3928* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం!

18 వ ఆగస్టు - (2026) వేకువ శ్రమ తరంగాలు - @3928*

               మంగళవారము వేకువ 4.20 నుండి 6.09 దాక – గ్రామానికి దక్షిణ దిశలోని - గంగులవారిపాలెం సమీప రహదారిలోని ఆ తరంగాలు – అతిశయోక్తులుగా అడపా వారు చెప్పినట్లు – “ఆకాశం వంగినా నేల పగిలిపోయినా, పర్వతాలు పేలిపోయినా...” అన్నట్లుగా కాకున్నా - NH 216 లో ½ కిలోమీటరు పర్యంతమూ, కదలాడుతునే ఉన్నవి.

               బండ్రేవుకోడు మురుగు కాల్వ దగ్గర కూడ ఆరేడెనిమిది మంది తాలూకు శ్రమ పరంపరలు మరరంపం సాక్షిగా కనిపించాయి!

               ఐతే - ఎవరి కోరిక మేరకు ఆ వృక్ష ఖండనాలు జరుగుతుండెనో - వారెవరూ కార్యకర్తలతో కలిసి రాలేదు! సరే ఇదెప్పుడైనా గ్రామపరంగా జరుగుతున్న లోపమే అనుకోండి. ఈ బృందం నేటి పని –

ఒక 7 ఆకుల చాలా ఎత్తైన మహా వృక్షాన్ని కాలువలోనో – వంతెన మీదనో రోడ్డు పైనో పడకుండ నేర్పుగా పడగొట్టి, ముక్కలుగా విభజించి, చివరలో ట్రాక్టరులోనికి ఎక్కించడమే!

జాతీయ రహదారి శ్రమ సంగతికొస్తే –

1) పొలం గట్టు వద్ద గతంలో పెట్టిన చెట్లకు శంకర - వెంకటేశ్వరులు కళాత్మకంగా పాదులు చేయడమూ,

2) ఎన్ని మార్లు ఊడ్చినా తృప్తి చెందక - ఇది వాళ్ళ ఇల్లు కాదనీ – కేవలం ఊరికి దూరంగా ఒక రహదారనీ గుర్తుండక - అన్నపూర్ణ, లక్ష్మణ, మరో ట్రస్టు ఉద్యోగీ ఇప్పటికి 4 వ మారనుకొంటా – శుభ్రపరచడమూ,

3) ప్రసాదులూ, దేసులూ, శ్రీనులూ, మల్లంపాటిలూ మొక్కల కుదుళ్లకు వలయంగా కంపలు కట్టడమూ, కొమ్మల ట్రిమ్మింగూ,

4) అవసరాన్ని బట్టి ఆకుల భరతుడు పరుగో - నడకో తెలియనంత చురుకుగా కదలాడుతుండడమూ.. నేను చూసిన కొన్ని దృశ్యాలు!

               తుది సమావేశంలో నినాద ప్రకటనదారుడు దుర్గా ప్రసాదుడు, నేటి శ్రమ విశిష్టత ప్రస్తావకుడు DRK గారైతే,

               నిన్న విజయవాడ దగ్గరి శివరామకృష్ణయ్య గారి సంస్మరణ లాంఛనాల వద్ద సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత భోజనాల ఏర్పాట్లను మెచ్చినది నేటి 30 మంది కార్యకర్తలూ!

               రేపటి రహదారి మెరుగుదల ప్రయత్నం మళ్లీ గంగులవారిపాలెం వీధి కూడలి ప్రాంతంలో అనే నిర్ణయం అందరిదే!

               అతడె బసవ శంకరుడు
క్రమశిక్షణ పాటించుచు కార్యకర్తలిందరు
సమయంతో బాటూరికి శ్రమదానం చేస్తురు

అవి చాలక కష్టార్జిత మర్పింతురు గ్రామానికి

ఆ లిస్టులొ క్రొత్త పేరు అతడె బసవ శంకరుడు!

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

  18.08.2026

               అక్షర సైనికుడు!

సిరివెన్నెల శాస్త్రి కనుక రాస్తే :

               “కంటికానిన ప్రతిదానికీ  కావ్యగౌరవం కల్పిస్తూ

               కార్యకర్తల చెమట చుక్కలను చీకట్లోనూ లెక్కిస్తూ...

               అర్ధవంతంగా ఆవిష్కరిస్తున్న ఒక అక్షర సైనికుడిడుగో!”  

శేషేంద్రను కదిలిస్తే:

               “ఒక ఆదర్శ శ్రమను కాలం యవనికపై

               అక్షర శిల్పంగా మలుస్తున్న దార్శనికుడు

               కార్యకర్తల శ్రమకు తగిన గౌరవం కల్పించే వ్రాయసగాడు”

శ్రీశ్రీ చైతన్య స్రవంతిగా చెప్పాలంటే :

               “స్వచ్ఛ వీరులు మట్టిలో వేకువ సమయాన వ్రాసే సేవల ముడిసరుకును

               అందమైన కావ్యంగా మార్చగల శ్రమ సౌందర్య సాక్షి

               ఈ రామారావు మాస్టారు!”

- సురేశ్ నాదెళ్ల (USA)

    ఒక సుదూర దేశ కార్యకర్త

   18.08.2026