పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం!
3893* (మంగళవారం 14.07.26) నాటి శ్రమ సంగతులు!
నిన్నటి నిర్ణయానుసారం ఖచ్చిత కాలానికి ముందుగా 11 మందీ, తరువాత 19 మందీ వెంకటాపురంతో సహా వివిధ చల్లపల్లి వార్డుల నుండి వెదక్కుంటూ వచ్చి, బైపాస్ వీధిలోని సజ్జా ప్రసాద్ గారి రోడ్డు వద్దకు చేరుకొన్నారు.
“వచ్చిన వాడు ఫల్గుణుడు ...”అనే మహాభారత పద్యంలో లాగా 69 ఏళ్ళ పెద్ద వైద్యుడూ, గ్రామ సర్పంచీ వచ్చిన వారిలో ఉన్నారు! తిక్కన మహాకవి ఉద్యోగ పర్వంలో వర్ణించిన “ఉత్తర గో గ్రహణ మహాయుద్ధం” వలెనే సాగింది – ఆ వీధి కాలుష్యం మీద 30 మంది స్వచ్ఛ కార్యకర్తల సమరం!
అక్కడ భారత యుద్ధం లో ధర్మం విజేత కాగా, ఈ వేకువ గంటన్నర పెనుగులాటలో స్వచ్ఛ యోధుల శ్రమే విజేత!
అక్కడ రధాలూ, గుర్రాలూ, కత్తులూ,గదలూ, బాణాలు- వంటి వాటిని ప్రయోగించిన భీష్మ –ద్రోణ –కర్ణ –అర్జున –భీమసేనాది యోధాను యోధులు! ఇక్కడ నిలిచిన మురు క్కాల్వ వ్యర్ధాలూ, వీధి దుమ్మూ ప్లాస్టిక్ – గాజు వస్తు కల్మషాల మీద అగ్రహించిన కస్తూరి-అంబటి-సజ్జా-ఆకుల –గంధం-అనిల్-జాన్ స్టన్ వంటి వీర స్వచ్ఛ కార్యకర్తలు,డేవిడ్ ,నిరంజన్,రవి వంటి యువ యోధులూ కోడూరి,మాలెంపాటి ,మోతుకూరి వంటి వారి కేకల- మాటల- గడ్డికోత మరల- దంతెల గరగరల చప్పుళ్ళ తో ఇదీ యుద్దక్షేత్రమే!
“యద్భావమ్ తద్భవతి” అన్నట్లు –ఈ పన్నెండేళ్ల గ్రామ ప్రయోజనకర శ్రమదానాన్ని “ఇళ్ళ దగ్గర తోచని,నిద్ర పట్టని,కాలక్షేప రాయుళ్ళ యొక్క పెద్దగా పనికి రాని ప్రయత్నం” అనుకొంటారా?-అలాగే కనిపిస్తుంది!
“కానే కాదు- ఈ కాలానికి, ప్రతి గ్రామానికి అవశ్యకమైన –ఆరోగ్యదాయకమైన కార్యక్రమం” అంటారా? అదీ నిజమనే అనిపిస్తుంది!
సరే నేనేదో ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంటాను గాని- కార్యకర్తలకు ఆ గంటన్నర సమయంలో తీరుబడెక్కడ?
ముళ్ళ కొమ్మల్ని కత్తిరించడమో, రోడ్డు గుంటల్ని పూడ్చడమో, తామే నాటిన చెట్ల పాదుల కలుపు తీయడమో,చెత్త లోడింగో ...ఏ పనీ ఆగలేదు! చివర్లో మాత్రం కాఫీ సమయంలో తాము కష్టించి, తీర్చి దిద్దిన వీధి అందాలను తృప్తిగా చూచుకొని, పాస్టర్ డేవిడ్ గారి ప్రతిజ్ఞలను బలపరచి,
రేపటి పనులు అశోక్ నగర్ 3వ వీధి నుండి జరపాలని నిర్ణయించుకొన్నారు!
ఈ చెత్తపనుల సరదానా?
చేనేతల సొసైటీలో చేస్తివిగద ఉద్యోగం
పదవీ విరమణ లేటుగ పాటిస్తివి చాలదా?
ఇంత లేటు వయసున ఈ చెత్తపనుల సరదా?
సామాజిక బాధ్యతగా స్వచ్ఛసేవ తప్పదా?
- నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
14.07.2026