3879* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం!

జూన్ మాసాంతపు (మంగళవారం)వీధి శ్రమ పరిమళం - @ 3879*

చిన్న పాటి మార్పులతో మళ్లీ నిన్నా మొన్నటి –

1) బందరు రోడ్డు, 2) మునసబు వీధి, 3) కర్మల భవన ప్రదేశాలలోనే!

ఈనాటి శ్రామికులు  34 మందిలో మరీ  4.19 కే తొందరపడిన వారు డజను మంది, వాళ్ళంతా కలుసుకొన్నది 4 బాటల కూడలిలో;

పనులు కూడ 4 రకాలు:

1) వీధి ఉద్యానాల్లో  నిన్న మిగిలిన + నేటి వ్యర్థాల లోడింగు,

 2) ఎక్కువగా యంత్రంతోనూ, అప్పుడప్పుడు కత్తులు, పారలతోనూ గడ్డి చెక్కుడులు,

3) అమరావతి ప్రభువుల భవనానికి తూర్పు, ఉత్తరాల కశ్మల నివారణ,

4) దొరికిన అర ట్రాక్టరు రద్దును పాగోలు  రోడ్డుకు బరంతుగా ఉపయోగించడం.

(రోడ్లు ఊడుపులు వీటికదనం) !

అసలీ వీధి సేవల పరిమాణాన్ని కాదు - పని సమయపు కొలతలూ కాదు- ఇందులో ఎవరే అస్త్రశస్త్రాలను వాడి,  ఏ సందుల - ఏ మురుగు కాల్వల- పేడ పెంటల - ట్రాన్స్ఫార్మర్ల మూలల కశ్మలాల్ని తొలగించి,

 వీధి కంపుల్ని ఇంపుగా మార్చి, వేలకొద్ది రోజుల లక్షల కొలదీ గంటల శ్రమ చేస్తున్నారు? కఠిన దైహిక శ్రమలలో ఎందుకంత తృప్తి పొందుతున్నారు?.. 

ఇంకో పుష్కరకాలమైనా సరే.. ఈ 28 వేల గ్రామస్తుల ఆహ్లాదాన్ని సాధించగలమనేది వాళ్ల అతి విశ్వాసమా? డబ్బు ఖర్చుకీ వెరవరా?

...... ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలనే మనం వెతకాలి! 

6.09 కి మునసబు గారి వీధి పనుల్నీ, చెత్త లోడింగునూ ముగించిన విజయోత్సాహం వాళ్ళ ముఖాల్లో నేనేనా అటూ -ఇటూ వెళ్లే వచ్చే గ్రామస్తులు కూడ గమనించారా? 

6. 20-6.30 నడుమ జరిగిన వెరైటీ సమావేశాన్ని వక్కలగడ్డ సాధ్వి నినాదాలతో ప్రారంభిస్తే-

36 వ వివాహ వార్షికోత్సవ చిహ్నంగా BSNL నరసింహారావు గారు శ్రమోద్యమ ఖర్చులకు 1000/- సమర్పిస్తే-

DRK గారు కార్యకర్తల పనుల ప్రత్యేకతను ప్రస్తావించి,  వారి కర్తవ్య దీక్షలకు ఆశ్చర్యపడి,

రేపటి శ్రమదానం కూడ ఇదే బందరు వీధి - మునసబు వీధుల వద్దనే  పార్రంభమగునని చెప్పారు!

                     అసంకల్పిత చర్యగానే

వీధి కాలుష్యములు చూస్తే వీరి ఓరిమి నశిస్తుంటది!

వాడిపోయిన - మోడువారిన వృక్షములపై జాలి పుడతది!

నడక మానిన – అవకతవకల డ్రైను చూస్తే గొర్రొ - పారో

అసంకల్పిత చర్యగానే కార్యకర్తల చేతి కొస్తది! 

నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   30.06.2026