3848* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయవలసిందే.

భీకర ఝంఝామారుతం పిదప రహదారి భద్రతలు - @3848*

               గురువారం రాత్రి 11.20 కి వీచిన గాలీ, అది మోసుకొచ్చిన దుమ్మూ, ఫెళ ఫెళార్భాటులతో

ముందు మెరుపులూ, తరువాత ఉరుములూ చల్లపల్లి ప్రాంత ప్రజల్ని భయపెట్టాయన్నది నిజం!

               తాము ప్రేమగా పెంచిన చెట్లేమయ్యాయో – ఊళ్లోనో, ఊరి చుట్టూనో ఎక్కడ రోడ్డు కడ్డంగా పడి, రాకపోకలు ఆగి ఎవరు ఇబ్బంది పడుతున్నారో అని కార్యకర్తలు ఆందోళన చెందినదీ నిజం!

               లేకపోతే – అంతటి రాత్రి బీభత్సం తరువాత – కరెంటు దీపాల్లేని, వెన్నెల లేని వేకువ సమయంలో  పాగోలు రోడ్డు కడ్డంగా పడిన చెట్టు దగ్గరకు 4.10 కన్న ముందే – ఒక కస్తూరీ, ఒక అన్నపూర్ణ ఎందుకు వెళ్లాలి? 40 నిముషాల పాటు కొమ్మలు నరికి, వీధిని ఊడ్చి, ఎందుకు ట్రాఫిక్ క్లియరెన్స్ చేయాలి?

               ఆ సంగతి సరే- నాగాయలంక రోడ్డులో కాసానగర్ చెరువు వద్ద అంత పెద్ద తాడి చెట్టు రోడ్డుకడ్డంగా విరిగి పడితే, మిగిలిన ఆ కాస్త చోటు నుండి నిర్లక్ష్యంగా లారీ, బస్సూ వంటివి దూరాలని ప్రయత్నిస్తూ జారి చెరువులో పడిపోతే? అని స్వచ్చ కార్యకర్తలకంత ఆందోళనెందుకు? గునపాలు,మోకులు సాయంతో – విజయ రాణి అనే నర్సుతో సహా అంతసేపు శ్రమించి, తొలగించాక చూద్దును గదా –“ అమ్మయ్య ! తక్కువ సమయంలోనే రద్దీ రోడ్డు ట్రాఫిక్ ఆగకుండా చూశాం గదా!” అని ఆ 7-8 మంది ముఖాల్లో సంతృప్తిని చూడండి!

               శ్రమదానోద్యమ తొలి రోజుల్లో ఏ కొద్దిమంది అమాయకులో “ఏమిటి వీళ్లకీ వ్యసనం! రోడ్లూడ్చి, చెట్లు నాటి, డ్రైన్లు బాగు చేసి, ఊరినమాంతం ఉద్ధరిస్తారా వీళ్ళు?” అనుకున్న రోజులుకావివి. ఎక్కడ ఇలా ట్రాఫిక్ సమస్య వచ్చినా – ఏ వీధి సుందరీకరణ చూసినా – గ్రామస్తులకు స్వచ్చ కార్యకర్తలే గుర్తొస్తున్న కాలమిది!

               ఈ పూట నినాదాలు జాస్తిగా పలికిన జాస్తి వారు ఈ పరిస్థితినే గుర్తుచేసి, భూతాప నివారణ కోసం ప్రతి స్వచ్చ కార్యకర్త హీన పక్షం రెండేసి మొక్కలైనా నాటి పెంచాలని సూచించడం గమనార్హం!

               కార్యకర్తలందరిదీ అదే సంకల్పం. కాకపొతే కొందరికి మైకు ముందది చెప్పలేని సంకటం!

               రేపు వేకువ కూడ ఈ కాసానగర ప్రాంతపు రహదారి ఎందరు కార్యకర్తలకైనా చాలినంత పని చూపగలదు!    

               మట్టిలొ కలిపిన మృత్యువు

అరెరే! మొంధన తుఫాను స్వచ్ఛోద్యమ శుత్రువు 

మహామహా వృక్షాలను మట్టిలొ కలిపిన మృత్యువు

పచ్చదనం సమసిపోయి, పరిస్థితులు వికటించీ

స్వచ్చోద్యమ చల్లపల్లి సాగసు మాసిపోయెనే!

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   29.05.2026