పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయవలసిందే.
ఉరుముల – మెరుపుల – వానల మధ్య తగ్గిన గ్రామ ప్రేమికుల సంఖ్య - @3858*
పైగా ఊరికి దూరంగా కాసానగర చెరువు ఉత్తరపు గట్టు పనులు! సోమవారం(8.6.26) అనేది మరో కారణం! కనుక – ఈ పిచ్చోళ్ళ సంఖ్య 19 కి పడిపోయింది!
అలాగని, పొరుగూరి శివారు నివాస ప్రాంతంలో పనుల నాణ్యత తగ్గిందా అంటే – అదేం లేదు; వాన పెరిగిన ప్రతిసారీ DRK “డాక్టరు గారు కార్యకర్తల్ని పనులాపేద్దామా” అని అడుగుతున్నా వాళ్లు ఒప్పుకోలేదు - అలా వేకువ 4:22 నుండి 6:05 దాక - అది నిస్వార్థ శ్రమానందమో లేక పడక పడక తొలిసారి పడుతున్న వర్షానందమో గాని ఆ చెరువు గట్టు సగం దూరం బాగుపడింది!
ఐతే - అది ఊడ్చే పని కాదు - వాన తడిలో రోడ్లు కంటుకొన్న ఆకులూ, దుమ్మూ, పుల్లలూ చీపుళ్లకు ఊడిరావు - ఒకటే మార్గం – దంతెలతో లాగాలి – లేదంటే ఒంగొనీ, కూర్చునీ ఏరాలి! జరిగిందదే!
మరి సిమెంటు బాట కిరుప్రక్కలా పెరిగిన చెట్ల సుందరీకరణ సంగతి? పిచ్చి మొక్కల - ముళ్ల పొదల, చెత్తా చెదారాల - దిక్కుమాలిన ప్లాస్టిక్ ల – ప్రాత గుడ్డ ముక్కల్ని ఎవరు నరికి, ఏరి, శుభ్రపరచాలి? ఆ కాసానగర నివాసులా? అది జరగని పని అని తేలిపోయింది - ఏదో మచ్చుకు ఒకరో ఇద్దరోతప్ప తక్కిన వాళ్ళకవి సరిపడవని 12 ఏళ్లుగా అర్ధమైపోయింది!
అందువల్ల - అక్కడ కుక్క పెంటలున్నా - కంపుకొట్టే ఆహార వ్యర్ధాల కారీ బ్యాగులున్నా - కాంపౌండ్ గోడలో మొలిచిన రావి చెట్లున్నా ఈ స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలదే బాధ్యత!
ఒక కోడూరి, ఒక అంబటి, కస్తూరి, మరొక ఆకుల, BSNL, పల్నాటి వంటి కార్యకర్తలు ఎప్పటిలాగే నిర్వికారంగా ఆ మురికి పనులు పూర్తి చేశారు! వచ్చిన వ్యర్ధాల్లో ఎక్కువ భాగం చెరువు గట్టు రక్షణకే అమర్చారు.
వానలో తడిస్తేనేం? నికృష్టమైన కడుపులో దేవే దుర్వాసనలు పీలిస్తేనేం! 6:00 గంటల వేళకు చూస్తే ఆ 50 గజాల చెరువు గట్టు బజారు క్రొత్తగా, వింతగా శుభ్రపడిందా లేదా? అదే గదా ఈ కార్యకర్తల ప్రతిదిన సంతోషం!
6.15 కు జరిగిన సమీక్షా సభలో ఆ ఆనందం కనిపించింది. అన్నపూర్ణమ్మ క్రొత్త పద్ధతి నినాదాల పిదప –
నిన్న మేకలడొంక వద్ద కొందరు మూర్ఖులు చెట్లును కాల్చేసి, అహంకారంతో విర్రవీగిన ఘటన మాత్రం కార్యకర్తలకు బాధను మిగిల్చింది.
రేపటి వేకువ బాధ్యతల కోసం అమరస్ధూపం ప్రాంతం ఎన్నిక కాబడింది.
ఒక కుమారి పరిస్థితే ఇది!
ఎచట నిర్మల సీతారామన్? (ఇదొక నిక్ నేమ్ శివకుమారికి!)
స్వచ్ఛసేవలు గాలికొదిలీ, అమెరికాలో మకాం పెట్టీ,
వాట్సప్ రోజూ చూసి చూసీ, స్వచ్ఛ సంస్కృతి కోలు పోయీ.....
ఉస్సురని నిట్టూర్పు విడిచే ఒక కుమారి పరిస్థితే ఇది!
- నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
08.06.2026