3908* వ రోజు....

  పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం

 

(29.7.2026)  వేకువ ఆహ్లాదకర వాతావరణంలో3908* వ శ్రమదానం!

               ఊరుకు దూరంగా ఐతే అయింది గాని - హైవే మీద హైస్పీడ్ గా వాహన సంచారాల మధ్యనే గాని,4.17 కే డజను మందితోనే మొదలయిన నేటి రహదారి హరిత సుందరీకరణం చక్కని వాతావరణంలో జరిగింది.

               కార్యకర్తలు 29 మందే ఐనా అరకిలోమీటరు దాక విస్తరించారు.రాత్రి దఫ దఫాలుగా కురిసిన జల్లులతో భూతాపం శాంతించింది,ఎల్ నినోను మరచిపోయి,రైతులు హాయిగా నిద్రించి ఉంటారు.

               పెదకదళీపురం బాట మొదలు రహదారికి ఉత్తరాన గంటన్నరకు పైగా – జట్లు జట్లుగా చేసిన శ్రమ ఫలించింది.

               ఈ 29.7.2026 – బుధవారం నాటి కార్యకర్తల రహదారి కృషి ప్రధానంగా 2 రకాలుగా జరిగింది.

- 1) నిన్న నాటిన పూల మొక్కలు మేకలు తినకముందే- దుండగులు నష్ట పరచక ముందే ప్రతి మొక్కకి ఇద్దరేసి వాలంటీర్లు నక్కులతో పాదుల్ని సరిచేయడమూ,మొక్కకొకటి చొప్పున గట్టి కర్రపాతి,మొక్కను దానికి జతచేసి,చుట్టూ ముళ్ళమండల్ని అమర్చడమూ,

- 2) వంగిపోతున్న లేదా వాడిపోతున్న  ప్రాత మొక్కల్ని నిటారుగా నిలబెట్టి,అది ఎలా పెరగాలో నిర్దేశించడమూ,

               ఐతే ఈ ప్రయత్నంలో ఏటవాలు చోట ఎవరి కాళ్ళు జారిపోయినదీ,ఎవరికి ముళ్ళు గ్రుచ్చుకొన్నదీ

నాకు సరిగా గుర్తులేదు.

               ముళ్ళ కొమ్మల్ని సైజులుగా నరుకుతూనో – వాటిని కావలసిన చోట్లకు చేరుస్తూనో – ఈ మొక్కలు ఎన్నాళ్ళకు ఎదిగి,పుష్పించి,ఈ రహదారి శోభను పెంచుతాయో,అప్పుడు ప్రయాణీకులెంత హాయిననుభావిస్తారో ఊహించుతూనో-

               ఇక D.R.K డాక్టరు గారైతే – అన్ని చోట్లకూ తిరుగాడుతూ పరులకోసం జరుగుతున్న ఈ శ్రమ సౌందర్యాన్ని పరిశీలిస్తూనో..... ప్రతి కార్యకర్తా నిమగ్నులై ఉన్నారు!

               పద్మావతి ఆస్పత్రి ఉద్యోగిని ల్యాబ్ లక్ష్మి మైకవసరం లేకుండానే ప్రతిజ్ఞలు చేసి,చేయించిన తుది సమావేశంలో:

               కనెక్టికట్ ప్రవాసి సురేష్ నాదెళ్ళ ప్రతిపాదనను-“ కార్యకర్తలందరూ ఇతర కార్యకర్తల మంచి లక్షణాలనూ,ప్రత్యేకతలనూ ఈ ప్రతిదిన సమావేశంలో వెల్లడించాలి’’ అనే సూచనను D.R.K గారు సూచించి,

               నాదెళ్ళ సురేష్ గారు తమ బావగారి సంస్మరణ కోసం రేపు మధ్యాహ్నం 12 గంటలకు వెంకటాపురం గ్రామానికి కార్యకర్తలను పిలువగా,

               రేపటి మనం లిఖించబోయే శ్రమచరిత్ర ఈ NH 216 లోని పెదకళ్ళేపల్లి బాట దగ్గరి బస్ షెల్టర్ వద్ద నుండే అని కూడ సెలవిచ్చారు.

               అవసరమీ శ్రమత్యాగము

ఏ ఒకరిని ప్రశ్నించిన “ఎందుకు ఈ శ్రమదానం?” అని,

ఈ వేకువ మీ కష్టం ఎంత కాలమూరికి? అని

వినిపించెను బదులు ఇట్లు: “నేనె కాదు - ఊరంతా,

ఆహ్లాదంగా బ్రతుకుట కవసరమీ శ్రమత్యాగము.”

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   29.07.2026