3892* వ రోజు....

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం!

సోమవారం కూడ(13-7-26) అదే వీధి-అదే చాకిరీ!@3892*

               నేటి కార్యకర్తలు 28 మందీ,అసంపూర్తిగానే బైపాస్ రోడ్డు పారిశుధ్య పనులు! కార్యకర్తలు

               “ఎలాగైనా ఈ వేకువ సమయాన – ఈ 200 గజాల శుభ్రసుందరీకరణ ముగించాల్సిందే” అనే పట్టుదలతో ఉన్నా-

               1) ఆ 30 గజాల మురుగు కాల్వ సరిగా పారనని మొరాయించడం వల్లా,

               2) గద్ద గోరు ‘ముళ్ళ’ పూల చెట్ల సుందరీకరణ నెమ్మదించినందు వల్లా,

               3) డ్రైనూ రోడ్డు నడుమ గడ్డి చెక్కుడు పని వల్లా,

               4) కొందరి శ్రమ పిచ్చి మొక్కల, ప్లాస్టిక్ తుక్కుల, ఎంగిలి విస్తర్ల ఏరి వేతకు పరిమితం కావడం వల్లా,

               5)మహిళా కార్యకర్తలేమో 100 గజాల వీధి ఊడుపుకు దిగడం వల్లా,

               నేటి వీధి పనులు అనుకొన్న లక్ష్యాన్ని చేరుకోలేదు! పైగా –చెత్త లోడింగు పనొకటి! ఈ ఉదయపు, నిన్నటి వ్యర్ధాల గుట్టలు ఎంత పెద్దవంటే- ఆ పని లో నిపుణుడైన మాలెంపాటి అంజయ్య గారే ఇక సర్డలేక 5 నిముషాల ముందు గానే  చెత్త బండి దిగేశారు!

               ఇంకొన్ని చెత్త కుప్పలు రేపటికి మిగిలిపోయాయి. తమ ఇంటి ఎదుటి మా స్థలంలో కొన్ని కుప్పలు మిగిలాయనీ, ఎత్తాలనీ దాసరి రామమోహన రావు గారు కస్తూరి శ్రీనుకు కబురంపారు గాని- అప్పటికిక ఆ అవకాశం మిగల్లేదు!

               ఈ మధ్య కొన్నాళ్లు వీలు పడక-వీధి సౌందర్య కృషికి రాని జాన్ స్టన్ –అనిల్ మాస్టర్ల ద్వయం ఈ పూట హాజరై స్వచ్ఛ సేవ చేసారు.

               భోగాది శాంతి ససేమిరా అనడం వలన నినాదాలతో ఆ సభను గంధం లక్ష్మణ ప్రారంభించవలసి వచ్చింది! ఎప్పటి లాగే ఆ సమావేశంలో-

               DRK డాక్టర్ గారు కార్యకర్తల శ్రమ అవసరం ఇంకా ఊరికి ఉన్నందున ఆరోగ్యాలు జాగ్రత్త వహించాలనీ,

               దాసరి రామమోహనరావు గారి వలే పిల్లలకు స్వేఛ్చ నివ్వాలనీ, జీవితంలో గడ్డు సమస్యలప్పుడు క్రుంగిపోరాదనీ,        

               రేపటి మన శ్రమదానం సజ్జా ప్రసాదు గారి వీధి నుండి పునః ప్రారంభించాలనీ సూచించారు!

               అది సామూహిక బలమా?

    ఎందుకొ సీతారామయ్యకు చెత్తబళ్ల సర్దుడు !

     ఇంట్లో పండక బజార్ల చెత్త డిప్ప మోసుడు!

     సొంత మేలు చూసు కొనక ఊరి బాగు వెతుకుడు!

     అతని శక్తి సామర్ధ్యమ? అది సామూహిక బలమా?

- నల్లూరి రామారావు

    రిటైర్డ్ ప్రిన్సిపాల్

    13.07.2026