3877* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం?

ఆదివారం (28.6.2026)  నాడు మాత్రం సాఫీగానే శ్రమదానం-@ 3877*

 శ్రమ దాతలు కేవలం 35 మందేగాని – శ్రమ జీవన సౌందర్యం 200 గజాల బారునా - జూనియర్ కళాశాల మొదలు భగత సింగ్ఆస్పత్రి వరకూ  ప్రజలందరి ఆహ్లాదం కోరి జరుగుతున్న ఆ కష్టంలోని అందాన్ని -వచ్చే - పోయే గ్రామస్తులు తప్ప ఎవరు ఆస్వాదించారు గనుక! 1 వ వార్డు, సజ్జా, మునసబు వీధుల్నుండైనా నామ మాత్రపు ప్రాతినిధ్యమైనా లేని అడవి గాచిన వెన్నెల అది!

ఐతే - అందుకు మినహాయింపుగా ఒక శ్రావ్య కృష్ణ ఆస్పత్రి యువ వైద్యుడూ, ఆస్పత్రి ఉద్యోగీ, నిన్ననే- అమెరికా నుండి వచ్చిన సరోజని గారూ కన్పించారు!

మునసబు వీధి ద్వారం వద్ద 4.20 కే 16 మందితో మొదలైన వీధి శ్రమల పండుగ 6.02 కు గాని ఆగలేదు ! చిత్రమైన వాతావరణం- కావడానికి చల్లని వేళైనా, అటూ ఇటూ తిరుగుతూ చిన్న పనులు చేసిన నాకే చెమటలు పడితే –

ఇక కసిగా గడ్డిని చెక్కే మెండు శ్రీను- నందేటి శ్రీను- తూములూరి - వంటి వాళ్ళు శ్రావ్య కృష్ణ ఆస్పత్రి, ప్రాత కంఠమనేని ఆస్పత్రి వెలి ఉద్యానాలలో  కలుపు పీకే, మొక్కల్ని సుందరీకరిస్తూ మంచినీళ్ళు త్రాగే సజ్జా-ఆకుల ప్రసాదుల సంగతి వేరే చెప్పాలా? “ఛ-  ఇంతకన్న వేసవే నయం” అనిపించదా?

కాస్త లేటుగా వచ్చిన ఐదారుగురూ చెమటధారలకు మినహాయింపు కాదు! ఏమైతేనేం – 6.00 తర్వాత చెత్త లోడింగ్  స్వచ్చ కార్మికులు గాని, చీపుళ్ల  వాళ్లు గాని, ప్లాస్టిక్ తుక్కుల సేకరణ కార్యకర్తలు గానీ, ట్రాన్స్ఫార్మర్ల  సందుల పని మంతులు గాని సమష్టిగా సాధించిన 200 గజాల బందరు జాతీయ రహదారి అంద చందాలు ఏ కాస్త సామాజిక స్పృహ కల మనుషులనైనా  కట్టి పడేయక మానవు! శ్రమదాన లక్షణం ఉన్న వాళ్లను కదలించక ఆగవు!

ఆస్పత్రి సీనియర్ నర్సు  మట్టా మహాలక్ష్మి అంత బిగ్గరగా శ్రమదాన ప్రతిజ్ఞలు చేయగలదని ఊహించ లేదు ! బ్రతిమాలినా ఆమె పాట పాడనందున ఘంటశాల శ్రీనే అందుకు పూనుకొన్నాడు!

రేపటి బందరు రోడ్డు పరిశుభ్ర సౌందర్యాల కోసం ఈ మునసబు వీధి వద్దనే కలవాలని కార్యకర్తల నిర్ణయం!-

         ఏమి సాధించాలి ఊరికి?

స్వచ్ఛతలకై కలలు కంటిరి - శుభ్రతలకై నడుము వంచిరి –

హరిత సంపద పెంచి పెంచీ ప్రజాహ్లాదము పాదుకొలిపిరి –

మన కళ్ల ఎదుటే చల్లపల్లిని మనోజ్ఞముగా తీర్చిదిద్దిరి

ఇక ఇంతకన్నా కార్యకర్తలు ఏమి సాధించాలి ఊరికి?

నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   28.06.2026