3933* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు!

3933* వ శ్రమదాన రీతులు (23-8-26)

               ఈ 23-8-26 (ఆదివారం) శ్రమదానం 30+ ముగ్గురిది;  గంగులవారిపాలెం వీధి మలుపు వద్దనే జరిగినది; చాల వరకు వర్షంలోనే తడుస్తూ – ఆనందిస్తూ చేసిన గ్రామ సామాజిక సేవలు.

               “వర్షంలో ఏమిటీ – తడుస్తూ ఆనందించడం ఏమిటీ – అది కూడా ఈ చిన్న పిల్లలూ, మహిళామణులూ, వృద్ధ మూర్తులూ, వైద్య ప్రముఖులూ ఈ మురికి – బురద – చెత్త పనులేమిటి” అని ఎవరికైనా ధర్మ సందేహం రావచ్చు.

               ఈ సుదీర్ఘకాల – కఠినతర ఉచిత సేవలను మొదటి నుండి తెలుసుకుంటున్నవారికి మాత్రం అలాంటి సందేహం కలగదు. (ఎందుకంటే ఇంతకన్నా జోరు వానల్లో, గజగజ వణికే చలిలో, మంచులో ఈ సేవలను గమనిస్తున్న వారికి ఇంకా సందేహమేముంటుంది?)

               కార్యకర్తల ఆనందానికి ఇంకొక కారణం ఎండుతున్న వరి పొలాలకు, రైతులకు ఈ వాన జీవామృతం కనుక. మరి ఈ  వేకువ 4:21 నుండి 6:15 దాక ఇంతమంది ఆనందంతో చేసిన పనులేమిటో ఒకసారి చూస్తే

- చిన్న రోడ్డును క్రమ్ముకొస్తున్న అందమైన గద్దగోరు పూల చెట్ల ముళ్ళ కొమ్మలను ఐదారుగురు అదుపులో పెట్టడడమూ

- ఎంత చెప్పినా పంచాయితీ వారు బోర్డు పెట్టినా లెక్కచేయకుండా కొందరు వేస్తున్న చెత్తను ఊడ్చి ట్రాక్టర్ లోకి ఎత్తే పని కొందరు,

- ముళ్ళ పూల కొమ్మలను లోడింగ్ చేయడం మాత్రం తక్కువ పనా?

- మిగిలిన వాళ్ళలో కొందరు మొక్కలకు పాదులు చేయడమూ, గడ్డిని చెక్కడమూ వంటి మరికొన్ని పనులు.

               ఇక చివరలో సభా కార్యక్రమం ఉంటుంది కదా - అందులో ఉరిమి సాయి గారు ఉత్సాహభరితంగా మూడు రకాల నినాదాలను ప్రకటిస్తే అది చాలక దాసరి వంశస్తులైన ఇద్దరు చిరంజీవులు - ఆరవ్, ఆర్య లు మరింత ఉత్సాహంగా నినాదాలు ప్రకటించారు.

               మరి ఈ శ్రమదాన సందడిలో భౌతికంగా దూరంగా ఉన్నా తగ్గను అన్నట్లుగా ప్రాతూరి శాస్త్రి గారు తన అలవాటు పోనిచ్చుకోక అందరికీ బిస్కట్లు BSNL ద్వారా పంచారు (ఎవరి ఆనందం వారిది!)

               రేపటి శ్రమదాన సందడి కూడా ఇదే గంగులవారిపాలెం రోడ్డులో జరుగునని ఇందుమూలంగా ప్రకటించడమైనది!  

               అలుపెరుగని మా ఇందిర!

ఆసుపత్రి డ్యూటిలో ఆమె నిత్య విజయేందిర

సొంత ఇంటి నిర్వహణను చూసుకొనే ఇందిర

గ్రామ స్వచ్ఛ శుభ్రతలకు గ్యారెంటీ ఈ ఇందిర

అభ్యుదయ గ్రామ సాధనలో అలుపెరుగని మా ఇందిర!

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   23.08.2026