3897* వ రోజు....

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం!

               వారాంతపు (18.7.2026) 33 మంది శ్రమ సందడి!@ 3897 *

దాని కాలపరిమితి 4.19 – 6.04 AM  నడుమ;సందడి చేసిన వాళ్ళు 33 మంది;శ్రమ చప్పుడు వినిపించినది ప్రధానంగా గంగులవారిపాలెం – NH 216 కూడలిలో!

             విచిత్రమేమంటే – 3 ఊళ్ళనుండి-మూడేసి కిలోమీటర్ల దూరం నుండి – 33 మంది కార్యకర్తలు పాలుగొన్నారు గాని,చిరుచినుకుల చల్లని హాయిగొలుపు వాతావరణంలో మొక్కలు నాటారు గాని పాతిక గజాలలోపు ఇళ్ళవారు గాని,గంగులవారిపాలెం నుండిగాని ఏ ఒక్కరు పట్టించుకోలేదు!

             “ ఏముందిలెద్దూ! పది – పన్నెండేళ్ల నుండి జరుగుతున్న తతంగమే గదా!వేకువ 4.00 – 6.00 మధ్య రోడ్డెక్కుతారు,తమ ఇళ్ళ ముందులాగా  ఊడుస్తారు,మొక్కలు నాటుతారు,గంటన్నర తర్వాత వెళ్తారు!

అంతేగదా”! – అని తమపనులకోసం వెళ్ళే – వచ్చే గ్రామస్తులూ,కొంపలారిపోతున్నట్లు 100 కి.మీ మించిన వేగంతో దూసుకుపోయే వాహనదారులూ అనుకొంటారేమో!

                ఈ పూట కార్యకర్తల్లో మూడొంతుల మంది పనులు మాత్రం

1) బురద అంటుకొంటున్నా మోకాళ్ళానించి,పాదుల మట్టి బైటకు తోడడమూ,

2)పలుగులతో గుంటలు త్రవ్వడమూ,

3)రక రకాల మొక్కలు పెరిగిన ప్లాస్టిక్ కవర్లు చించి,పాదుల్లో నాటి,తగుమాత్రం నీరుపోయడానికీ పరిమితమైనవి!

                మిగిలిన వాళ్ళు –

NH 216 రహదారి ఊడుస్తూ,

అడ్డూ – ఆపూ లేక పెరిగే చెట్ల,పూలమొక్కల కొమ్మల్ని కత్తిరిస్తూ,కొన్ని మొక్కల పాదుల్ని సవరిస్తూ,

షణ్ముఖ శ్రీను ప్లాస్టిక్ వస్తువులు ఏరుతూ ఈహైవే సుందరీకరణకు తమ వంతు కృషి చేసారు.

               చివరి పావుగంటలో:

1)మైకు మొరాయింపులో ఇనుపకుతిక రాజుగారి నినాదాలూ,

2)D.R.K గారి సమీక్షా సంగతులూ,

3)అంబటి శంకరరావు గారిఅభిప్రాయ పత్రాన్ని నేను చదవక రేపటికి వాయిదా పడడమూ,

4)అహ్మదాబాద్ లో ఉంటున్న శంకరశాస్త్రి గారు 2 రకాల స్వీట్లను పంచించడమూ,

రేపటి వేకువ శ్రమదాన స్థలం కూడ ఈ NH 216 – బండ్రేవుకోడు వద్దననే నిర్ణయమూ!

ఈ తూము వారు నాల్గింటికె ప్రత్యక్షం

 కలెక్టరేట్ లో ఉద్యోగం కానీ ఈ తూము వారు

 నాల్గింటికె ప్రత్యక్షం మొదటి ఫోటో తీసేందుకు

 అంతేనా – అప్పుడప్పుడావేశం పెరిగి పెరిగి

 తూముల్లో దూరి చెత్త తొలగించుట పరిపాటి!                                                           

                                                                                                                 - నల్లూరి రామారావు

                                                                                                                       రిటైర్డ్ ప్రిన్సిపాల్

                                                                                                                           18.7.2026