3864* వ రోజు........

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా?

ఈ ఆదివారపు (14-6-26) రహదారి బాధ్యతలు 40 మందివి! @3864*

               అవి పెందలకడనే అంటే 4.19 AM కే మొదలై, 6.05 వరకూ కొనసాగినవి; నాగాయలంక బాటలో సుమారు 150 గజాల మేర విస్తరించినవి.

               ఉభయ డ్రైన్ల శుభ్రతలు గాని, రోడ్డు మార్జిన్ల ఊడుపులు గాని, వ్యర్ధాల లోడింగులు గాని సక్రమంగానే ముగిసినవి.

               బాటకు 2 ప్రక్కలా మరీ దట్టంగా క్రమ్ముకుపోతున్న అడవి తంగేడు పూల చెట్ల కొమ్మల కత్తిరింపు మాత్రం ఎవరినైనా ముందుగా ఆకర్షిస్తుంది.

               కార్యకర్తల కత్తెర్లకు బలైన ఆ ముళ్ల కొమ్మల్ని బాట తూర్పు వైపున గుట్టలుగా పేర్చే పని ఆరేడుగురిది. ఈ గుట్టల కొద్దీ పచ్చికొమ్మలు కాస్త ప్రొద్దెక్కాక షెడ్జర్ లో పడి తుక్కవుతాయి, ఆ తుక్కేమో పొలానికో - ఇతర మొక్కలకో ఎరువుగా పనికొస్తాయి!

               ఈ పూట కూడ షణ్ముఖ శ్రీనివాసునికీ, పల్నాటి అన్నపూర్ణాదులకీ డ్రైన్లలోనూ, రహదారి బారునా ప్లాస్టిక్ వస్తు సేకరణ పనులు చేతినిండా దొరికాయి - మరీ ముఖ్యంగా సుబ్బ నాగన్న ఆశ్రమ సమీపాన, ఇంకా విజయలక్ష్మి సిమెంటు పైపుల కంపెనీ గేటుల ప్రక్కన!

               ఈ పూట 6.00 సమయానికే వెంకటాపురం మహిళా కార్మికులు 11 మంది రావడంతో అక్కడ పనివాళ్ల సందడి ఎక్కువయింది. మహిళా కూలీలే లేకుంటే ఈ నాగాయలంక రోడ్డులో ఇన్ని రకాల పనులు ఇప్పట్లో ముగిసేవి కావు!

               అసలు ఇన్నిన్ని సామాజిక బాధ్యతలు నెరవేరుతుంటే - ఇటుగా వెళ్లే వచ్చే వారు “ఏమిటి ఇది? ఎవరి కోసం ఈ చెత్త పనులు?....” అని, ఆగి ఆలోచించక - తెలుసుకొనక వెళ్లిపోవడమే అసలైన వింత!

               నేటి తుది సమావేశంలో చాల విశేషాలు :

               నిన్న కలెక్టరు గారితో DRK గారి సమావేశంలో గుడ్డ బ్యానర్ల వాడకమూ , 80 మార్లు రక్తదాత కస్తూరి విజయ్ నూ, రెడ్ క్రాస్ కు పదేసి లక్షలకు పైగా భూరి చందాలు ప్రోగేస్తున్న తూము వెంకటేశ్వరునీ కలెక్టరు గారు సమ్మానించడమూ,

               శ్రమదాన ఖర్చులకుగాను నేను 10,000/- లూ, పల్నాటి మల్లిఖార్జునరావు గారు తమ ముని మనుమరాళ్లు మహా - భువి ల పేర 2,000/- వేలూ సమర్పించడమూ..

               నిన్న పాగోలు రోడ్డు మహాబోధి వద్ద టిప్పరు రోడ్డు విధ్వంసక చర్యా,  

               రేపటి శ్రమదాన స్థలం కూడ N.లంక బాటలోని ప్రభాకరరావు రైస్ మిల్లు వద్దనే!

               ఈ లోకము క్షేమము!

80 పర్యాయములుగ రక్తదాత చూడుడు

వేల దినాలుగ ఊరికి శ్రమదాతయునీతడు

ఈయన కస్తూరి వాడు – విజయుడు తన నామము

ఇలాంటి దాన వీరులతో ఈ లోకము క్షేమము!

 - నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

  14.06.2026