3839* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.

3839* వ నాటి (బుధ-మే-20) 33 మంది శ్రమ చరిత్ర!

               గ్రామ - రాష్ట్ర - దేశ జనాభాలో ఏదో 10% శాతం మందికి తప్ప - ఈ చెత్తపనుల చరిత్ర ఎవరు చదివి ఆచరిస్తారు గనుక! ఏ గ్రామం వెలుపల ఎన్ని ట్రక్కుల చెత్తలు – అందులోనూ ప్రామాదిక ప్లాస్టిక్ ఛండాలాలు అనకొండల్లా పేరుకుపోయాయో ఈ అల్ప సంఖ్యాకులకు తప్ప ఎవరికి పట్టిందిలే! శాస్త్రజ్ఞుల మొత్తు కోళ్లూ, దార్శనిక మేధావుల భయాందోళనలూ ఏ గాలికి కొట్టుకుపోయినవో ఎవరికెరుక!

               నేటి శ్రమదాన ముగింపు సభలో DRK డాక్టరు గారు మన జిల్లా కలెక్టరు గారు ప్లాస్టిక్ వస్తువుల - ఫ్లెక్సీల నిషేధం అమలులో బాగా పట్టుదలగా ఉన్నట్లూ, MLA బుద్ధప్రసాదు గారు గట్టి నిర్ణయం తీసుకొన్నట్లూ చెప్పటం మాత్రం నిజంగా మన ప్రాంతపు పర్యావరణ రక్షణకు శుభవార్తే!

               నేతలకు చిత్త శుద్దీ, పాలకులకు నిబద్ధతా, ప్రజలకు కాస్త అవగాహనా ఉండాలే గాని, చల్లపల్లిలో తలెత్తిన ఈ ఫ్లెక్సీ షేమ్ ఉద్యమం దేశవ్యాప్తంగా దినదిన ప్రవర్థమై పర్యావరణానికి హామీ ఇవ్వకపోతుందా?

               ఎప్పటిలాగే నేటి వేకువ కూడ 13 మంది 4.20 కే NH216 – కాసానగర - చెక్ పోస్టు ప్రాంతంలో మొదలెట్టిన రహదారి సుందరీకరణం 6.03 కు ముగిసి, ఆలోగా –

               ఆరేడుగురి శ్రమతో మేకలడొంక ప్రారంభంలో ఓ పాతిక గజాలూ, డివైడర్ ల శుభ్రతలో నలుగురూ, మిగిలిన వారు రహదారి ఉత్తరపు కాలుష్యాల తొలగింపులోనూ కష్టించారు!

               6.15 కు జరిగిన సమీక్ష సభలో :

1 ) అనిల్ మాస్టారి స్వచ్ఛ – సుందరోద్యమ నినాదాలూ,

2) వాలంటీర కష్టం పట్ల DRK గారి అభినందనలూ,

3) రేపటి వేకువ సైతం ఇదే 216 వ రహదారి సుందరీకరణనే ఎన్నుకొన్న కార్యకర్తలూ.

               ప్రత్యామ్నాయములు కలవు!

ఓ మా మంచి ప్రభుత్వమా! ఉత్తుత్తి కబుర్లెందుకు?

ఆచరణకు దిగకుండా ఆర్డర్లేయడ మెందుకు?

(ప్లాస్టిక్ వాడుక మానని పరిస్థితులు ఈ రోజున!)

ఉత్పత్తుల నాపేస్తే ప్రత్యామ్నాయములు కలవు!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   20.05.2026