3843* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమయిన – ఏకమాత్ర ప్రయోజనకరమైన ప్లాస్టిక్కులు ఇకనైనా మానేద్దాం!

ఆదివారపు (24.05.26) శ్రమదాన భాగ్యం 30 మందిది! - 3843*

శ్రమదాన గ్రహీతలు –

1) NH 216-కాసానగర కూడలిలోని దక్షిణపు లోతట్టు లోయ వంటి ఎగుడుదిగుడు బండరాళ్ల, వాటిని క్రమ్మేసిన, సగం ఎండిన రెల్లు ప్రాంతం : ఇక్కడ పని చేసిన 7 గురూ కాకలు తీరిన కార్యకర్తలే! - ఒక్క జ్యోతి అనే నర్సు తప్ప! ఆమె ఈ ఉదయానికల్లా మరో 2 చింత మొక్కల పాదుల్ని అందంగా - వచ్చే - వెళ్లే ప్రయాణికుల దృష్టినాకర్షించేలా రూపొందించింది! ఇక బృందావన-శంకర-వెంకటేశ్వర-శ్రీనివాసాదులవేమో కత్తుల-పారల బరువు పనులు!

2) కాసానగర చెరువు తూర్పు ప్రదేశం-ఇక్కడే మెండు, జాస్తి, బొందలపాటి, ఇంకా వక్కలగడ్డ రామకృష్ట (H.of నాగలక్ష్మి) తదితరుల పైకి తేలికగా కనిపించే గడ్డి చెక్కుడు, వృక్ష సుందరీకరణ, తూర్పు డ్రైన్ పరిశుభ్రతా పనులు!

3) ఇక మూడవది, అసలైన దుమ్ములేపే - క్రొత్త సిమెంటు రోడ్డు పని. డజను మంది ఉద్యోగాలు ఇక్కడే! దానికంటుకొన్న గోనె సంచుల్ని ఊడ బెరకడమూ, ఊడవడమూ, వ్యర్ధాల్ని ట్రాక్టర్ లో నింపడమూ, గోకుడు పారలతో రోడ్డునంతా అంటిన దుమ్ము చెక్కడమూ, సిమెంటు ధూళిని అనివార్యంగా పీల్చడమూ ఆ డజను మంది బాధ్యతలు !

- హైవే దక్షిణపు లోయలో ఇంకా నాలుగైదు తాడి చెట్లు మిగిలిపోగా-వాటి బాధ్యత అడపా గురవయ్య టీముకు అప్పగించాలనీ,

- ఎన్నివేల రోజుల శ్రమదానాల్నైనా Dr. DRK గారు మాత్రమే సమీక్షించాలని కాక...ఒక్కొక్క రోజు ఒక్కో కార్యకర్త విశ్లేషిస్తే బాగుంటుందనీ,

- బుధవారం (27.5.26) తన 70 వ పుట్టినరోజు సందర్భంగా పాగోలు రోడ్డులో సకుటుంబంగా కొన్ని మొక్కలు నాటాలని ఉరిమి శాయి గారి నిర్ణయమనీ,

- పల్నాటి అన్నపూర్ణ గారి నేటి వేరుశనగల + బాదం గింజల పంపకానికి కృతజ్ఞతలనీ,

- రేపటి శ్రమదానం

               1) చెక్ పోస్ట్ దక్షిణపు భాగంలోనూ,

               2) కాసానగర్ చెరువు తూర్పు డ్రైను వద్ద అనీ తుది సమావేశంలో నిర్ణయించబడింది!

               ఈ పూట తొందరతొందరగా నినాదాల ప్రకటన ఆకుల దుర్గా ప్రసాదు గారిది!

               వైయక్తిక మనిపించే

ఆ పడమటి వీధిలోని సంఘటిత శ్రమదానం

కోటద్వారం మొదలుగ కొనసాగిన సంచలనం

వైయక్తిక మనిపించే ఒక సమష్టి ప్రయత్నం

అంతిమ ఫలితం మాత్రం గ్రామస్తుల కంకితం!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   24.05.2026