3838* వ రోజు....

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.

3838* వ నాటి శ్రమదాన సంఘటితోద్యమ ప్రశ్నలు - జవాబు!

               నిన్నటికన్నా హెచ్చుగా – 30 మందిగా కార్యకర్తలూ, నిన్నటి చోటనే - అంటే NH 216. కాసానగర్ జంక్షన్ సమీపంలోనే - జరిపిన అభిలషణీయ శ్రమదానమెట్టిది? దాని పర్యవసానమేది?

               ఇటీవలి గ్రామ - రాష్ట్ర చరిత్రలో కనీ - వినీ ఎరుగని ఈ సామూహిక శ్రమదానమెందుకో - 40 రోజుల్నాడు వెలువరించిన

               “చల్లపల్లిలో ఏం జరుగుతోంది?

               ఎందుకు జరుగుతోంది?

               అనే సచిత్ర గ్రంథం చూస్తే చాల వరకు అర్థమౌతుంది. కార్యకర్తలు ఆవిశిష్ట పుస్తకాన్ని పనిగట్టుకొని ఇతర గ్రామస్తుల చేత, దూర బంధువుల చేత చదివిస్తే మంచిది.

               ఈ మంగళవారం సైతం వేకువ 4.30 బదులు 4:20 కే డజను మంది ఇళ్ళకు మూడేసి కిలోమీటర్ల దూరంలో వెళ్లి, ఎందుకు క్రమక్షణగా నిలబడ్డారు? అక్కడ చేయబోయే దుమ్ము -  చెత్త పనుల కోసం అత్రుతగా ఎదురుచూడాలా?

               అందులో ఆరుగురు కార్యకర్తలు ఏదో మ్రొక్కుబడిగా పని చేసి, పేపర్లకా ఫోటోలు అందించితే చాలదా? అంతగా బట్టలు చెమట+దుమ్ముతో వంటికి అంటుకుపోయేట్లు శ్రమిస్తారా?

               6, 7 తరగతుల లక్ష్మి చేతన, అనందుని మనుమరాలు హారిక ఈ చిన్న వయసులోనే చెత్త పనులకలవాటు పడనేల?

               ఈ బడి పంతుళ్ళకూ, మహిళలకూ, పెన్షనర్లకూ వేరే కార్యక్రమాలు లేనట్లు రోజూ చాల మంది దృష్టిలో అసభ్యకరమైన ఈ రహదార్ల బాగుచేతలవసరమా?

               ఏ రోడ్లో గుంటలు పడితే – బరంతులు లేని అంచులు విరిగిపోతుంటే – ఆ డాక్టర్లిద్దరికీ ఏం ప్రమాదమాట?

               33 వేల చెట్లు నాటి నీరందించే పనులేనా ఈ 40-50 మందిని ఆకర్షించేది?

               ఒక జిల్లా అధికారి ఐ ఉండి నిన్న బాలాజీ గారు మన గ్రామ స్వచ్ఛ వైద్యునితో “అందరూ- అన్ని చోట్లా మీ చల్లపల్లి కార్యకర్తల్లాగా ఉండరెందుకు”? అని ప్రశ్నించి, మదనపడుటెందుకు?

               ప్రతి రోజులాగే ఈ ఉదయం కూడ 6.20 కి విలేకరి గారి ననుసరించి, అందరూ గ్రామ శుభ్ర – సుందరీకరణ ప్రతిజ్ఞలు చేయనేల?

               [షరా : ఈ ప్రశ్నలన్నింటికి సమాధానమే 11 ½  ఏళ్ల చల్లపల్లి స్వచ్ఛ సుందర శ్రమదానం!]

               రేపటి వేకువ కష్టం చేయదలచిన వారు NH-216 కాసానగర్ చెక్ పోస్టు వద్ద కలవాలని నిర్ణయం!

               కడతేరడమూ తధ్యము

ప్లాస్టిక్ పాపాల బరువు ప్రజలు మోయకా తప్పదు

కాన్సర్ కోరలకు చిక్కి కడతేరడమూ తధ్యము!

వాడకాల నిషేధాలు వ్యర్థ ప్రయత్నాలెసుమా!

ఉత్పత్తుల నాపేస్తే ఒనగూడును సత్ఫలితము!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   19.05.2026