3853* వ రోజు.......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయవలసిందే.

బుధవారం (3-6-26) కూడ 28 మంది కర్తవ్యములే - @3853*

               మళ్లీ ఇంచుమించుగా నాగాయలంక రోడ్డులోని ఆ చోటే! శ్రమదానం రోజూ చూసే ఎవరికైనా “ఏమిటో - ఈ స్వచ్ఛంద శ్రమదాన ప్రయాణం చీమ నడక నడుస్తున్నది” అనిపించవచ్చు! పన్నెండేళ్ల నుండి క్షుణ్ణంగా చూస్తున్న నాకు మాత్రం అలా అనిపించదు!

               ఎంత శుభ్ర - సుందరంగా, పరిపూర్ణంగా ప్రతి పనీ జరుగుతున్నది, నిస్వార్థంగా ఇన్ని లక్షల పనిగంటల శ్రమదానం ఎలా సాధ్యపడుతున్నది, ఒక ఊరూ - దాని పరిసరాల మెరుగుదల కోసం ఈ కార్యకర్తలు ఇంత కఠిన తపస్సులు ఎలా చేయగల్గుతున్నారు...... అని ప్రతిరోజూ అనిపిస్తూనే ఉంటుంది!

               ఉదాహరణకు - 5.50 కి DRK గారి విజిల్ మ్రోగినప్పుడు కాస్తంత అఇష్టంగా 5.55 కు పనులు ఆపి, కాఫీల వ్యాన్ దగ్గరికి వచ్చిన 5 గురిని పరిశీలనగా చూశాను. ముఖాల నిండా చెమట చుక్కలూ, ఆ తడికి అతుక్కుపోయిన దుమ్మూ - చెత్తపరకలూ! చేతులూ ముఖాలూ శుభ్రపరచుకొన్నాక అవే ముఖాల్లో తమ గ్రామ బాధ్యతలు నెరవేర్చిన సంతృప్తీ!

               ఉద్యమ నినాదాలూ, ఒక సూక్తీ వినిపించిన అడపా గురవయ్య గారు నేటి తన శ్రమదాన

ఆలస్యాన్ని ప్రస్తావించారు!

               రోడ్డుకు తూర్పుగా 2 తాడి చెట్లు సుందరీకరణమూ,

               అచ్చటి డ్రైను వ్యర్ధాలను ఖాళీ చేయడమూ,

               చెత్తనూ, తుక్కునూ కాల్చక చెరువు వైపు రోడ్డుకు బరంతుగా పేర్చడమూ,

               వంటచెరకుగా పనికొచ్చే బండెడు తాడి మట్టల్ని తరలించి, భద్రపరచడమూ నేటి ముఖ్య చర్యలు!

               రోడ్డు పడమర డ్రైనును వెంకటాపురం కూలీలు నిన్న శుభ్రపరచి, రోడ్డు మార్జిన్ లో పేర్చిన గుట్టల లోడింగూ, రహదారి ఊడుపూ నేటి అదనపు పనులు!

               గాలి గాని, చల్లదనం గాని కార్యకర్తలకు ఏమాత్రం సహకరించని పరిస్థితిని DRK గారు పేర్కొని, డీ - హైడ్రేషన్ పట్ల అందర్నీ హెచ్చరించారు.

               ఇదే నాగాయలంక రోడ్డు పరిశుభ్రత కోసం రేపు కూడ ఇక్కడే కలుద్దాం!

               సామాజిక-సామూహిక- సత్కార్యం

ఊరు శుద్ధమయ్యేందుకు ఉద్యమముగ సాగాలని

దేశానికి తమ ఊరును మోడల్ గా నిలపాలని

సామాజిక-సామూహిక- సత్కార్యం చేయాలని

కార్యకర్తలకు తప్ప కలిగినదా ఆలోచన!

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   03.06.2026