3894* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం!

3894*    శ్రమదినం కూడ (15.07.26) బైపాస్ వీధిలోనే!

               ఈ బుధవారం వేకువ 4.10 కి దూర ప్రయాణికుడు-ఆగంతకుడు-ఏవరైనా చల్లపల్లి 1వ వార్డు లోని ఈ వీధి వద్దకు వచ్చాడను కోండి; ఆయనకు ప్రతి చిన్న క్రొత్త విషయాన్నీ పట్టించుకొనే లక్షణ మున్నదనుకోండి; నేటి 30 మంది కార్యకర్తల వేషాలనీ,చేతి పనిముట్లనీ, చేతల్ని, ప్రక్కనున్న  మైకు పాటల్ని, ఒక గంట పాటు పరిశీలించాడనుకొందాం; ఒకరిద్దర్నడగి “ఏమిటిదంతా”? అని అడిగి తెలుసుకొన్నాడను కొందాం; ఇక- అప్పుడాతని హావభావాలెలా ఉండవచ్చో ఊహిస్తే:

               ముందుగా అయోమయంలో పడతాడు –“చూస్తే చదువూ-సంస్కారం –ఉన్నట్లే కనిపిస్తున్నారు, ఈ వేకువ 4.30 సమయంలో తెల్ల టీషర్టులతో,  టోపీలతో, తల దీపాలతో ఈ పారిశుద్ధ్యపనులేమిటా” అని!

               “అరె !వీళ్ళలో  వయోవృద్దులూ, సరిగ్గా వంగలేని వాళ్లూ, మహిళలూ కూడ ఉన్నారే! కొంప తీసి, వీధి ప్రక్క ఖాళీ స్థలాల కబ్జా ప్రయత్నమా ఏమి? అని కూడ సంశయిస్తాడు!

               ఉండుండి ఒక కోడూరు...కార్యకర్త వేసిన కేకకు ఉలిక్కి పడినా పడతాడు –అదాయనకు పుట్టుకతో వచ్చిన అలవాటు అని తెలుసుకొని స్తిమిత పడతాడనుకొండి!

               అంతలోనే కుడి ఎడమవాటం ప్రసాదులిద్దరు పెద్ద చెట్టు కొమ్మను కోస్తున్న మర రంపం చప్పుడుకు అటుతిరిగి చూసి, అలాంటి 33వేల చెట్లను ఈ వింత మనుషులు నాటి పెంచారనీ, కరెంటు తీగల కోసమూ, వృక్ష సౌందర్యం కొసమూ కొమ్మల్నలా తెగ కోస్తున్నారనీ తెలిసి, ఆశ్చర్యపడవచ్చు!

               అంజయ్య , ట్రస్టు  కార్మికమేస్త్రీ ,BSNL,భరత్, నిరంజన్,మెండు,మహాలక్ష్మి వంటి వాళ్ళు తుక్కుల్ని ఊచ్చి, డిప్పలకెత్తి ట్రాక్టర్ లో నింపుతున్న దృశ్యాన్ని చూసి తెలుసుకొని –“ఇదేదో, ఒక పూటో-ఒక వారమో కాదు-12 ఏళ్ళుగా వీళ్ళ శ్రమదానమిలానే” అని తెలుసుకొని, అతగాడు కాస్త ఆలోచనాపరుడైతే-ఆనందిస్తాడు  కూడ!

               6.00 తరువాత విజిలు మ్రోత విని, పని విరమించి,కాఫీలు త్రాగడమూ, అందరూ క్రమ శిక్షణతో నిలిచి, మెకానిక్ భరత్ పలికిన గ్రామ శుభ్రసుందరీకరణ ప్రతిజ్ఞల్ని అర్ధం చేసుకొని –బహుశా తన ఊళ్ళో తాను కూడ ఇలాంటి సామాజిక బాధ్యతల్ని  మొదలు పెట్టాలని అవేశపడతాడేమో!

               అతడు చివరగా –“రేపటి శ్రమదానం భారతలక్ష్మి-మెహర్ వడ్లమిల్లు వద్ద”  అనే డి.ఆర్.కె. డాక్టరు ప్రకటనను వింటాడు!

               ముళ్లు గీరుకొంటున్నా

    అయ్యా! వెంకటేశ్వర! నీ స్వచ్ఛ సేవ చూస్తున్నా

    ప్లాస్టిక్లను పోగేసే పనులు మెచ్చుకొంటున్నా

    ముళ్లు గీరుకొంటున్నా మొరటు పనులు ఆపని నీ

    పట్టుదలను గమనిస్తూ పరవశించిపోతున్నా!

- నల్లూరి రామారావు

    రిటైర్డ్ ప్రిన్సిపాల్

    15.07.2026