పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా?
మారిన శ్రమదాన స్థలం! - @ 3873*
శ్రమకాలం బుధవారం-24.06.2026, సొంతూరి పనుల నిమిత్తం శ్రామికులు నిన్నటి వలెనే 35 మంది, పని వేళ ఎప్పటిలాగే 4:21-6:00 Am!
కార్యకర్తల కష్టంతో పునః శుభ్ర- సుందరీకరణకు నోచుకొన్నవి ప్రధానంగా 3 చోటులు! అవి:
1) గంగులవారిపాలెం వీధి మొదటి గస్తీ గది ప్రాంతమూ,
2) బందరు రోడ్డు వంతెనకు ఉత్తరపు పంట కాల్వ గట్టూ,
3) SRYSP కళాశాల ప్రహరీ వెలుపలి భాగమూ,
కొందరు నర్సులు మాత్రం ఈ మూడు స్తలాలతో ఆగక గ్రేస్ ఆస్పత్రి, రాజస్తానీల ఎలక్ట్రికల్ దుకాణము వైపూ చీపుళ్లతో చొచ్చుకుపోయారు. నాకైతే అప్పుడప్పుడు
“కొంచెం ఉక్కపోత సమయంలో కత్తులు వాడుతూ కొందరు రైతులకూ, గత-ప్రస్తుత ఉపాధ్యాయ, ఇతర ఉద్యోగులకూ, నర్సులకూ, కాంపౌండర్లకూ ఇంత వేకువనే ఇలా వీధి ఊడుపులేల? కొందరు స్తితిమంతులు ఇలా చెత్తను ఊడ్చి, ప్లాస్టిక్ తుక్కులేరి, టీ దుకాణం వద్ద ఎంగిలి గ్లాసులు, పేపరు గ్లాసులు పేపర్ అభిరుచులేమిటి?
“మహిళా కార్యకర్తలు మాత్రం ఇన్ని మురికి పనులు చేసి, చెమటలు కారి, దుమ్ము కొట్టుకున్న అవతారాలతో 6.30 తర్వాత ఇళ్ళు చేరే అవసరముందా? రోజూ ఇలా గంటన్నర శ్రమించనిదే, వీధి ఉద్యానాలను తీర్చిదిద్దనిదే, మురుగు కాల్వల్ని శుభ్ర పరచనిదే,
“ఆ తరువాత చివరగా అందరూ పిడికిళ్ళు బిగించి, స్వచ్ఛ సుందర చల్లపల్లి సాధనకై ప్రతిజ్ఞలు చేయనిదే - ఇంకా ఇందులో అత్యధికులు శ్రమదాన పనుల ఖర్చులకు ధనదాన మీయనిదే - తోచదా?పన్నేళ్ళ నుండీ ఇదే తంతు - ఊరి కోసం చేసింది కొంతయితే ఇంకా సాధించవలసింది ఎక్కువ ఐనా పట్టు సడలించరా?..... అని సందేహాలు కలుగుతుంటాయి!
“ఎవరు అంతిమ విజేతలు? బాధ్యత మరచి వీధుల్ని చెత్త మయం చేసే గ్రామస్తులా? విసుగూ విరామం లేక 3873* రోజులుగా మొండిగా బాగుచేయ ప్రయత్నిస్తున్న స్వచ్చోద్యమకారులా?” అనే ప్రశ్నలూ తలెత్తుతాయి!
నేటితో 86 వ ఏటిలోకి అడుగిడుతున్న మన మాజీ స్వచ్ఛ కార్యకర్త రావెళ్ల శివరామకృష్ణయ్య గారి తరపున అదే గ్రామస్తుడు ప్రేమానందం గారు నినాదాలు ప్రకటించగా –
రావెళ్ళ వారి జన్మదిన జ్ఞాపికగా అందరూ అల్పాహారము స్వీకరించి, రావెళ్ల దంపతులకు శుభాకాంక్షలు అందజేసి,
రేపటి శ్రమదానం కోసం SRYSP విద్యాసంస్థ ప్రవేశం వద్ద కలవాలని నిర్ణయించుకొన్నారు!
కలా - నిజమా?
మూడు వేల ఎనిమిదొందల రోజుల శ్రమ కలా - నిజమా?
నాల్గు లక్షల గంటల శ్రమ నిజంగానే సాధ్యపడెనా?
సొంత ఊరును బాగుచేయుట ఇంత సులువా - నమ్మశక్యమ?
పెద్దమాటలు చెప్పకుండా పెద్ద ఘనతలు సంభవించెన?
- నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
24.06.2026