పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా?
శనివారపు (13.6.26) శ్రమ సౌభాగ్యం! @3863*
నాగాయలంక రోడ్డులో బండ్ల సుబ్బ నాగన్న ఆశ్రమ ప్రాంతంలో 39 మంది - అందులో 20 మంది 4.21 నుండే - 6.05 దాక కూడబెట్టిన శ్రమ సంపద అది!
అటు హిమాలయ మంచు గడ్డల కర్మాగారం మొదలు – సిమెంటు తూముల తయారీ గేటు దాక - ముఖ్యంగా సుబ్బ నాగన్న ఆశ్రమ ప్రాంతంలో ఎవరికి తోచిన, సాధ్యపడిన స్వచ్ఛ - శుభ్ర – అందగింపుల శ్రమదానమది!
అక్కడక్కడ డ్రైను లోతు ఎక్కువైనా, కొందరికి చీకటి వలన గద్ద గోరు పూల చెట్లు ముళ్లు గీరుకొనినా, అప్పుడప్పుడు రాతి ముక్కల - ఎండుకొమ్మల వల్ల అసమతల ప్రదేశమై కాళ్ళు బెసుగుతున్నా, పెదపూడి లక్ష్మి, ప్రశాంతి మహిళా కార్యకర్తల ఉత్సాహమైనా ఏమాత్రం తగ్గని రహదారి శ్రమ అది!
ఎత్తైన వేపచెట్టు కొమ్మ పైకెక్కి కూర్చొని, ఒక ఆకుల ప్రసాదు కావించిన శ్రమ విన్యాసం చూశాను!
పని వేళ ముగుస్తుందనే తొందరలో ఆస్పత్రి నర్సుల పని వేగం పెరగడం గమనించాను!
ఒక చల్లని శుభోదయకాలంలో ఒకరో ఇద్దరో కాదు - 39 మంది ఊరికి దూరంగా సొంతానికి కాక - విశాల ప్రజానికానికి ఆహ్లాదకల్పన కోసం ఇంత ఉత్సాహంగా పనిచేయడమెలా సాధ్యపడిందా అని సందేహి౦చాను!
ఒక్కోమారు పరుగు లాంటి నడకతో తూము వెంకటేశ్వరుడు పని సన్నివేశాలను కెమేరాలో బంధించడం గురించీ ఆలోచించాను! గ్రూపు ఫొటో కోసం అతడు నూతి ప్రక్క గోడనెక్కడం కూడ వీక్షించాను!
సామాజిక బాధ్యతను శ్వాసించే ఒక78 ఏళ్ల జీవుడు 43 రోజులుగా శ్రమదాన విరహాన్ని భరించి, కాలి గాయంతోనే రావడమూ, 10 వేల చెక్కును ఉద్యమ ఖర్చుల నిమిత్తం ఇచ్చుకోవడంతో ఆశ్చర్యపోయాను!
నాదెళ్ళ సురేష్ ప్రేరణతో నేను వ్రాసిన “స్వచ్ఛ కార్యకర్తగా మారడమంటే” అనే కవిత్వాన్ని చదివాను!
మే నెల ట్రస్టు జమా ఖర్చుల వివరాల్ని DRK గారు ప్రకటిస్తుంటే, “మే నెలలో వలెనె ఇలా దాతలు బాగా సహకరిస్తుంటే ఎంత కాలమైనా ఈ ఊరికి ఉపయోగపడగలం కదా!” అని తెగ సంతోషిస్తుంటే - అందరితోబాటు తెలుసుకొన్నాను!
కొంచెం మార్చి చెప్పిన శంకర శాస్త్రి గారి నినాదాలు గుర్తుచేసుకొన్నాను.
రేపటి శ్రమదానం N. లంక బాటలో – సుబ్బ నాగన్న ఆశ్రమానికి ఉత్తర దిశగా జరుగునని గ్రహించాను!
స్వచ్ఛ ధర్మము
ఆయన భోగాది వాసు - ఔనాతడుపాధ్యాయుడు
శ్రమదానపు ప్రారంభపు సభ్యులందుకడు ముఖ్యుడు
చదువులందెకాక స్వచ్ఛ, శ్రమదానములోన గూడ
తర్ఫీదుల నిచ్చి స్వచ్ఛ ధర్మము బోధించగలడు!
- నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
13.06.2026