పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం
గురువారం (30-7-26) వేకువ శ్రమదానం ఇలా.... @3909*
4.30 కు కాదు - 4.20 కే సగం మంది, మరికొంచెంసేపట్లో మగిలిన కార్యకర్తలూ, మొత్తం 25 మంది చేరుకొన్నది వెంకటాపురం – కాసానగరం మధ్య NH216 మీది ఒక బస్ షెల్టర్ వద్దకు,
లక్ష్మీపురం శ్మశానం వద్ద దొరికిన ముళ్ళ తుమ్మ చెట్ల కొమ్మల్ని ట్రస్టు కార్మికులు తెచ్చి ఉంచిన గుట్టలు అప్పటికే అక్కడ ఉన్నవి,
పాతిక మంది కార్యకర్తలు ఈ వేకువ తలపెట్టిన పనుల్లో ఒకటి వాడి ముళ్ల మండల్ని పశువుల నుండి రక్షణగా 30 పూలమొక్కలకు రక్షణగా అమర్చడం! ఇక చెప్పేదేముంది –
కొందరు గునపాలనూ, కొందరు నక్కుల్నీ, త్రాడును ఒకళ్ళూ, అందుకొన్నారు. ఒక ఆల్ రౌండర్ కార్యకర్త మడ్డికత్తితో పెద్ద కొమ్మల్ని అనువైన సైజులో నరుకుతుంటే –
ఇద్దరు వాటిని ఏ మొక్కకెంత కంప అవసరమో అక్కడికి చేర్చుతుంటే - వేచిచూస్తున్న ఇద్దరేసి కార్యకర్తలు ఆయా మొక్కలకు వలయంగా మండలు పాతి, త్రాళ్లతో బిగించి, పూల మొక్కల భద్రతకు హామీ ఇస్తుండగా-
ముగ్గురు మాత్రం చీపుర్లందుకొని, ఎప్పటికప్పుడు దుమ్మునూ, ఆకుల్నీ ఊడుస్తుండగా –
ఒకానొక మహావీరుడు గోనె సంచి నిండుగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లను ఏరివేస్తుండగా –
ముగ్గురు మొక్కల పాదుల్ని శుభ్రపరచి, అవసరమైతే కొమ్మల్ని నరికి, రహదారి అందానికి మెరుగులు దిద్దుతుంటే.....
అసలా రహదారిపైన ఎంత సందడి ! అది కూడ పనికి మాలిన అర్ధంపర్ధం లేని సందడి కాక - ప్రజలకాహ్లాదం పంచే శ్రమ సందడి!
వాళ్ళ కబుర్లూ, చర్చోపచర్చలైతే - “ఇన్ని వేల మొక్కల భావికాల సంరక్షణమెట్లు? మనమెంత మొత్తుకుంటున్నా పెద్దలే వినక - భారీ ప్లెక్సీలు పెడితే ఏం చేయాలి? మిగిలిన రహదార్లనీ, ఊరినీ ఇంకా అందంగా ఎలా మార్చాలి?” వంటివి తప్ప - బొత్తిగా చెత్త కబుర్లు కావు!
తలా 100 నిముషాల విలువైన కాలం ఎప్పుడు ముగిసిందో తెలియనంతగా పని పట్ల తాదాత్మ్యత!
మోతుకూరి సీతారాముని తడబాటు నినాదాలతో మొదలైన తుది సభలో :
1. బాధ్యత లేని కొందరు గ్రామస్తుల గురించి ఆవేదన!
2. 12:00 కు వెంకటాపురంలో సంస్మరణకు వెళ్ళాలనే విజ్ఞాపన!
3. రేపటి వేకువ కూడ ఈ NH 216 రహదారి బస్ షెల్టర్ వద్దనే కలవాలనే ఆలోచన!
రొటీన్ లైఫ్ కు భిన్నంగా
ఒంటరితనముకు చిక్కిన ఓ నా గ్రామస్తులార!
విసుగుదలలు, క్రుంగుబాట్లు వేధించే మిత్రులార!
రొటీన్ లైఫ్ కు భిన్నంగా “క్రొత్త” కోరు పెద్దలార!
పరిష్కార మిదుగొ - గ్రామ శ్రమదానమునకు రండిక!
- నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
30.07.2026