3849* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయవలసిందే.

సత్ఫలితాన్నిచ్చిన 3849* వ విడత (30.5.26) శ్రమదానం!

               ఆ అతి విలువైన - సర్వదా ఆదర్శప్రాయమైన దానం ఈ శనివారం 43 మందిది; దాని స్వీకర్త మళ్లీ N. లంక రహదారిలోని కాసానగర ప్రాంతమే;- ముఖ్యంగా దారి తూర్పు భాగంలోని 100 గజాల డ్రైనే! సదరు నివాస సముదాయం నుండి కనీసం ఇద్దరు పాల్గొనడమూ, ముఖ్యంగా ఏలూరుకు చెందిన 3rd B.Tech విద్యార్థిని ‘నిహారిక’ రహదారి సేవలు కూడా ప్రస్తావనార్హములే!

               ఈ “జై స్వచ్ఛ చల్లపల్లి వాట్సప్” పాఠకులు నేనేదో తమషాగా వ్రాస్తున్నాననీ, ఈ కాలంలో చాలా చోట్ల గుర్తింపుల కోసం జరుగుతున్న ఆషామాషీ శ్రమదాన ప్రదర్శన ఇది అనీ భావించకుందురు గాక!

               ఈ ఊరి జనులో-క్రొత్తవారో స్వయంగా పనిచోటుకు వచ్చి, నిష్పక్షపాతంగా ఒక్క అరగంట ఈ పనుల్ని పరిశీలిస్తే లేక పాల్గొంటే - అలాంటి అభిప్రాయం చప్పున మారిపోగలదు సుమా! ఆ 30 నిముషాల్లోనే సదరు పరిశీలకులు:

1) ఆ ప్రాంతం చాల వరకు శుభ్రంగా ఉన్నా సరే NH216 - కాసానగర్ జంక్షన్ లో 8 మంది - మళ్లీ ఊడ్చి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు ఏరి, అదేదో తమ గృహ ఆవరణ అన్నంతగా శుభ్రపరచడాన్ని...

2) 20 మంది కార్యకర్తలు స్థానిక దేవాలయం నుండి 50 గజాల బారునా బిర్యానీ కుళ్లు వాసనల - ఎంగిలాకుల ఎండు తాటాకుల - తదితర తుక్కుల్ని డిప్పల్లో నింపి, ట్రాక్టర్లో నింపడాన్నీ,

3) అదే డ్రైనులో ఇంకా 50 గజాల మేర ఏడెనిమిది మంది గుట్టలుగా పడి ఉన్న తాటాకులూ, త్రాగేసిన ఎంగిలి మద్యం సీసాలూ, చెత్తా చెదారాలను సేకరిస్తున్న దృశ్యాన్ని,

4) ఇంకొందరు ముళ్ల కంపల్ని మొక్కల రక్షణకు అమర్చడాన్నీ,

               చూసి, 40 మంది సామాజిక స్పృహకూ, ప్రజల పట్ల బాధ్యతకూ చలించిపోగలరు! అలాంటి చుట్టం చూపు గ్రామస్తులు - ఏమో రేపటి నుండి స్వచ్ఛ కార్యకర్తలుగా మారినా మారగలరు! ఏ పుట్టలో ఏ పాముంటుందో – ఎప్పుడెవరి త్యాగ లక్షణం మేల్కొంటుందో చెప్పలేం గదా!

రహదారి మీదనే జరిగిన సమావేశాన్ని

A) సుభాషిణి గారు నినాదాలతో మొదలెట్టి, తన స్టీలు ప్లేటూ, గ్లాసుల్ని ఫంక్షన్లకు వెంట తీసుకుపోతున్న విచిత్రాన్ని కొందరు హేళన చేస్తున్న సంగతిని ప్రస్తావించగా,

B) కొర్రపాటి వీరసింహుల వారు 112 ములక్కాయల్ని పంచగా,

C) కార్యకర్తల సుదూర విదేశ బంధువు సురేష్ నాదెళ్ల 400 మామిడిపళ్ళను, ఒక ట్రే (500) సపోటాలను పంపించగా,

               రేపటి శ్రమదానం బెజవాడ దారి ప్రక్కన కోమలానగర్ వద్దనని DRK గారు వివరించిరి!

               ఆర్యోక్తులు వినుచుంటిని

అడపా గురవయ్య గారి స్వచ్ఛ కృషిని గమనిస్తిని

ఆతడు దినదినము చెప్పు ఆర్యోక్తులు వినుచుంటిని

జోడు కత్తి తాటిమట్ట నరుకుట సైతం చూస్తిని

గ్రామముపై అతని ప్రేమ సామాన్యము కాదంటిని!

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   30.05.2026