3910* వ రోజు....

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం

216 వ రహదారి మీదనే 3910* వ శ్రమదానం!

               అది శుక్రవారం - జులై మాసాంతంలో వేకువ 4.23 - 6.12 దాక చెప్పుకోదగినంత సన్న తుంపరలో జరిగిన సమయదానం కూడ! ఈ రోజుల్లో ధనత్యాగం కన్న శ్రమ త్యాగమూ, దాని కన్న సమయదానమూ గొప్పవనిపిస్తున్నది! అది గనుక సామూహిక మైతేనూ, గ్రామస్తులందరి కోసమైతేనూ ఇక దాని విలువను కొలువనేలేము!

               శివరామపురం బాటకు పడమరగా బస్ షెల్టరు వద్ద ఆగిన కార్యకర్తలు ఏ ప్రాత మొక్కలకు మంచి పాదులవసరమో - ఏ చెట్లు మర్యాదగా - నిటారుగా పెరగక ప్రక్క చూపులు చూస్తున్నవో - 3 రోజుల క్రితం నాటిన మొక్కలకు ముళ్ళకంప అవసరమో - గమనించుకొని, తదవసరానుగుణంగా చర్యలు చేపడుతూ -

               BSNL & అంజయ్యలైతే కాసానగర జంక్షన్ దగ్గరకు కూడ వెళ్ళిపోయారు!

               ముళ్లమండలు సైజులుగా నరికే బృందావనుడు నరుకుతూనే ఉన్నాడు, వాటిని కస్తూరి శ్రీనూ, ఇనపకుతిక రాజూ ½ కిలోమీటరు బారునా చేరుస్తూనే ఉన్నారు, పాటల శ్రీనివాసుడూ, విజయుడూ, ప్రేమానందుడూ ఒక్కొక్క పూలమొక్కను లాలిస్తూ -సేవిస్తూ ముందుకు వెళ్తూనే ఉన్నారు,

               మునీశ్వరుడొకరు మంచినీళ్లతో సహా - ఎవరికేది అవసరమో పట్టించుకొంటున్నాడు.

               ఆకుల వారు రహదారి సుందరీకరణలో మునిగి తేలుతున్నారు. రోడ్డు వెంట తిరుగుతూ శేఖరుల వారు ప్లాస్టిక్ లను సేకరిస్తూ ఉన్నారు,

               అసలీ వింత పనుల పిచ్చి వాళ్ళ ప్రతి చర్యనూ చూసి చూసి – “అరె! ఈ రోజు నిండా పాతిక మందైనా లేని పిచ్చిమారాజులే ఇన్నిన్ని పనులు పూర్తిచేస్తుంటే - వందకు పైగా వెర్రోళ్ళు గనుక వచ్చి పనికి దిగితే ఈ రహదారి అందచందాలు ఇంకెంతగా ప్రజాహ్లాదం సాధిస్తాయో!” అనే ధర్మసందేహం వెలిబుచ్చగా-

               ఇద్దరు ప్రాత పిచ్చోళ్లైన కోడూరుకూ, రామా యాక్స్ టైలర్ కూ మరో 10 మంది నాణ్యమైన క్రొత్త పిచ్చిమారాజుల్ని చూడమని ఇందుమూలముగా నేను విజ్ఞప్తి చేయుచున్నాను!

1) నిన్న వెంకటాపురంలో పర్యావరణ మైత్రి పూర్వకంగా జరిగిన రావి వెంకటేశ్వరరావు గారి పెద్ద కర్మ భోజనాలూ,

2) రేపు మరింత మంది కార్యకర్తలు కలిసొస్తే నాటబోయే మొక్కలూ,

3) గంధం బృందావనుడి నినాదాలూ,

4) ఒక అజ్ఞాత NRI 50+50 వేల విరాళము,

5) రేపు శనివారం రహదారి బాగు చేతలు కూడ ఇదే బస్ స్టాప్ నుండే అనే నిర్ణయమూ.....

               నేటి తుది సమావేశ విశిష్టతలు!

               క్రీడను మాత్రం

ఎన్నైనా పెంచగలరు ఎంపిక చేసిన చెట్లను

రహదారులపై విరివిగ పూవులు పూయించగలరు

వృక్షాలను తగుల బెట్టు రాక్షస క్రీడను మాత్రం

స్వచ్ఛ కార్యకర్తలెవరు భరించరు, సహించరు!

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   31.07.2026