3832* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.

చల్లపల్లి సామాజిక ప్రయోజనంలో ఇంకో రోజు @3832*

               ఆ రోజు బుధవారం (13.5.26), ఆ మంచి పనికి కలిసొచ్చిన సత్కార్యకర్తలు + నడక మిత్రులూ  (38+17=) 55 గురు, గ్రామ ప్రత్యేకతకు నిదర్శనంగా - దశాబ్దంగా ఊరికి ఉపయోగపడుతూ, సదరు సేవలందుకొన్నది NTR పార్క్! దానికి ముహూర్త కాలం వేకువ 4.18-6.12.

               ఇక తమకు తెలిసి గాని, తెలియకుండానే గాని పదిమందికీ పనికొచ్చే పార్కు శుభ్ర – సౌందర్య సాధనలో 8 వ రోజు కూడ తలా గంటన్నర కాలం శ్రమించి, అందుకు ఆనందోత్సాహాలనుభవించిన ఈ అర్ధ శతాధిక కార్యకర్తలు –

               6.25 కు పార్కు నడుమ నిలబడి, శ్రమదానంలో విశేషానుభవజ్ఞుడైన తూము వెంటేటేశ్వరుడు మనసారా ముమ్మార్లు పఠించిన ప్రతిజ్ఞాత్మక నినాదాల సమయంలో ఆ శ్రమదాన అనుభూతి ప్రతి వారి ముఖంలోనూ కనిపించింది.

               ఈ పార్కు పనులకు తొలి 2 రోజులు తటపటాయించిన - 11 ఏళ్ళ క్రితం రిటైరైన - అవనిగడ్డకు చెందిన పెద్దాయన ఎంత ఉత్సాహంగా ఎండు కొయ్యల్ని మోసి, ట్రాక్టర్ లోకి అందిస్తున్నదీ చూసి మాట్లాడాను. అప్పుడనిపించింది -

               “ఈ పార్క్ వాకర్స్ వారానికొక మారైనా ఇతర చోట్ల జరిగే శ్రమదానంలో కూడా పాల్గొంటే ఎంత బాగుంటుందో!” అని!

               ఒక రెవెన్యూ ఉద్యోగి - వెంకటేశ్వరరావు గారు 10 రోజుల శ్రమదానంతో NTR పార్క్ ను సుందరీకరించిన స్వచ్ఛ కార్యకర్తల్నీ, ముఖ్యంగా DRK డాక్టర్నీ పొగడి, కాస్త ఇబ్బంది పెట్టారు!

               “ఆఫ్టరాల్ మనం చేస్తున్నది బాధ్యతే! అందుకింతగా మెచ్చుకోవాలా అనేది స్వచ్ఛ కార్యకర్తల దృఢ అభిప్రాయం!

               అష్ట దినానంతరం ఈ ఉదయం పరీక్షగా చూస్తుంటే తెలిసింది –

1) పార్కులో గడ్డి లేదు

2) ఎండు చెట్లు వెక్కిరిస్తూ నిలిచి లేవు

3) చాల చెట్లకూ, మొక్కలకూ అందంగా పాదులు కనిపించాయి!

               ఒక సామూహిక మానవ శ్రమ ఏం సాధించగలదో అర్థమయింది! చాల చోట్ల ఆగిపోయిన శ్రమదాన చరిత్ర చల్లపల్లిలో మాత్రమే సజీవంగా - సముజ్జ్వలంగా ఎందుకు కొనసాగుతున్నదీ అవగతమయింది!

               మన వేకువ శ్రమదానం రేపు కాసానగర్ చెక్ పోస్టు వద్దకు మారబోతున్నది!

               మనుగడకిది వాగ్దానం!

ఇంతటి శుభ్రత- స్వచ్ఛత ఎండమావులను కొనకుడు

హరిత కలిమి, పూల మిసిమి తాత్కాలికమని తలపక

ఈ పుష్కర నవ సంస్కృతి కృత్రిమమని భావించక

ఇది కొనసాగించుటే నయం! మనుగడకిది వాగ్దానం!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   13.05.2026