3860* వ రోజు.....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయవలసిందే.

బుధ – (10.06.2026) వారం శ్రమానందం! @3860*

               28 మంది కార్యకర్తలది ఆ ఆనందం; నాగాయలంక బాటలోని కోళ్ల ఫారాల, థర్మోకోల్ షీట్ ల తయారీల ప్రాంతమది, రెండు ప్రక్కలా లోతైన డ్రైన్ చోటది, కాస్తంత గాలి వేస్తున్నా కోడి పెంటల ఘాటు వాసనల నడుమ 12 మంది ఇష్టపూర్వకంగా నిర్వహించిన –

1) డజనుకు పైగా గద్దగోరు ముళ్ళ - పూల మొక్కల సుందరీకరణం!

2) అన్నపూర్ణ, మట్టా మహాలక్ష్మి, బృందావన, పసుపులేటి, ఇనపకుతిక వంటి స్వచ్ఛ యోధుల కష్టంతో చూడముచ్చటగా మారి పోయిన విశాల రహదారి! అక్కడే వ్యర్ధాలతో సగం ట్రాక్టరు నిండింది.

3) ఆకులు, చెత్త పరకలు గాలికి కొట్టుకుపోతుంటే మళ్ళీ మళ్ళీ ఊడ్చిన చోటు!

               ఆ 50 గజాల మార్గంలో శ్రమదాన వీరవిహారం మళ్ళీమళ్ళీ చూడాలనిపించేదే గాని - అసలైన కార్యకర్తల శ్రమానందం మాత్రం 48 మంది మృత వీరుల స్తూపం దగ్గరే నెలకొన్నది.

               ఆ ఆవరణను బాగుచేసి ఏ 10 నెలలో ఐనందున - కార్యకర్తలు టైల్సు పరిపించి, చుట్టూ నాటిన పూల మొక్కల్ని మ్రింగేసేంతగా గడ్డీ – పిచ్చి చెట్లూ పెరిగి, కార్యకర్తల మనసులు చివుక్కుమంటూనే.. ఉన్నవి గత 15 రోజుల నుండీ!

               ఈ పూట గంటన్నరకు పైగా (వేకువ 4.18 - 6.05) 15 మంది పట్టుదలతో దంతెలు - కత్తులు - చీపుర్లతో దాడి చేస్తే గాని ఆ కాలుష్య భూతాలు వదల్లేదు. ఆ వ్యర్ధాల్ని తొలగించడమొక ఎత్తైతే - బైటికి మోసి, ట్రాక్టరులో పేర్చడం మరొక ఎత్తు!

               మృత వీరులకు ఆత్మలుంటే - అవి ఆ స్తూపం చుట్టూ వ్రేలాడుతుంటే - ఇవాళ వాటికి శాంతి కలిగే ఉంటుంది!

               చల్లపల్లి పౌర బాధ్యతకొక చిహ్నంగా ఇంకో సంఘటనేమంటే – కాకరపర్తి సురేశ్ అనే వడ్ల మిల్లు యజమాని తన పొలంలోకి బాట వేసుకొనేందుకు కార్యకర్తలు నాటి పెంచిన చెట్లు అడ్డ మొచ్చాయని గ్రామ కార్యదర్శిని, DRK గారిని సంప్రదించడం.

               నేటి మరొక దురదృష్టకర సంఘటన - మన మాజీ స్వచ్ఛ కార్యకర్త సబ్బినేని బోసు గారి భార్య ‘లలిత’ గారి అకాల హఠాన్మరణం!

               ఈ పూట నినాదకర్త వీర శేఖర్ గారు తన పాగోలు రోడ్డులోని చెట్ల పరిరక్షణకు చేసిన వాగ్దానం హర్షణీయం!

               రేపటి మన శ్రమ కర్మభూమి కూడ నాగాయలంక మార్గమే!

            పినిశెట్టి నిరంజనుడికి

పినిశెట్టి నిరంజనుడికి పెద్ద బరువు పనులు తప్ప

చీపురు ఊడుపు పనులు చిత్తమునాకర్షించవు

ఎన్ని రాళ్లు పగులగొట్టి ఎన్ని గుంటలను పూడ్చెనొ!

ఎంతగ చెమటకు తడిసెనొ - ఎవ్వరు లెక్కించగలరు?

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   10.06.2026