్డిని సేకరించినది.

               చివరి అరగంట షటిల్ కోర్టు పడమరగా ఎండి, మృతి చెంది, పబ్లిక్ టాయిలెట్లపై పడిపోయే అవకాశమున్న చెట్టును తొలగించిన 10 మంది గట్టి పనే!

               ఒక దుర్గా ప్రసాదు మరరంపంతో కోయడమూ, ఇద్దరు పర్యవేక్షించడమూ, దానికి మోకు బిగించి, ఏడెనమండుగురు బలంగా లాగడమూ, చాలసేపు ప్రతిఘటించిన చెట్టు నెమ్మదిగా వాలిపోవడమూ!

               ఈ సందడిని చూస్తూనే చీపుళ్ల వారు ఎక్కడవసరమైతే అక్కడికి వెళ్లి శుభ్రపరుస్తూనే ఉండిరి.

               ఆ గంటన్నర పాటూ NTR పార్కులో ఏ ఒక్కరిదో కాని, ఊరి ఉమ్మడి ప్రయోజనం కొరకు చెప్పుకోదగ్గ సంఖ్యలో 40 మంది ప్రయత్నించడం దగ్గరుండి చూస్తుంటే - ఎవరైనా దీన్నొక నాటిక గానో, కవిత గానో, గాన కళారూపంగానో ప్రదర్శిస్తే ఎంత బాగుండునో గదా అని అలోచించాను!

               (నా వెర్రి గాని ఇలాంటి శ్రమ సంస్కృతీ కళారూపాల్ని ఆదరించే రోజులా ఇవి?)

               రేపటి వేకువ కూడ NTR పార్కులోనే మిగిలిన పనులు ముగిస్తారని తెలిసింది!

               సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లకు

పర్యావరణకు వచ్చే ప్రమాదాలు తెలుసుకొనిన

భావితరం మనవలెనే బ్రతకాలని తలచుకొనిన

మైండు సెట్లు , నిర్ణయాలు మనం మార్చుకోగలిగిన

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లకు చెక్ పెట్టుట తేలికే!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   12.05.2026