3837* వ రోజు....

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.

18.5. 26 -  సోమవారం కాసానగర్ వద్ద ఎగిరిన శ్రమ పతాకం! -@3837*

               NH -216-రహదారి శ్రమ జెండా ఎగుర వేసిన 29 మందిలో శలవుల్లో ఉన్న ప్రస్తుతోపాధ్యాయులూ, 17-18 ఏళ్ళ నాడు ఉద్యోగాలు మానిన కొందరు పెద్దలూ, రైతులూ, చిరుద్యోగులూ, వృత్తికారులూ ఉన్నారు.

               మోతుకూరి వెంకటేశ్వరరావు గారి దౌహిత్రి చిరంజీవి లక్ష్మీ చేతన/చిట్టి కూడ నేటి శ్రమదానంలో క్రొత్తగా చేరింది.

               ఇక కార్యకర్తల కష్టం సంగతికొస్తే - ఐదారుగురు తాము హద్దుగా పెట్టుకొన్న కాసానగరం చివరిదాక రోడ్డు దుమ్ము దులిపి, ప్లాస్టిక్ తుక్కులు ఏరి, ఉమ్మెత్త - ఉత్తరేణి గరిక వంటి పనికిరాని మొక్కల్ని వేటాడి, గుంటగా మారుతున్న రహదారి మార్జిన్ ను మెరకవేసి, నేను చూసే సమయానికి కాస్తంత అలసటగానూ, ధారలుగా చెమటతోనూ కన్పించారు!

               10 రోజుల్నుండి బాగా వేకువ శ్రమదానానికి అలవాటుపడిన అనిల్ – జాన్స్టన్ ఉపాధ్యాయ ద్వయం మట్టి - కలుపు పనుల్లో నిమగ్నులై ఉన్నారు. సీతారామయ్యా, కస్తూరి – బృందావన - BSNL వంటి బరువు పనుల ముదురు కార్యకర్తలు పనుల కాక మీదున్నారు. మరో అరేడుగురు ఖడ్గధారులూ, దంతె వీరులూ, ఏటవాలు చోట చెతుర్లాడుకొంటూనే అరబండెడు వ్యర్ధాల్ని తయారుచేశారు. శంకర- వెంకటేశ్వరులు తాము శ్రమిస్తూనే ప్రక్కవాళ్లకేవో పని సూచనలిస్తున్నారు.

               అక్కడికి కాస్త దూరంగా రహదారి దక్షిణపు భాగాన్ని మెండు శ్రీనివాసుడొక్కడే శుభ్రపరుస్తున్నాడు. జాస్తి-మల్లంపాటి-సజ్జా-బొందలపాటి కార్యకర్తలైతే డివైడర్లను ఇంకా ఇంకా బాగుచేస్తుంటే చూశాను.

               గురవయ్య మహాశయుడికి ఒక్క నెలలోనే 3 వ మారు స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలూ, సూక్తులూ వినిపించే అవకాశం వచ్చిందని కొందరనుకొంటుంటే విన్నాను!

               ఆరోగ్యప్రదమైన ఆహారపుటలవాట్లను గూర్చి వరుసగా – ఉప్పు వాడకం, తీపి వస్తునివారణం, గ్రుడ్లు - మాంసాల ప్రయోజనం గురించి చెప్పుకొస్తున్న DRK వైద్యుల వారు ఈ పూట పాకెట్ల నూనెలు కాక నెయ్యి, గానుగ పట్టిన కొబ్బరి, పల్లీ నూనెల ప్రయోజనం గురించి వివరించారు!

               ఈ సందడంతా ముగిసి, రేపటి శ్రమదానం NH-216 జంక్షన్ కు తూర్పుగా కొనసాగించాలని ప్రకటించి అంతా గృహోన్ముఖులయ్యారు!

               స్టీఫెన్ అను శాస్త్రజ్ఞుడు

ఇటీవలే చెప్పెను గద స్టీఫెన్ అను శాస్త్రజ్ఞుడు

భూమికి ఇక పదివేలే వత్సరాలు మిగిలాయని

సర్వ నాశనం దిశగా సాగుతొంది ప్రపంచమని

కనీసం ఇప్పుడైన ప్లాస్టిక్ లను వదిలేద్దాం!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

 

   18.05.2026