3899* వ రోజు.....

                పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం! 

3899* వ విడత (సోమవారం – 20.7.2026)  శ్రమదానం ఇది! 

             నేటి శ్రమదాతలు 20 + 3 మంది,(శివరామపురం నుండి ఒక అతిధి కార్యకర్త,ఇద్దరు చివర్లో వచ్చిన ట్రస్టు కార్మికులతో సహా) శ్రమ గ్రహీత మరొక మారు గంగులవారిపాలెం సమీప NH 216,పనుల సమయం 105 నిముషాలు (4.22 - 6.07 AM)!

               బాగైన రాజమార్గం (NH) బొత్తిగా 100 గజాలే!

1) దాని దక్షిణపు ఖాళీ స్థలమూ,

2) కొంత మేరకు గంగులవారిపాలెం బాట!

               3 వ వంతు మంది జాతీయ రహదారి ప్రక్కన విరగబూసిన రంగు రంగుల సువవర్ణగన్నేరు పూల చెట్ల కొమ్మల ఖండన – మండనంలో పనిచేయగా మిగిలినవారిలో సగం మంది రోడ్లకూడలి ప్రాంత శుభ్ర  -సుందరీకరణలో  శ్రమించగా,

               మరో ఆరేడుగురు చెత్తలోడింగులోనూ,వీధి ఊడుపులోనూ కష్టపడిరి! సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తు సేకర్త అన్నిచోట్లా తిరుగుతూ,ప్రోగేసినవి గోతాం నిండుగా!

               క్రొత్తగా చూసే వాళ్ళకు “ఊరి ఆహ్లాదం కోసం ఈ చీకటి వేళ పాపం ఈ కార్యకర్తల కెందుకింతటి శరీర కష్టం? ఎలాగూ బాధ్యతలేని మనుషులు మళ్ళీ ఈ పూలు కోసుకెళ్తారు,త్రాగిన మత్తులో కొందరు చెట్లను నరకడమో – కాల్చడమో జరుగుతూనే ఉంటుంది,బాధ్యత గల గ్రామ పెద్దలూ,అధికారులూ అంతగా పట్టించుకోరు.... “అనే ధోరణిలో ఆలోచిస్తారు గాని –

               ఈ స్వచ్చ  కార్యకర్తలు మహా మొండిఘటాలు! ఇలాంటి విఘ్నాలెన్నో చూసిన - ఎదుర్కొన్నవారు!

మొక్కలు పీక్కెళ్తే , చెట్లను తగలబెడితే మళ్ళీ – మళ్ళీ పెంచుతూనే ఉంటారు!

            6 .00 తర్వాత ఊరి స్వాగత ద్వార ప్రాంతాన్ని,పరిశుభ్ర – సుందర పుష్ప హరిత సౌందర్యాన్నీ చూస్తుంటే కొందరు కార్యకర్తలకు ఆ చోటు వదిలి వెళ్లాలనిపించలేదు!

             మల్లంపాటి వారి నినాదాలను పునరుద్ఘాటించి,

            D.R.K గారు యాదాలాపంగా చెప్పే మంచి మాటలు విని,

           రేపటి మనశ్రమ స్థలం విజయవాడ రోడ్డులోని N.T.R పార్కు వద్ద అని నిర్ణయిOచుకొని,నేటి కార్యక్రమం ముగించారు!

 

భోగాది వాసు సమన్యయము

ఈయన పలు ఉద్యమాల కిచ్చే మంచి ఊపు

గ్రామ  సమస్యల యెడల కలదు ముందు చూపు

కొన్ని చిక్కు ప్రశ్నలకు సమకూర్చు పరిష్కారము

భోగాది వాసు సమన్యయము ఊరి కెంతొ ఆవశ్యకము!

 

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   20.07.2026