పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.
శనివారం (23.05.2026) నాటిది 3842* వ శ్రమదానం!
ఈ జాతీయ రహదారి(NH216) కాసానగర్ కూడలి అదృష్టమే అదృష్టం! ఇటు కాసానగర్ పడమటి, ఉత్తరపు హద్దులు దాక, అటు మేకలడొంక కలయిక దాక 35 మంది శ్రమతో - ఏకొంచెం సౌందర్య స్పృహ ఉన్న వాళ్ళకైనా ఈ సువిశాల శుభ్ర రహదారీ, దాని ఉభయ మార్జిన్ లూ, డ్రైన్లూ, ఎంతగా ప్రయాణికుల్ని ఆకట్టుకుంటున్నవో ఆలోచించండి!
నేటి - అంటే 14 వ నాటి శ్రమ ఫలితాల్లో పేర్కొనదగిన దృశ్యాలివి:
1) మేకలడొంక కలయిక వద్ద గంటపాటు పిండి జ్యోతి 3 చింత మొక్కలకు అందంగా ఏర్పరచిన పాదులు, కొందరు కార్యకర్తల ప్రశంసలు,
2) అటుకింకా పడమరగా రెల్లు గడ్డి పొదల్నీ, పిచ్చి-ముళ్ళమొక్కల్నీ నామరూపాల్లేకుండ కడతేర్చిన కోడూరి, అంబటి, మల్లంపాటి, సజ్జా, ఆకుల, పల్నాటి, భోగాది, కస్తూరి, పేరుబోయిన, పసుపులేటి, గంధం, బాణావాతు వంటి 12 గురూ సాధించిన సమష్టి విజయమూ,
3) ఆ ఎగుడు దిగుడు చోట్ల చీకట్లోనే వివిధ చెత్తల్ని మోసి, ట్రాక్టర్ లోకి జరిగిన ఎగుమతీ,
4) రహదారి నుండి ఇద్దరు మనుషుల లోతు డ్రైన్ ఆరేడుగురి శ్రమతో తాటాకుల-ఎండు గడ్డి పరకల బెడదపోయి శుభ్రపడిన వైనమూ,
5) రోజుటి వలె కాక ఈ ఉదయం 5.50 కే పనులు ముగిసిన సంగతీ, కాఫీ సమయంలోని స్వచ్ఛ కబుర్లూ, చెతుర్లూ...... ఇది వేరే విషయం!
ఆస్పత్రి సిబ్బంది 8 మంది గ్రూప్ ఫోటో చూశారా? పని ముగిసిన సంతృప్తి వాళ్ల ముఖాల్లో కనిపిస్తుంది గదా!
ఎంతైనా పాటగాడూ, వ్రాతగాడూ కాబట్టి నందేటి శ్రీను ముమ్మారు చెప్పిన నినాదాలు లయబద్ధంగా ఉండవా?
రేపటి పని చోటేది – అనే దాని మీద కాస్త చర్చ జరిగి, అది కాసానగర్ చెరువు దగ్గరి చల్లపల్లి బాట అని తేల్చారు!
భవిష్యదాశా రేఖగ
స్వచ్ఛ శుభ్రతల మేటిగ చల్లపల్లి నిలుచు ననీ
భవిష్యదాశా రేఖగ - పర్యావరణ హితమ్ముగ
కార్యకర్తలెన్నటికీ కష్టమునే నమ్ముకొనీ
రాష్ట్రము నందున ఊరును ప్రథమముగా చేస్తారని....
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
23.05.2026