3886* వ రోజు....

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం!

మంగళవారం(7-7-26) శ్రమదాన విశేషాలు! @ 3886*

               సదరు శ్రమ వినోదాలు  బందరు రోడ్డుకు చెందిన-షాబుల్ వీధి మొదలు “ఎనీటైమ్ మనీ” కేంద్రాల దాక 4.20 నుండి 6.05 వరకు జరిగినవి; జరిపిన నికర కార్యకర్తలు 28 మంది కాక నలుగురు దేశ-విదేశాల యువ  స్వచ్ఛ సుందరోద్యమాభిమానులు!

               తుది సమావేశాన్ని 32 మంది కార్యకర్తలేకాక -10 మంది ఇతరులు కూడ ఆసక్తిగా గమనించారు, నందేటి శ్రీను విస్పష్ట నినాదాలు విని, స్పందించిన వాళ్లు స్పందించారు, చల్లపల్లి శ్రమదానోద్యమ సారాంశమైన అతని పాటనూ విన్నారు, ఈ ఉద్యమ నిర్మాత అభిప్రాయాలను తెలుసుకొన్నారు.

               ముఖ్యంగా ఐర్లండు ప్రవాసుడైన సాత్విక్ మురారి  గారి అభినందన పూర్వక సందేశం పట్ల ఆసక్తి ప్రదర్శించారు. పుష్కర కాలపు అరుదైన అనితరసాధ్యమైన సామూహిక సామాజిక శ్రమదానం గురించి ముమ్మనేని సన్నీ గారి డాక్యుమెంటరీ  త్వరలో రాబోతున్నదని తెలుసుకొనిరి !

               మాటల దేముంది – రొజూ DRK గారో, ఇతరులో చల్లపల్లి గ్రామ సమగ్ర స్వచ్చ సుందర భవితవ్యం గురించి చెపుతూనే ఉన్నారు! పాటలూ,పద్యాలూ వ్రాసే వారు రాస్తూనే వున్నారు కార్యకర్తలు రెక్కల కష్టంతో ఆచరణలో ఋజువు  చేస్తుండడమూ జరుగుతున్నదే!

               28 వేల మంది గ్రామస్తులలో సంపూర్ణ పరిశుభ్ర స్పృహ ఇకెంత  కాలానికి వస్తుందో- అందుకింక ఏమి చేయాలనేదే ఇప్పుడు సమస్య!

               గాలికి వీచడమూ, పక్షికి ఎగరడమూ ఎంత సహజమో- అంత సులభంగా  ఈ వేకువ కూడా స్వచ్చ కార్యకర్తల వీధి శుభ్రతా ప్రయత్నాలు జరిగిపోయినవి!

               సంత వీధి డ్రైను వ్యర్ధాల గుట్ట కానీ, ట్రాక్టరు సగం నిండిన దుమ్ము  ధూళి గాని, కూరల – ఫాన్సీ –పచారి తదితర దుకాణాల ఎదుట బాగు చేయుట గాని, 2 గోనె సంచుల ప్లాస్టిక్ ల ఏరుడు గాని ....ఏవీ ఆగలేదు.

               చివర్లో 12 మంది వీధి అంచుల్ని ఆవేశంగా ఊడ్చేటప్పుడు మాత్రం దుకాణాల వారూ, ప్రయాణికులు ఆ ధూళి మేఘాలకు భయపడి, తప్పు కొన్న మాట వాస్తవం!

               రేపటి వేకువ పనుల కోసం ATM కేంద్రం  దగ్గర ఆగాలనేది నిర్ణయం!

               సాధారణ జీవనుడు

ప్రజాశక్తి సంబంధిత కార్యకర్త శేఖరుడు

చందమామ అపార్ట్ మెంటు సాధారణ జీవనుడు

రెండు నెలల నుండి వచ్చుచుండె స్వచ్ఛసేవలకు

ఊరు పట్ల తన బాధ్యత నెరవేర్చేటందులకు!  

- నల్లూరి రామారావు

     రిటైర్డ్ ప్రిన్సిపాల్

     07.07.2026