పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు!
శుక్రవారం (28-08-26) నాటి పని దినం సంఖ్య 3938*
ఇక - వేకువ పని సమయపు కొలత చెప్పేదేముంది - అది ఎప్పుడైనా - 95% వరకు స్టాండర్డ్ గా - 4.20-6.05 గానే ఉంటుంది!
పనులు మాత్రం అవి జరిగే వీధినీ - రహదారినీ బట్టి మారుతుంటాయి! అవసరాన్ని బట్టి మురుగు గుంటల్లో దిగుతారు, చెట్లెక్కుతారు, గుబురు చెట్ల నడుమ దూరినా దూరుతారు!
కొందరి ఇష్టాన్ని బట్టి చిత్తుకాగితాలూ, పశువుల పేడలూ, ఏకమాత్ర వాడకములగు ప్లాస్టిక్ లూ ఏరుతారు, బాగా బరువు గట్టి పనుల్ని వదలకుండా కత్తులతో, పారలతో, చెట్ల కొమ్మలు నరకడమూ, ఈత - తాడి చెట్ల సుందరీకరణమూ, తొందరగా - బాగా చెమటలు పట్టించుకోవడం ఇష్టపడే వాళ్ల పనులు!
వీధుల – గోడల - సంతల - కల్వర్టుల సుందరీకర్తలవేమో కాస్త నగిషీ పనులు! రంగులూ, కుంచెలూ, నమూనాలతో వచ్చి, చీరలకూ - చొక్కాలకూ - వొంటికీ 2-3 రకాల రంగులంటించుకొనే ఆ బృందానిదొక విచిత్ర దృశ్యం!
గోకుడు పారల గడ్డి చెక్కుడు కారక్రమం కూడ చూడదగిన సన్నివేశమే! మొత్తానికేదైనా ఒక వీధిని పట్టుకొన్నారంటే – ఆ కాలుష్యాల, అవకతవకల - అనాకారి స్థలాల పనిపట్టందే వదలరు!
[ఒక్కోమారు- కార్యకర్తల్లో కొందరి పని నిమగ్నతల్ని చూస్తూ – DRK డాక్టరయ్య గారు పనులాపే విజిల్ ఊదడానికి మొహమాటపడడమూ, పద్మావతి డాక్టరమ్మైతే – “అరె! థియేటర్లలో సర్జరీల సమయం దాటుతుందేమో అని తొందరపడడమూ జరుగుతుంటుంది!]
ఈ ఉదయం అలాంటి వేమీ జరగక - భవఘ్ని నగర్ వీధి శుభ్ర – సుందరీకరణలు సాఫీగా జరిగిపోయినవి! 32 మంది కార్యకర్తలూ, అందులో పడమటి వీధి నుండి సీతారామయ్య గారి మేనకోడలు క్రొత్త కార్యకర్తగా,
ఊడుపులూ, ఏరుడులూ, చెక్కుడులూ, కొమ్మల కత్తిరింపులూ వగైరా కార్యములన్నియూ స్వచ్ఛ సుందర శ్రమదానోద్యమ శాస్త్రోక్తంగా పూర్తయి,
సజ్జా ప్రసాదు గారు నినద గంభీరంగా నేటి శ్రమోద్యమానికి జై కొట్టడమూ,
వేకువ ఏ రెండు గంటలకు మేల్కొనెనో గాని - పల్నాటి వీరవనిత అన్నపూర్ణమ్మ గారి చిత్ర – విచిత్ర పూర్ణాల పంపకమూ,
డాక్టరు గారి అవ్యక్తానంద వ్యక్తీకరణమూ,
రేపటి వేకువ శ్రమదానము NTR పార్కుకు తరలిపోవలెననే నిర్ణయమూ......నేటి తుది సభా విశేషములు!
“అది ఏదో కొందరి పని”
చల్లపల్లి శ్రమోద్యమము సరిగా చూడని కొందరు
దాని లోతు, ఆంతర్యం దర్శింపగ జాలరు
ఆ ప్రణాళికను, నిర్వహణను ఆకళించు కొనలేరు
“అది ఏదో కొందరి పని” అని భావిస్తుందురు!
- నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
28.08.2026