సుందర ‘పాగోలు రహదారి’ కోసం...
చల్లపల్లి నుండి చుట్టు ప్రక్కల గ్రామాలకు వెళ్ళు 9 రోడ్లను గత 12 సంవత్సరాల నుండి స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు శుభ్రం చేసి పూల మొక్కలు, నీడనిచ్చే మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు.
చల్లపల్లికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న పాగోలు గ్రామ రహదారి కూడా ఇందులో ఒకటి.
కరెంటు డిపార్ట్మెంటు వారు పాగోలు రోడ్డులో మొక్కలను కొట్టి కొమ్మలను అక్కడే వదిలివేశారని తెలిసింది. వెళ్లి చూస్తే నరకబడిన కొమ్మలు వేలాడుతూ సగం ఎండిపోయి, ఎవరూ పట్టించుకోక చూడడానికి ఇబ్బందిగా అనిపించింది.
2016 లో స్వచ్ఛ కార్యకర్తలు నాటి సంరక్షించిన మొక్కలు అవి. నీడనిచ్చే మొక్కలు, పూల మొక్కలతో అందంగా ఉంది ఆ రహదారి.
ఆ నరకబడిన కొమ్మలన్నింటినీ షెడ్డర్ లో వేసి వచ్చిన చిన్న చిన్న ముక్కలను పెద్ద మొక్కల పాదులకు మల్చింగ్ గానూ, పొడిని పొలాలలో ఎరువుగానూ వేశాము.
స్వచ్ఛ కార్యకర్తలు ఆ దారిలోని మొక్కలన్నింటికీ కలుపు తీసి పాదులు చేసి అందంగా మార్చారు.
రోడ్డు మార్జిన్ నుండి సరైన బరంతు లేక ద్విచక్ర వాహనదారులు జారి పడిపోయే అవకాశం మెండుగా ఉంది. అందుకే గ్రావెల్ తెప్పించి రోడ్డు ప్రక్కల వేసి చక్కటి బరంతు ఏర్పరిచాము.
తారు రోడ్డు చాలా చోట్ల గుంటలు పడి ఉంది. మహాబోధి స్కూలు దాటిన తర్వాత మలుపు వద్ద చిన్న తూము మాత్రమే ఉంది. అక్కడ కూడా ప్రమాదాలు జరిగే అవకాశం మెండుగా ఉంది. ఉన్న తూముకు మరో 8 అడుగుల పొడవు తూము వేసి కల్వర్టు కడితే శాశ్వతంగా ఉపయోగపడుతుంది. ప్రమాదాలకు అవకాశం ఉండదు.
ఇదే విషయం MLA బుద్ధ ప్రసాదు గారికి తెలియపరిస్తే వారు పంచాయితీ రాజ్ ఇంజనీర్లను ఆ చోటుకి తీసుకువచ్చి చర్చించారు. తారు రోడ్డు గోతులు పూడ్చడానికి గానీ, కల్వర్టు కట్టడానికి గానీ ప్రభుత్వనిధులు లేవని ఇంజనీర్లు తెలిపారు.
మాకు అనుమతి ఇస్తే ‘మనకోసం మనం’ ట్రస్టు తరపున ఈ నిర్మాణము, ప్యాచ్ వర్క్ చేయగలమని చెప్పాము. వారి అనుమతితో కాంట్రాక్టరు కృష్ణారావు గారి ఎనలేని సహకారంతో రోడ్డు గుంటలన్నీ తారుతో పూడ్చి, మలుపు వద్ద 3 అడుగుల వెడల్పైన 8 అడుగుల తూము వేసి కల్వర్టు నిర్మించి పేవర్ టైల్స్ తో ఆ ప్రాంతాన్ని అందంగా తయారుచేశాము.
రోడ్డు ప్యాచ్ వర్క్ రిపేరు చేసి, బరంతు వేసి, కల్వర్టు నిర్మించి, పేవర్ టైల్స్ పరచడానికి 4 లక్షల రూపాయలపైనే ఖర్చయింది. కలుపు తీయడానికి వెంకటాపురం శ్రామికులకు అయిన ఖర్చు దీనికి అదనం.
ఇందులో రెండు లక్షల రూపాయలను USA లో స్థిరపడిన మేకావారిపాలెం వాస్తవ్యులు డా. మేకా శేషగిరిరావు, వారి శ్రీమతి లక్ష్మీ భవాని గారలు విరాళంగా పంపించారు. వారికి ధన్యవాదములు. మిగిలిన మొత్తం ‘మనకోసం మనం’ ట్రస్టు తరపున డా. పద్మావతి గారు భరించారు.
2016 లో రహదారికి ఇరువైపులా నాటి సంరక్షించిన మొక్కలతో, క్రొత్తగా వచ్చిన కల్వర్టుతో పాగోలు రోడ్డు ఇప్పుడు మరింత సుందరంగా ఉంది.
స్వచ్ఛ కార్యకర్తల శ్రమదానం, దాతల - గ్రామ పెద్దల - పంచాయితీ కార్యదర్శి సహకారమూ, MLA గారి చొరవ, ఇంజనీర్ల తోడ్పాటూ అభినందనీయములు.
స్వచ్ఛందంగా ప్రజలు కొంత
శ్రమదానం,
సమయదానం,
అర్ధదానం
చేస్తే సంఘానికి ఎంతో
ఉపయోగంగా ఉంటుందనడానికి
ప్రత్యక్ష నిదర్శనమే ఈ సుందర రహదారి.
- నల్లూరి రామారావు,
డా. డి.ఆర్.కె.ప్రసాదు,
08.08.2026