పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం!
ఆదివారం(12-7-2026) నాటి 81 మంది పిచ్చోళ్ళ స్వర్గం!-@3891*
ఆ స్వర్గసీమ బైపాస్ వీధిలోని సామ్యవాద వీధి దగ్గర “దాసరి రామమోహన రావు” గారనే 95 ఏళ్ల స్వచ్ఛ కార్యకర్త ఇంటి ప్రాంతం! అక్కడ దేవేంద్రుడో- దిక్పాలకులో, రంభ, మేనక, ఊర్వసి, తిలోత్తమ వంటి ఎంటర్ టైనర్లూ లేరు! వేకువ 4.21 కే ఆ వీధిలో గుమికూడిన పిచ్చి వాళ్ళెవరనగా, 6.06 దాక వాళ్ల పిచ్చి చేష్ట లేవనగా:
గత 12 ఏళ్ల నుండి ఏదో వెర్రెక్కినట్లు- అదేదో దేవాలయంలో నిష్టాత్మక పూజలన్నట్లు-గ్రామ వీధుల్నీ, కర్మల భవనాల్నీ, రుద్ర భూముల్నీ , ఇతర పబ్లిక్ స్థలాల్నీ, పేడలూ పెంటలూ ఎత్తుతూ, ఊడుస్తూ 33 వేల చెట్లు నాటి పెంచుతూ, రోడ్ల గుంటల్ని పూడుస్తూ, మురుగు కాల్వల్లో దిగుతూ.... ఊరికి నానా గొడ్డు చాకిరీ చేస్తున్న స్వచ్ఛ కార్యకర్తలనబడే వీర వెర్రి వాళ్ళు!
ఇన్నేళ్లయినా, ఇప్పటికీ పూర్తిగా ఊరి స్వచ్ఛ శుభ్రతలు పట్టని, సామాజిక స్పృహ ఒంట పట్టని ప్రజలంతా మారేదాకా-
చల్లపల్లి మరింత సౌకర్యంగా, చైతన్య వంతంగా, ఆహ్లాదకరంగా రూపొందేదాకా- ఈ సుమారు 200 మందికి వెర్రి తగ్గదట!
ఇది నందన వనంగా మారితేగాని వాళ్ల శ్రమదానం ఆగదట! సరే అలాగే కానీయండి- ఎవరి వెర్రి వాళ్ళకానందం – ఏం చేస్తాం!
ఇంకాస్త వివరంగా చూస్తే: ఈ పిచ్చి మామూలుదీ కాదు- ఈ వెర్రోళ్ళు అల్లాటప్పా మనుషులూ కారు! సమాజంలో లబ్ద ప్రతిష్ఠులైన సీనియర్ వైద్యులూ, ఆరేళ్ల మొదలు 95 ఏళ్ళ వయస్కులూ, వణిక్ర్పముఖులూ, రైతులూ, ఉద్యోగ నిరుద్యోగులూ, మహిళా గృహిణీమతల్లులూ ఉన్నారు! అందరిదీ ఒకే మాట-ఒకే బాట! అది చల్లపల్లి పునః పునః శుభ్ర సౌందర్యమయం కావడమే! ఊరి మేలు తలకెక్కిదిగని అతిపెద్ద పిచ్చోళ్ళైన డి.ఆర్.కె - పద్మావతి గార్ల మాట చాలవరకు జవదాటకుండడమే!
ఇక వీళ్ల ఈ వేకువ శ్రమదానంలో 2-3 విశేషాలేవంటే :
- నిన్న రోడ్డు ప్రమాదంలో చేతి వ్రేలు విరిగిన 'తూము' అనే పిచ్చాయన కట్టుతోనే వచ్చి ఫోటోలు తీయుట,
- 4 కిలో మీటర్లు దూరం నుండి చీకటిలో వచ్చి, రెక్కాడితేనే డొక్కాడే 26 మంది వెంకటాపురం కూలీలు చల్లపల్లి కోసం శ్రమించుట,
- గంధం బృందావనుడి చెప్పులు పొరపాటున చెత్త బండిలోకి ఎక్కి డంపింగ్ యార్డు కు చేరుట,
- సూపర్ సీనియర్ కార్యకర్త ‘ దాసరి’ వారి జన్మ దినోత్సవ1 లక్ష విరాళాన్ని నేను స్వీకరించుట,
- అల్పాహారం పేరిట కార్యకర్తలందరికి దాసరి వారి అనల్పాహార విందు అందుట,
5 వ విశేషం:
DRK గారికో- మరెవరికో ‘ఈ వీధి సౌందర్యాన్ని సగాన వదలరాదనిపించి, రేపటి వేకువ కూడ బైపాస్ మార్గంలోనే శ్రమించాలనే కోరిక!
బాధ్యతా త్రిమూర్తులు
అరుగోనయా మోతుకూరి స్వచ్ఛ కార్యకర్తలు
పడమటి వీధిన వసించు బాధ్యతా త్రిమూర్తులు
మస్తానూ- వెంకటేశ - సీతారామయ్యలు
సాటి ప్రజల సుఖం కోరి శ్రమచేసే ధీరులు!
- నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
12.07.2026