నిన్నటి వర్షంలో స్వచ్ఛ సేవా సంగతులు.......

 నిన్నటి వర్షంలో స్వచ్ఛ సేవా సంగతులు...

               ఉదయం 3 గంటలకు పెద్దగా వర్షం మొదలైంది. రైతులకు ఈ వర్షం ఎంతో ఉపయోగపడుతుందని సంతోషం వేసింది. అయితే 4:30 నుండీ ప్రతిరోజూ చేసే మన స్వచ్ఛ కార్యక్రమం చేయడం సాధ్యం కాకపోవచ్చేమో అనే దిగులూ వచ్చింది. కానీ 4 గంటలకు వర్షం ఆగిపోయింది. ఎప్పటిలాగే 4:20 కి మొదటి ఫొటో తీసుకుని స్వచ్ఛ సేవను మొదలుపెట్టాము.

               కాస్సేపట్లో మళ్ళీ చిన్నగా వర్షం మొదలయింది. అయినా ఎవరూ పని ఆపలేదు. వర్షంలో తడుస్తున్నా తల దీపాలు పెట్టుకుని పనిచేస్తూనే ఉన్నారు. వర్షం తగ్గాక మళ్ళీ పని చేయచ్చు అని ఎవ్వరూ పని ఆపలేదు.

               మరికాసేపటికి ల్యాబ్ రవి వర్షంలోనే నడుచుకుంటూ వచ్చాడు. “ఎందుకు రవీ వర్షంలో తడుచుకుంటూ వచ్చావు?” అని అడిగితే “ఇంత వర్షంలో కూడా 4:20 నుండీ మన వాళ్ళంతా పని చేస్తుంటే ఉండబుద్ధి కాలేదండి” అని పనిలోకి దిగేశాడు.

               పెద్దాయన “ఉరిమి సాయి” గారు వస్తానంటే ‘వర్షం వస్తోంది ఈరోజు వద్దులే’ అని కబురు చేశాను. ‘కానీ మీరంతా పనిచేస్తూ ఉంటే నాకు చూడాలని ఉంది’ అని చెప్పి వచ్చి స్వచ్ఛ కార్యక్రమాన్ని వీక్షించారు.

               6:10 వరకూ ఈ స్వచ్ఛ కార్యక్రమం చేసి కాఫీలు త్రాగుతూ జోకులు వేసుకుంటూ కబుర్లు చెప్పుకుని గ్రూప్ ఫొటో దిగి రేపటి కార్యక్రమం గురించి చెప్పుకుని సెలవు తీసుకున్నాం.

               వరుణుడి పని వరుణుడు చేశాడు. స్వచ్ఛ కార్యక్రమాన్ని స్వచ్ఛ కార్యకర్తలు పూర్తి చేశారు.

               సాయి గారు చల్లపల్లిలోని ఒక ప్రాంతంలో మొక్కలు పెట్టి వాటిని

కాపాడడానికి ఒక మనిషిని పెడితే అతని జీతం కూడా తానే  ఇస్తానని గతంలోనే ప్రతిపాదించారు.

               అందుకే వారిని హిందూ శ్మశానవాటిక వద్దకు తీసుకెళ్లి ఆ శ్మశానం అభివృద్ధి చరిత్ర అంతా వారికి వివరించాను.

               దాతల సహకారంతో తయారైన ప్రహరీ గోడలు, ముఖద్వారము, రోడ్డు, మెరక - తయారవుతూ ఉన్న దహన వాటిక, స్నానవాటిక చూపించి ఆ శ్మశానంలో మొక్కలు పెట్టాలి, కనీసం ముగ్గురు మనుషులు ఈ ప్రాంతాన్ని నిర్వహించడానికి కావాలి అని చెప్పాను.

               శ్మశానంలో పెట్టే మొక్కలకు, ఒక మనిషి నెలవారీ జీతాన్ని తానే భరిస్తానని సాయి గారు చెప్పారు.

               ఇలా తలా ఒక చేయి వేయగలిగితే మన చల్లపల్లి ‘సుందర చల్లపల్లి’ ఎందుకు కాదు!

               గంగులవారిపాలెం రోడ్డు నుండి బందరు రోడ్డుకు వెళుతూ ఉన్నప్పుడు “స్వర్గం నుండి బయటకు వెళ్తున్నట్లుంది బాబూ” అని బృందావన్ తో అన్నారట సాయి గారు!   

మన ఊరంతా ఇలానే ఉండాలని కదా

మన కార్యకర్తల కోరిక,
తాపత్రయము,
శ్రమదానము.

త్వరలో ఆ కోరిక సిద్ధించు గాక!

- డా. డి.ఆర్.కె. ప్రసాదు

   24.08.2026