3939* వ రోజు....

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు!

39 39* అనే పని రోజు సంఖ్య శనివారం (29-8-26) నాటిది!

               చివరి సాముహిక ఛాయ చిత్రంలో కనిపించే 53 మందిలో 43 మంది రెగ్యులర్ కార్యకర్తలు, పార్కు నడక తాత్కాలిక కార్యకర్తలు 10 మందన్న మాట!

               శ్రమ కార్య రంగం బెజవాడ రోడ్డు లోని NTR పార్కే! సమయాలు : మొదటి ఫొటో 20మంది ది – 4:22, మిగిలిన వారివి ఆపిదప కొన్ని నిముషాలు! మొదటి 20 మందిలో నిన్న  శ్రమదాన ప్రారంభం చేసిన కుమారితో బాటు ఆమె బంధువు కూడ!

               ఇక- ఆ గంటన్నరకు పైగా 50+ మంది పనులు చేస్తున్నా, పార్కు పెద్దది కావున కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కనిపించనట్లు ఉన్నారు! 30వేల ప్రజలు వాడుకొనే పార్కులో 300 మందైనా ఉండక పోతే పార్కు నవీకరణ –శుభ్ర సుందరీకరణ పనులెలా పూర్తవుతాయి? అందువల్ల ఈ 60 పనిగంటల శ్రమదానం పిదప కూడ NTR పార్కు పనులు రేపటికి సశేషం!

               మరి ఇందరు ఈ పూట సాధించిన శుభ్రతలేమంటారా? ఎక్కువమంది కృషి మాత్రం ఏపుగా - విస్తృతంగా  పెరిగిపోతున్న గడ్డీ, దాని నడుమ రకరకాల కలుపులు - పిచ్చి మొక్కల తొలగింపే!

               ఇంకొన్ని ఏవేవో వ్యర్ధాల సేకరణా, డజన్లకొద్దీ డిప్పల కొద్దీ ఈ పూట పుట్టుకొచ్చిన వ్యర్థాల లోడింగూ, మూల మూలలా వెతికి, తిసి విసిరిన కండెలూ, వగైరాలు ఏరడమూ ఇతర పనులు.  

               అసలీ పనులు చూస్తూ నేనాలోచించిందల్లా-

“ఇందరు పెద్దలూ, పిన్నలూ, మహిళలూ, విద్యవంతులూ, రైతులూ, పుర ప్రముఖులూ ఇంకెక్కడా –ఎప్పుడూ లేని ఊరి పనుల కోసం కలిసి, అందరి పనుల్ని  సమన్వయిచుకొంటూ కష్టించడమెలా సాధ్యపడుతున్నదా” అనే!

               వీళ్ల స్వార్ధాలేమైపోయినట్లు? సంకుచితాలూ, బిడియాలు, ఊగిసలాటలూ ఎక్కడ నశించి – ఒక పట్టుదలతో, సమైక్య లక్ష్యంతో ఎలా పని చేస్తున్నారు?

               6:20 AM ప్రాంతం లో – USA ప్రవాసి నాదెళ్ల సురేశ్ గారి క్రొత్త ప్రతిపాదన: “గాంధీ, నెహ్రులు తమ కాలం నాటి స్వాతం త్ర్యోద్యమ స్ఫూర్తి, ఆశయాలూ ఈ  90 ఏళ్ళ తర్వాత దేశం లో ఎక్కడైనామిగిలాయా? అని అన్వేషిస్తూ – చల్లపల్లి లోఆజాడలు కనపడి – NTR పార్కు లోవి నేటి శ్రమదానం గురించి ఏం మాట్లాడుకొంటారు ?” అనే అంశం మీద కార్టూన్లు వేస్తే, వానిలో 2 కార్టూన్లకు బహుమతులిస్తానని!

               ఈ ఆదివారం మధ్యాహ్నం నడకుదురు రొడ్డులోని మెహర్ వడ్లమర వద్ద , ఆ మిల్లు వారు ఏర్పరిచే విందు భోజనాలకూ,

               వచ్చే బుధవారం కోమలనగర్ లోని తన అపార్ట్ మెంట్ లో వారి అత్త గారి పెద్దకర్మలో ఆమె సంస్మరణ కార్యక్రమానికి శివబాబు గారి పిలుపూ నేటి విశేషాలు.        

రేపటి శ్రమదానం NTR పార్కు వద్దనే జరుగనున్నది!       

               మీ ఋణమును తీర్చలేదు!

ఆలవోకగ గ్రామసేవ లాచరించు ధీరులార!

మురుగులెన్నొ తోడి తోడి మురియు కార్యకర్తలార!

రహదార్లను అందగించి రాటు దేలు మిత్రులార!

ఎన్నటికీ చల్లపల్లి మీ ఋణమును తీర్చలేదు!

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   29.08.2026