3917* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం?

3917* వ రహదారి శ్రమ చరిత్ర!

               3917 - అనే పని దినం సంఖ్య స్వచ్ఛ కార్యకర్తల గత శ్రమ వైభవాన్నీ, * గుర్తు ఆ చరిత్ర చల్లపల్లి పరిశుభ్ర – హరిత - పర్యావరణహితాన్ని సాధించే దాకా ఆగబోదనే సంగతినీ బోధపరుస్తున్నవి!

               ఈ ఆషాఢ శుక్రవారపు (7-8-26) 28+4 మంది NH 216 మీది శారదా గ్రాండ్యూర్ ప్రాంతపు శ్రమదానమునే కాదు – ఏనాటి వేకువ కార్యకర్తల ప్రయత్నాన్ని చూసినా ఆ సంగతి తెలుస్తూనే ఉంటుంది!

               ఇప్పటికే గత దశాబ్దికాలంగా ఈ కార్యకర్తలు ఊళ్ళోనూ; ఊరి బయటా 32 వేలకు పైగా పూల – పండ్ల  - నీడ మొక్కలు, నాటారు గదా - అందులో కొన్ని భూసార లోపంతోనో, గొడ్లకాహరంగానో, దొంగల - దుండగుల అపహరణకో - కాల్చివేతకో బలైతే ప్రతి వర్ష ఋతువు నందూ వాటిని భర్తీ చేస్తున్నారు గదా!

               ఈ వేకువ 4.20 - 6.06 మధ్య 53 సువర్ణ గన్నేరులూ, నేరేడు – 1, పున్నాగ – 1 మొక్కలూ నాటనే నాటారు గదా!

               ఒక మొవ్వనే కాదు - వక్కలగడ్డనే కాదు - వివిధ పాఠశాలల విద్యార్ధుల్నే కాదు - ఈ ప్రాంతపు అన్ని సమస్యల్నీ నెత్తికెత్తుకోవాలనుకొనే అత్యాశాపరుడూ, 2 నెలల నుండి తన అమెరికా నివాసానికి దూరంగా ఇక్కడే బ్రతికే మండవ శేషగిరిరావు సాక్షిగా రహదారి ఊడ్పులూ, ప్లాస్టిక్ ల తొలగింపులూ జరిగినవి కదా!

               సాఫీగా పెరగని ప్రాత మొక్కల్ని నిటారుగా - దర్జాగా నిలబెట్టారు గదా! కార్యకర్తల ముఖాల్నీ, మాటల్నీ చూసినా తెలుస్తుంది - చల్లపల్లి సర్వతోముఖ ఆహ్లాదాన్ని సాధించనిదే ఈ శ్రమదానం ఆగదని!

               6.20 సమయంలో :

               సుదీర్ఘ కాలం అమెరికాలో ఉంటున్నా మండవ వారు ఎంత స్పష్టంగా కార్యకర్తల తరపున నినాదాలు చేస్తున్నారో గుర్తుంచుకోండి!

               పంచాయతి ఉన్నతోద్యోగి మాధవేంద్రరావు గారు చెప్పిన శుభవార్త - సెప్టెంబరు 1 దాక సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ల వాడకాన్ని నిర్మూలించే ప్రయత్నాలన్నీ చేశాక - అవసరమైతే ఫైన్లు విధించనున్నారు అని!

               రేపు వేకువ కూడ కార్యకర్తలు శారదా గ్రాండ్యూర్ వద్దనే - కలుసుకోవాలని డి.ఆర్.కె. డాక్టరు ఉవాచ!

               మిన్నకుండి పోవుటే

వేకువనే నిద్రలేచి, వీధి చెత్త, దుమ్ములూడ్చి
రోజూ నలభై మంది రోతలు తొలగిస్తుంటే -

హరిత శుభ్ర సౌందర్యాలందల మెక్కిస్తుంటే
పొగడకుండ మిన్నకుండి పోవుటే సమంజసమా?

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   07.08.2026