పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం!
3883* (శనివారం - 4-7-26) నాటి శ్రమ విశేషాలు!
37 మంది -డాక్టర్లు- నర్సులూ, ప్రస్తుత విరమిత ఉద్యోగులు వృత్తి కారులూ, రైతులూ, వణిక్ప్రముఖులూ... అనగా రకరకాల నేపధ్యాల వారు: తమ ఊరి కోసం చక్కని ప్రణాళికా బద్ధంగా ఉమ్మడి ప్రయత్నానికి దిగినపుడు వింతలూ, విశేషాలకేమి కొదువ?
వింతలలో మొదటిది - విశేషానుభవజ్ఞులైన, లబ్దప్రతిష్టులైన పెద్ద వైద్యులు తమ విధ్యు ధర్మాలెన్నో ఉండగా వేకువ 4.20 కే రోడ్డెక్కి చీపుర్లందుకోవడమే!
మొన్నటి దాక మేజర్ పంచాయతిని పరిపాలించిన మహిళ చిరకాలంగా చల్లపల్లి పుర వీధుల్లో చెత్తడిప్పలు మోయడమూ వింతే మరి !
70-80 ల వయసుల వాళ్ళు- ఊతకర్రల సాయంతో వచ్చి, వీధి పారిశుద్ధ్యానికి దిగితే అదీవింతే! అసలిన్నిన్ని కులాల-వృత్తుల అభిరుచుల- గ్రామాల నుండి రోజూ 30-40-50 మంది “స్వచ్ఛ కార్యకర్తలు” అనే పేరుతో
1) రెండేసి –మూడేసి గోతాల ప్లాస్టిక్ వ్యర్ధాలేరడమూ,
2) రిలయన్స్ మాల్ ముందు అరడజనుమంది పారలు, చెక్కుడు పారలు, చీపుళ్లతో అందంగా రూపొందించడమూ,
3) మద్యం దుకాణాల ముఖ ద్వారాలను పరిశుభ్ర పరచడమూ,
4)ఒక ట్రస్ట్ ఉద్యోగి- మునీశ్వరుడు కార్యకర్తల దాహార్తిని తీర్చడమూ,
5) గడ్డి చెక్కుడు యంత్రనిపుణుడు వీధి మార్జిన్ల గడ్డికి క్షుర కర్మ లాచరించడమూ
6) ఒక DRK డాక్టరు స౦క్లిష్ట శస్త్రచికిత్సల్ని పర్యవేక్షించినట్లు, అంతటా కలియ దిరుగుతూ ఉండడమూ,
7) తెల్లారేప్పటికి లోడింగు వీరులు వ్యర్ధాల కుప్పల్ని ట్రాక్టర్ లో నింపడమూ
8) మొత్తానికి అందరూ కలిసి, మునసబు వీధి మొదలు -2దేవాలయాల -దుకాణాల –మెకానిక్ షెడ్ల - హోటళ్ళ - టైలరింగ్ షాపులతో గూడిన 200 గజాల సువిశాల బందరు మార్గాన్ని చూడచక్కనంతగా మార్చడమూ...... ఇవన్నీ నా దృష్టిలో వింతలే!
తోమ్మిదో వింతగా ఏదో నామమాత్రంగా- సాధనాల సతీష్ వంటి ఒకరిద్దరు తప్ప ఈశ్రమదాన వైభవాన్ని కన్నెత్తి చూడకపోవడమే!
రేపు సాయంత్రం(7pm) చండ్రవికాస కేంద్రంలో “మండలి” వారి నాటక ప్రదర్శనకు కార్యకర్తలనాహ్వానించిన P. కృష్ణ కుమారిగారు నేటి నినాద కర్త!
రేపటి శ్రమదానం తూర్పురామాలయం దగ్గరి నుండి పార్రంభం!
గళం విప్పి పాడగలడు
తొలినుండీ సామాజిక స్పృహ కలిగిన జాన్ స్టన్ జీ
కవుల కలం గీతాలను గళం విప్పి పాడగలడు
పాఠశాల బాలకులకు పాఠాలను చెప్పగలడు
ప్రతి వేకువ తన గ్రామపు బాధ్యత నేరవేర్చగలడు!
- నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
03.07.2026