3936* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు!

3936* వ సామూహిక శ్రమ సమర్పణం!

               ఇది శనివారమూ కాదు, ఆదివారమూ కాదు, శ్రమదానోద్యమంలో ఏదైనా ప్రత్యేక పండగ రోజూ కాదు - స్థానిక గంగులవారిపాలెం వీధిలోని భవఘ్ని నగర - శాయినగరుల నుండి అదనంగా వీధి కోసం శ్రమించాలని బహుశా -

               వర్షం వల్ల కావచ్చు - ఎవరూ రానూ లేదు! ఐనా ఈ బుధవారం (26-08-2026) 4:00 AM కు ముందు చెప్పుకోదగ్గ వాన పడి, బురదగా ఉన్నా సరే - నిర్ణీత 4.30 కు కాక 4.20 కే - వానకు తడుస్తామని కూడ అనుమానించక ఏడెనిమేదేళ్ల వేల్పూరి మోశికాతో సహా 16 గురు ఎంతగా వీధి సేవలకు వేచి ఉన్నారో చూశారా?

               ఇక  - ఈ 12-13 ఏళ్ల గ్రామ శ్రమదానం గురించి కొందరు ఊహా శక్తిగల తెలివైన వాళ్లు - ఇలా వానను లెక్కచేయక - 16 + ఆ తరువాత 26 గురు - అందులో సీనియర్ వైద్యులు, వృద్ధకాయులు, విరమిత పదవుల వారు, రైతులు, మహిళలు, వ్యాపారులు, చిరూ - ఉన్నత ఉద్యోగులు ఇంతగా ఆవేశపడుతూ, మళ్ళీ వాన పడకముందే - 6.05 కు విజిలు మ్రోగక ముందే ఈ పూటైనా శుభ్రసుందరీకరణ పూర్తిచేయాలని ఆత్రపడుతున్నారంటే -

               కొందరి చేతులకు బోగన్ విలియా ముళ్ళు గ్రుచ్చుకొన్నా, రోడ్డు మార్జిన్ల బురదలో కాళ్ళు జారినా, ఒక ప్రక్క సుందరీకరణ కోసం కోసిన కొమ్మలతో, బాట ప్రక్క గడ్డీ, పిచ్చి మొక్కల తొలగింపుతో ఆరేడుగురు లోడింగుకు పూనుకొని - ట్రాక్టరు నిండుతున్నా - అణిచి పెట్టి త్రొక్కుతూ ముగ్గురో – నలుగురో పరుగులు కూడ పెట్టుతూ శ్రమించడం చూసి అపవాదులు బాగా రుచించేవారు -

               “వీళ్లకు ఎక్కడెక్కడి నుంచో రోజూ లక్షల్లక్షలు వచ్చి పడుతున్నాయంటరా, “ఆ ఇద్దరు డాక్టర్లూ, మరొకరూ ఇలా పేరు సంపాదించుకొని, ఎమ్.ఎల్.ఏ లై పోవాలనే ప్లానంటరా”.... అని చెప్పుకొంటే వింతేమున్నది?

               “ధనమూలమిదమ్ జగత్” అనే మూల సూత్రంతో నడిచే - నమ్మే “సామాన్యులు” ఇలాగే ఊహిస్తారు మరి!

               “కాదు కాదు - శ్రమమూలమిదమ్ గ్రామమ్” అని నిరూపించే స్వచ్ఛ కార్యకర్తలు సాధారణులు కాదు – “అసామాన్యులు!” అలాంటి పిచ్చి వదంతుల్ని పట్టి౦చుకొనక – పన్నెండేళ్ల, పదమూడేళ్ళ సుదీర్ఘ శ్రమ ప్రస్థానం సాగిస్తూనే ఉంటారు!

               ఈ నాటి స్వచ్ఛ సుందరోద్యమ నినాద ప్రవర్తకుడైన కస్తూరి వరప్రసాదు సేవలను గురించిన జ్ఞాపకాలను ఉభయ వైద్యులూ ప్రస్తావించి,

               బురదలో జరిగిన నేటి వీధి బాధ్యతల గురించి గుర్తు చేసుకొని,

               కనీసం రేపైనా భవఘ్ని నగర స్వచ్ఛ - శుభ్రతలు ముగించాలనీ – అందుకు గాను కార్యకర్తలు రేపటి వేకువ గంగులవారిపాలెం వీధిలోనే కలుసుకోవాలనీ నిర్ణయించారు!

              అయితే, ట్రస్టు కార్మిక సోదరులు 7 గంటల తరువాత నిర్మలా డైరీ ఫారం వరకు వీధిని అన్ని విధాల శుభ్రపరిచారు.

            డాక్టరు బందా జవహరు

డాక్టరు బందా జవహరు దానధర్మముల గురించి,

 చీమ కుర్తి ప్రాంతములో చెప్పుకొనే కథల గూర్చి,

ఇదే కాదు- చల్లపల్లి నెలనెల చందా గురించి

వింటున్నాం నోరు తెరచి ఎంతోకాలము నుంచీ!

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   26.08.2026