3851* వ రోజు.......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయవలసిందే.

గిరిగీసుకొని చల్లపల్లికే పరిమితం కాని 3851* వ శ్రమదానం!

               కార్యకర్తల కష్టం గ్రామం చుట్టూ ఎక్కడ అవసరం పడితే అక్కడికే వెళుతుంటుంది - ఒక ముఖ్యమంత్రి “ప్రజల వద్దకే పాలన” అన్నట్లుగా!

               నిన్న ఆదివారం అవసరార్ధం కోమలానగర్ వెళ్లింది గాని, ఈ మధ్య వారాల తరబడి అది కాసానగర ప్రాంతానికే పూనుకొంటున్నది! వాళ్ల శ్రమ అవసరం అక్కడ అంతగా వచ్చింది మరి!

               ఇప్పటికేదో - NH216 లో చెక్ పోస్టు కేంద్రంగా అన్ని విధాలా శుభ్రపడింది అనుకొనే లోపే పుట్ట గుడి ఎదుట గుంటలు పడి, వాహనాలకు ప్రమాదంగా మారిన రహదారిని సుమారు 2 లక్షలు ఖర్చు పడి సిమెంటు రోడ్డుగా మార్చవలసి వచ్చింది.

               ఆప్రాంతం శుభ్రంగా ఉన్నది గాని, బాటకు తూర్పున లోతైన డ్రైను సంగతేమిటి? అందులో వందల కొద్దీ తాటాకుల, సింగిల్ యూజ్ ప్లాస్టిక్కుల, వ్యర్ధ ఆహారాల కంపులేమిటి? హోరు గాలికి విరిగిపడి, వాహనాల నడ్డుకొంటున్న చెట్లనెవరు తొలగిస్తారు? మాటలు తేలికే గాని, ఇలాంటి పనులకు డబ్బులిచ్చినా పనివాళ్ళు దొరకని కాలమిది!

               అందుకే ఎన్ని వారాలైనా ఈ ప్రదేశంలో కార్యకర్తల శ్రామిక తపస్సు! గౌరవప్రదం కాని చెత్త పనులకు దిగామా? చెమటకు తడిసి ముద్ద ఔతున్నామా వంటివి ఈ స్వచ్ఛ కార్యకర్తలేనాడో మరచిపోయారు! అలాంటి వేల పని దినాల్లో ఇదొకటి!

               ఈ సోమవారం(జూన్ నెల తొలిదినం) లో కూడ 4:21 నుండే మొదలై, 6:00 దాక కొందరూ, మల్లంపాటి, అడపా, సజ్జా, మెకానిక్ కృష్ణ, బొందలపాటిల బ్యాచ్ – 6:10 వరకూ - మొత్తం 24 మంది చేసిన శ్రమ వృధా కాలేదు! తాటి మట్టలతో గజమున్నర ఎత్తుగా పేర్చి నింపిన ట్రాక్టరు అందుకు సాక్ష్యం!

               6.15 తరువాత నాగాయలంక దారి మీద నిలబడి, ప్రేమానందుడు చేసిన ప్రతిజ్ఞామయ నినాదాలను పునరుచ్చరించి, “ప్లాస్టిక్ లను తొలగించనిదే – ఆపనిదే వ్యవసాయం ఇక నడవదనే” అతని అభిప్రాయాన్ని మన్నించి,

               రేపటి మన శ్రమ కోసం కాసానగరం చెరువుకు దగ్గరగా చల్లపల్లి బాటలోనే కలుద్దామని నిర్ణయించుకొని, ఇళ్లకు వెళ్లారు!

 

               అనితర సాధ్యముగానే

అరుదగు ఒక కార్యకర్త – అదుగో ముత్యాల లక్ష్మి

అటు హోటలు నిర్వహణం అనితర సాధ్యముగానే

ఇటు గ్రామము మెరుగుబాటు ఎంతో ప్రతేకము గానే

తన గ్రామపు మహిళల కాదర్శప్రాయము గానే!

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   01.06.2026