3840* వ రోజు....

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.

3840* రోజులకు చేరిన చల్లపల్లి శ్రమదానం! (గురు-21.05.2026)

               నిన్న 46* కు పైగానూ, బహుశా నేడు ఇంకాస్త ఎక్కువగానూ – వేడి వాతావరణంలో - ఊరికి దూరంగా NH216 జాతీయ రహదారి వద్ద – వేకువ 4:20 కే 10 మంది, కాస్త లేటుగా మరో24 మంది 5:58 దాక శ్రమించడమే ఒక ఆశ్చర్యం! అది ఏఒక్కరిసొంతాని కోకాక సమాజానికి పనికొచ్చే కృషి కావడమే ఈ కాలపు అద్భుతం!

               ఇక - ఆ ఆదర్శ శ్రమదానం అవిచ్ఛిన్నంగా 11 ½ సంవత్సరాలుగా జరుగుతున్నదంటే దానికేం పేరు పెట్టాలి?

               పనిచేయక ఖాళీగా నిలబడినా చెమటలు కారే క్లిష్ట వాతావరణంలో 3 కిలోమీటర్ల దూరాన – కాసానగర్ చెక్ పోస్టు సమీపాన వారాల తరబడీ 40-50 మంది శ్రమను ధారాదత్తం చేస్తున్నారంటే - ఆ స్వచ్ఛ కార్యకర్తలు సాంతం పిచ్చోళ్ళన్నా అయి ఉండాలి లేదా తరతరాలకూ మార్గదర్శకులు కాగల మహనీయులన్నా అయుండాలి!

               ఇంతకుముందు ఆ రహదారిలో కష్టించడం వేఱు - ఈరోజు 34 మంది రహదారి శుభ్ర - సౌందర్యాల కోసం ప్రాకులాడడం వేఱు!

               చెక్ పోస్టుకు 120 గజాల తూర్పున రోడ్డు రెండు పక్కలా 90 నిముషాల రకరకాల కృషిలో సింహభాగం కాసానగర్ జంక్షన్లోనే పాతిక మందిదే!

               నన్ను ఒక కార్యకర్తగా కాక - ఒక అగంతకునిగా ఊహించుకొన్నప్పుడు - ఆ 2 రోడ్ల కూడలిలో :

- ముళ్ళ - పిచ్చి మొక్కల్ని కత్తుల కార్యకర్తలు తొలగించిన,

- డ్రెయిన్ లో దిగి, అడ్డంకులు తొలిగిస్తున్న కష్టాన్ని,

- చెమటకు తడిసిన బట్టలకు గ్రుచ్చుకొన్న ఉత్తరేణి ముళ్లతో ఇద్దరి ఆకారాన్ని,

- ఎగుడుదిగుడు - రాళ్లముక్కల చోట దంతెలతో వ్యర్ధాలను పోగులు చేసి, డిప్పలకెత్తి, మోసి, ట్రాక్టర్ లో నింపుతున్న మహిళల్నీ,

- పని విరమణ విజిల్ మోగితే అయిష్టంగా పని ఆపుతున్న 5 గుర్నీ చూస్తే అదొక వింతలోకంగానే అనిపించింది!

               నేటి తుది సమావేశపు విశేషాలు:

- రాబోవు ఏడెనిమిది రోజులు దుర్భర వాతావరణం పట్ల - వడదెబ్బల పట్ల DRK గారి హెచ్చరికలూ -  జాగ్రతలూ,

- తన 40 వ వైవాహిక వార్షికోత్సవ వేళ తగిరిశ సాంబశివరావు గారి 500/- విరాళమూ,

               రేపటి వేకువ కూడ ఈ NH 216 – కాసానగర్ కూడలి వద్దనే కలవాలనే నిర్ణయమూ!

               ఈ కాలపు రాక్షసులగు

అలనాటి పురాణముల కలవు పుణ్య గాథలెన్నొ

రాక్షస సంహరణములూ – బ్రాహ్మణ గోరక్షణములు

ఈ కాలపు రాక్షసులగు సింగిల్ యూజ్ ప్లాస్టిక్కులు

ఈ రాక్షస సంహారము ఇంకెన్నాళ్లకు జరుగునొ!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   21.05.2026