పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా?
30+5 మంది శ్రమదానంతో NTR పార్క్ వెలుపలి సుందరీకరణం - @3872*
మంగళవారం వేకువ (23.6.26) శ్రమదాన దినచర్య 4:19 కే మొదలై, 6:05 కు లక్ష్య సాధనతో ముగిసింది. 30 మంది రెగ్యులర్ కార్యకర్తలూ, 5 గురు వాకర్స్ సంఘ పెద్దలూ తలా ఒక చెయ్యి వేస్తే గాని –
ఆ తడీ - పొడీ, నీళ్ళ చెలమల ప్రాంతం గడ్డీ, పిచ్చి మొక్కలు తొలగిపోయి, గుంటలు పూడీ, ప్లాస్టిక్ తుక్కులు గోతాలు నిండి, చెట్ల సుందరీకరణ జరిగి, అక్కడొక ఆహ్లాదకర దృశ్యం కనిపించలేదు!
చూసే గ్రామస్తుల్లో 90% మందికి ఈ పూట శ్రమకు ముందు కూడ “ఫరవా లేదు - ఈ నాలుగైదు సెంట్ల స్తలం బాగానే ఉన్నది” అనిపించవచ్చు గాని, “మోటార్ సైకిళ్ల నిలుపుదలకు అనువుగానే ఉన్నదే” అని తృప్తిగానే ఉండవచ్చు గాని - స్వచ్ఛ కార్యకర్తలకు మాత్రం అలా అనిపించదు గదా! అందుకని - నిన్నటి వాన నీళ్లకు బురదగా ఉన్నా సరే - ఈ వేకువ కార్యకర్తలక్కడ వాలిపోయారు!
- ఆ పార్కు ముఖ్య ద్వారం వద్ద చీపుళ్ల ఊడుపు గరగరలు,
- ఆ తడి మన్నును త్రవ్వి, ఎత్తు పల్లాలు సరిచేస్తున్న పార పనులు,
- బోగన్ విలియా ముళ్ల పూల చెట్ల తీగల కత్తిరింపులు,
- కలుపు ఏరివేతలు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ల వేటలు,
- డ్రైన్ల గడ్డి పీకుడులు, ఇంకా
- వ్యర్ధాల లోడింగులు,
- కార్యకర్తలు, నడక మిత్రులు కలగలిసిన శ్రమదానం ఎంత చూడముచ్చటగా ఉన్నదో గదా!
మరి - ఈ రెండు ప్రధాన రహదార్ల కూడలిలో – ఇంత చక్కని స్తలం ఆక్రమణలకు గురి కాదా? పార్క్ లో నడక మిత్రుల వాహనాలు అందంగా నిలుపుకోవచ్చనే ఆశ తీరుతుందా? సరే - అదంతా పంచాయతి వారి, గ్రామపెద్దల బాధ్యతనుకోండి!
అక్కడ ఈపూట కాంట్రాక్టరు కృష్ణ గారు మన్నుతో మెరక చేయిస్తారట!
నేటి తుది సమావేశాన్ని నినాదాలతో ప్రారంభించినది పద్మావతి ఆస్పత్రి ల్యాబ్ టెక్నీషియన్ బత్తుల రవి,
కన్నుల పండుగగా ఉన్న నేటి 30+ మంది శ్రమ ఫలితాన్ని సమీక్షించినది Dr. DRK గారు,
వాన రాకడను బట్టి - రేపటి మన శ్రమదానం!
1) అది లేకుంటే గస్తీ గది - SBI ప్రాంతమూ,
2) ఉంటే 1 వ వార్డు బాలికల వసతి గృహ ప్రదేశమూ!
ఎవ్వరైనా ఎక్కడైనా
ఎవ్వరైనా ఇంత కాలము ఇంత శ్రమ చేస్తిరా ఊరుకు?
ఎక్కడైనా వేల రోజులు ఇన్ని సేవలు జరిగెనా మరి?
రుద్రభూములు, మురుగు కాల్వలు రోజురోజూ మెరుగుపడెనా?
అందుకే ఇది “స్వచ్ఛ సుందర చల్లపల్లి” ని పేరు పడెనా?
- నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
23.06.2026