పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు!
శ్రావణ మంగళవారపు (25.08.2026) శ్రామికులు 30 మంది - @3925*
అసలీ కార్యకర్తలెలాంటి వాళ్లంటే -
1. రోజు ప్రొద్దున్నే ఊరిలో ఏదో ఒక వీధిని శుభ్రపరచనిదే, డ్రైన్ పని తీరును మెరుగు పరచనిదిచే, తామే నాటి, సాకిన చెట్లను ప్రేమగా పరామర్శించనిదే, సింగిల్ యూజబుల్ వస్తువుల్ని వేటాడనిదే - ఆ రోజుకు నిద్రపట్టని వాళ్లు!
2. ఈ వేకువ మరీ “భారీ వర్షం వచ్చి, శ్రమదానం సాగదేమో ఎలా” అని బెంగపడే చిత్రమైన వాళ్లు!
3. ఈ వేకువ బాగుచేయాలని నిన్న నిర్ణయించుకొన్న గంగులవారిపాలెం వీధిలోని సన్ ఫ్లవర్ కాలనీ వీధి జంక్షన్ కు వేకువ 4.30 కి కాక - 4.20 కే వెళ్లి, తక్కిన వాళ్ళు రాకుండానే పనికి ఆత్రపడేవాళ్ళు!
4. ఈ పూటకు నిర్ణయించిన 2 వీధుల కూడలితో ఆగక – అదనంగా 2 ప్రక్కలా 50-60 గజాల దాక మురుగు కాల్వ వికారపు వాసనల మధ్య జంగిల్ క్లియరెన్సులకు పాల్పడే పనిమంతులు!
5. ఉదయం 6.00 దాటినా మేల్కొనని సోదర గ్రామస్తుల సౌకర్యాల కోసం ఎన్నేళ్ళయినా మురికి - దుమ్ము - పనులకు (ఉదాహరణకు - ఆస్పత్రి లేబొరేటరీ ఉద్యోగి - నల్లూరి శ్రీను!) దిగి - అదేదో మహత్కార్యం చేసినట్లు ఏపూటకాపూట అల్పసంతోషులు!
ఈ అత్యల్ప సంతోషులే కదా - ఈ ఊరి 3 శ్మశానాలనూ, ఊరి ముఖ్య వీధులనూ, గ్రామం చుట్టూ ఏడెనిమిది రహదారులనూ హరిత వనాలుగా మారుస్తున్నది? వీళ్ళ ఈ వ్యసనం ఇంకో 12 ఏళ్లు చెక్కు చెదరకుండా ఉంటే చాలు - చల్లపల్లి రాష్ట్రంలోని 13 వేల గ్రామాలకు ఆదర్శమైపోతుంది!
12 ఏళ్ల నాటికీ ఇప్పటికీ గ్రామంలో ఏం మార్పులు జరిగాయో – ఎలా జరిగాయో - ప్రధానంగా యువకులు గ్రహించవలసిన అవసరం ఉన్నది! యువ కార్యకర్తలు పెరిగితేనే గ్రామ శుభ్ర – సుందరీకరణలకు భవిష్యత్తు!
నేటి తుది సమావేశం వివరాలు కొన్ని:
* ఉరిమి శాయి గారు ఒక ట్రస్టు ఉద్యోగినీ, T.పద్మావతి గారు నలుగురినీ దత్త ఉద్యోగులుగా స్వీకరించుట,
* విజయవాడకు చెందిన USA ప్రవాసి ఒకరు నెలనెలా ½ ఉద్యోగిని సెప్టెంబరు నుండి సొంతం చేసుకోవడం,
* చల్లపల్లి నుండి మరొక దాత ¼ ఉద్యోగి జీతానికి పూచీ పడడం,
* 15000 కిలోమీటర్ల కనెక్టికట్ నుండి నాదెళ్ళ సురేష్ “సంపూర్ణ స్వచ్ఛ సుందర చల్లపల్లి” సాధక నినాదాలు వినిపించడం,
* రేపు కూడా ఈ గంగులవారిపాలెం రోడ్డులోని శుభ్రత కోసం సన్ ఫ్లవర్ స్ప్లెండర్ సిటీ వద్ద కలవాలని నిర్ణయించడం!
ప-ద-ని-స లే వినిపించును!
ఆమెకు పదహారంటే అందరు నమ్మేస్తుందురు
ఆమె జవం, ఆమె స్వరం ఆ పేరుకు నప్పవు
అది రిసెప్షనే కానీ – స్వచ్ఛ శ్రమదానమైన
ప్రశాంతి ప్రతి పనిలోనూ ప-ద-ని-స లే వినిపించును!
- నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
25.08.2026