3898* వ రోజు.....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం!

జులై 19 – ఆదివారం నాటి రహదారి శ్రామికులు 35 మంది - @3898*

               ఎప్పటిలాగే కార్యకర్తల తొలి జట్టు హాజరు 4.19 కే! పని వేళ తుది హద్దు కూడ 6.05 గానే ఉన్నది. పని స్థలం మాత్రం సుమారొక కిలోమీటరు దాక విస్తరించింది - గంగులవారిపాలెం నుండి పెదకళ్ళేపల్లి బాట దిశగా!

నేటి శ్రమలు 3 రకాలుగా సాగినవి :

1) NH 216 రెండు ప్రక్కలా సుందరీకరణ. ఇందులో మంచి ప్రావీణ్యం గల దేసు మాధురి రానందు వలన ఆ స్థానాన్ని సజ్జా ప్రసాదు గారు భర్తీ చేశారు. పాదుల్ని శుభ్రపరచడమూ, అందంగా లేని గడ్డిని చెక్కడమూ, రంగురంగుల పూల మొక్కల్ని ట్రిమ్ చేసి, మరింత అందంగా మార్చడమూ ఈ ఐదారుగురి పని!

2) గత 2 రోజుల్లాగే బాటకు ఉత్తరపు ఖాళీలో మొక్కలకు పాదులు - త్రవ్వి, సారవంతమైన మట్టి పోసి, నాటడం. ఈ పనిలో కష్టం సుమారు 20 మందిది! ఈ 3 రోజుల్లో 76 మొక్కలు ఈ కిలోమీటరు బారునా నాటి ఉంటారు.

ఈ సందర్భంలో ఒక ప్రత్యేక విషయం ప్రస్తావించాలి!

“ఇదే NH 216 లో 2 ½ కిలోమీటర్ల బారునా ఉత్తర దక్షిణాలలో 2 లేక 3 వరుసల పూల - పండ్ల - నీడ మొక్కలు గతంలోనే పెరుగుతుండేవి! బాటసారులకు మంచి ఆహ్లాదం పంచేవి గదా! మళ్లీ ఇలా నాటవలసిన అగత్యమెందుకు?” అంటే –

               ప్రాకృతిక సౌందర్యాన్ని ఆస్వాదించే సహృదయులున్నట్లే – మన ప్రాంతంలో దాన్ని ద్వేషించే, పొరపాట్లు చేసే మరొక తరహా మనుషులూ ఉన్నారు - మొక్కలు పీక్కెళ్లే - పొరపాటున తగలబెట్టే జాతి అన్నమాట!

3) మూడవ రకం శ్రమదానం రోడ్డు ఊడ్పులూ, ప్లాస్టిక్ ల ఏరివేతలూ, వగైరాలన్న మాట!

- అతడు ‘వీర’ సింహుడే గాని – నడుం నొప్పి వల్ల ఒక ప్రక్క చేతి కర్రతో, మరో ప్రక్క చెక్కుడు పారతో చేస్తున్న శ్రమదానాన్నీ,

- ఆమె ఆస్పత్రి సీనియర్ నర్సే గాని, చూసేవాళ్లకు మగకార్యకర్తతో సమానంగా పారతో పనిచేస్తున్న గురిందపల్లి ఇందిరనూ గమనించాను!

               6.15 కు అందమైన స్వాగతద్వారం వద్ద శ్రమదాతలు వేముల శ్రీనుతో గొంతులు కలిపి శ్రమదాన ప్రతిజ్ఞలు చేసే అందమైన దృశ్యమూ నాకు గుర్తున్నది! అంబటి శంకరరావు గారు వ్రాయగా నేను చదివిన 4000 రోజుల స్వచ్ఛ - సుందర - చల్లపల్లి ఉద్యమంపై అభిప్రాయాలను విని ఉత్తేజితులైన కార్యకర్తలనూ,

               రేపటి శ్రమదానం కూడ ఇదే NH216 పైనే జరగాలనే DRK గారి ప్రకటననూ తెలుసుకున్నాను!

               ఆమెకు కరతలా మలకము

మిస్సెస్ లక్ష్మి సెల్వమంటే - మెలకువలకు మారుపేరు

అదిలింపులు – లాలింపులు ఆమెకు స్వతహాగా కుదిరెను

ఆసుపత్రి విధి నిర్వహణామెకు కరతలా మలక

మదట్లుంచి – గ్రామ విధులకామె స్పందన చూడుడు!  

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   19.07.2026