పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు!
3937* వ విడత శ్రమ సందడి – (గురువారం – 27.08.2026)
అది గూడా గంగులవారిపాలెం రోడ్డులోని భవఘ్నినగరులోనే పాక్షికంగా వానలో తడుస్తూనే! శ్రమకారులు 25 కు మించలేదు. ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి పిలవడం భావ్యం కాదనుకొని కార్యకర్తలు ఎవరినైనా పిలిచే పని చేయలేదు!
ఇక వేకువ 4.23-6.05 నడుమ శుభ్రపడిన వీధి భాగం తక్కువా, కష్టం మాత్రం ఎక్కువా! అందుకొక కారణం వానకు రోడ్డు తడిసి, ఊడ్చేందుకు ఆకులూ, చెత్త, దుమ్మూ ఊడి రాకపోవడం. రెండవ కారణం బోగన్ విలియా చెట్ల కొమ్మల ముళ్లు: వాటిని కత్తిరించాలన్నా, క్రిందపడిన కొమ్మల్ని సేకరించి, ట్రాక్టర్ లోకి ఎత్తాలన్నా బాగా మెలకువగా పని చేయవలసి రావడం!
అక్కడికీ అంబటి శంకర, ఆకుల దుర్గాప్రసాదు వంటి కొందరు ఈ పూల చెట్లకీ - పొలానికీ నడుమ తడిమన్నులోనే కూర్చొని వాటి సుందరీకరణకు పాల్పడ్డారనుకోండి!
నేను ఆలస్యంగా వెళ్లాక మాత్రం ఏదో - ఒకటీ అరా కోడూరు వాని కేకలు తప్ప ఎక్కడి పనులక్కడ సజావుగా సాగిపోయినవి!
డ్రైను పని అంతగా జరిగినట్లు లేదు. సన్ ఫ్లవర్ కాలనీ బాట మొదట మాత్రం అటూ-ఇటు ప్రక్కల మురుగు నీరు నిలిచి, దుర్గంధాన్ని ఉత్పత్తి చేస్తున్నది!
ఇందరి శ్రమ తమ ఇళ్ల వద్ద జరుగుతుంటే - ఇంత సందడి నెలకొంటే వచ్చి, కార్యకర్తలకు సహకరించని వీధి ప్రజల సంగతే వింతగొలిపేది!
కాఫీల - కబుర్ల వేళ ముగిశాక - 6.20 కల్లా కార్యకర్తలొక ఇంటి ఎదుట అర్ధ చంద్రాకారంలో నిలిచి,
అంబటి శంకరరావు గారి నినాదాలకు ప్రతిస్పందించి,
ఉడత్తు రామారావు గారి పేర విజయలక్ష్మి మెడికల్ షాపు వెంకటేశ్వరరావు గారు 20,000/- చందాను (తాను వద్దంటున్నా వినక చెల్లించారని) DRK గారు వివరించి, కృతజ్ఞతలు చెల్లించి,
రేపటి శ్రమదానం కోసం ఇదే గంగులవారిపాలెం రోడ్డులోనే అందరూ కలుసుకోవాలని నిర్ణయించారు!
డాక్టరు బందా జవహరు
వితరణలకు మొగ్గుచూపి ఏమాతని ముందుచూపు!
ఎంతటిదా సామాజిక దృక్కోణపు వైశిష్ట్యము!
సామూహిక- సామాజిక శ్రమదానపు టాసక్తులు!
మన తరమున కాదర్శము జవహరు తాత్త్విక చింతన!
- నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
27.08.2026