3850* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయవలసిందే.

ఆదివారం (31-5-26) నాటి పనిదినం సంఖ్య సరిగ్గా -3850* !

ఈ వేకువ సమయపు శ్రమదాతలైతే 46+5  (చివరి ఐదుగురు తుది సమావేశంలో పాల్గొన్న వారు!) 50 మందికి పై మాటే!  కార్య రంగం: కోమలా నగర్ లో -  కోడూరి  వారి వీధిలో ! కాసానగర్ నుండి కోమ లా నగర్ కు  శ్రమ వేదిక మారిన కారణం కూడ కోడూరు వారే!

 

వీధి చిన్నదే గాని అందలి కాలుష్యం పెద్దదే. ఆ వీధి లోని స్థలం కూడ విశాలమే. అందులో పెరిగిన గడ్డిగాని, పిచ్చి చెట్లు గాని, చుట్టూ కంచెకు అల్లుకొని, చిక్కగా వ్యాపించిన తీగలు గాని తక్కువేం గాదు. పైగా, అది చదునుగా ఉన్న నేలా కాదు. గొడ్ల త్రొక్కిడి వల్లనో - దేనికో గాని, ఎగుడు దిగుడుగా గుంటల భూమి!

మరి అందులో 20 మంది పురుషులూ, ఏడెనిమిది మంది మహిళా కార్య కర్తలూ ఆ స్తలం అవక తవకల మీద, కాలుష్యం మీద కత్తులు దూస్తే ? గంటన్నర పాటు పారలతో, రైల్వేపారల్తో, కొడవళ్లతో గడ్డి చెక్కుతుంటే? తెలవారకముందే ఆ ఖాళీ స్తలాన్ని రేపటి వేడుకకు ముస్తాబు చెయ్యాలనే పంతంతో మరి కొందరు ఆ తుక్కును దంతెలతో లాగి, డిప్పల్తో బైటకు మోసి, ట్రాక్టర్ లోకి విసరు తుంటే?

ఆ డిప్పల్ని చాకచక్యంగా ఒడిసి పట్టుకొని, ప్రదీప్ సాయి అనే యువకుడు నేర్పుగా సర్దుతుంటే?

ఏడెన మండుగురు కంచె వెలుపలి డ్రైను గడ్డినీ, తుక్కునూ తొలగించే దృశ్యమో ? నలుగురు మహిళలు తమవి కాని ఆ 2 రోడ్ల నూ చీపుళ్లతో చిమ్మడమో?

ఈ అసాధారణ సామూహిక - సామాజిక బాధ్యతల శ్రమను కవులో -  కళాకారులో దగ్గరగా చూస్తుంటే కలిగే స్పందన ఎలా ఉంటుందో ఊహించుకోండి ! స్తలా భావం భయం లేకపోతే- ఆ కవులు ఎన్ని కవిత్వాలు వ్రాయగలరో ఆలోచించండి!

“ఇందరు గ్రామ సేవకులకు ఈ ఒక్క పూట 3 రకాల స్వచ్చమైన విందునీయగలిగాను గదా!” అనే ఉరిమి సాయి కుటుంబీకుల ఆనందాన్ని చూశాను! సొంత ఊరి కర్తవ్యం నిర్వర్తించిన నిండు సంతృప్తిని తుది సమావేశంలో ప్రదీప్ సాయి ననుసరించి కార్యకర్తలు, నినదిస్తుంటే గమనించాను!  ఈ 50 మందితోబాటు రానున్న రోజుల్లో ఇబ్బడి ముబ్బడిగా గ్రామస్తులు ఊరి కోసం చేసే శ్రమలో కలిసి రాగలరని విశ్వసిస్తున్నాను!

రేపటి శ్రమ కాసానగర్ చెరువు వద్ద  అని తెలుసుకున్నాను!

               నంబర్ వన్ కావాలనే!

పరిచయమక్కర లేనిది పసుపులేటి ధనలక్ష్మి

చీపురు పట్టిన - దంతెతొ చెత్తను ప్రోగులు చేసిన

ఒక ఆశయమొకే దీక్ష స్వచ్ఛ చల్లపల్లి కొరకె

తన గ్రామము రాష్ర్టంలో నంబర్ వన్ కావాలనే!

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   31.05.2026