పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు!
3940* వ - అదివారం నాటి (30-08-26) శ్రమ సమాచారం!
సదరు శ్రమ కూడ అదే బెజవాడ బాటలో – ఆ NTR పార్కు వద్దనే జరిగెను. ఈ పూటకూడ చిట్టచివరిలో వచ్చిన తోట నాగేశ్వరునితో మొత్తం 50 మంది కార్యకర్తలయ్యిరి! పని వేళ 4:21- 6:04 AM.
6:15 నుండి10 నిముషాలకు పైగా – దివంగత నందమూరి (NTR) విగ్రహం సాక్షిగా జరిగిన సమావేశమును నందేటి వారే నినాదాలతో ప్రారంభించి, పాటలతో– పద్యాలతో హోరెత్తించిరి! విని తట్టుకోలేక – కొందరు కార్యకర్తలు చప్పట్లతో ఈలలతో ఆనందామోదములు తెలిపిరి.
అంతటి సంతోషమునకు కారణము ఈ శని- ఆదివారాలలో మూకుమ్మడిగా శ్రమించి, చల్లపల్లికి ప్రతిష్టాత్మకమగు పార్కును మరింత శుభ్ర- సుందరముగా చేయగలగడమే!
ఈ వేకువ సమయం మాత్రం అత్యధిక భాగం కార్యకర్తలు పార్కు వెలుపల నడక మిత్రుల వాహన నిలుపుదల ప్రదేశములను మరింతగా శుభ్ర – సుందరీకరణకే వినియోగించిరి, పార్కు లోపల అన్నపూర్ణ-కోడూరు– అంబటి – సాధనాల వంటి కొందరు కార్యకర్తల ప్రయత్నమే జరిగెను!
బెజవాడ రోడ్డు- పార్కు ప్రహరీల నడుమ స్థలం పెద్దదే గాని, 30 మంది కష్టించుటకూ, డిప్పలు మోస్తూ – మట్టి చదును చేస్తూ – అటు ఇటు తిరుగాడుటకూ చాలకుండెను!
అందువలన కాంట్రాక్టరు కృష్ణరావు గారి నాయకత్వమున ఐదారుగురు కార్యకర్తలు అక్కడ పడియున్న రాళ్ల- మట్టి- ఇసుక రద్దును డిప్పలకెత్తి మోసి ఇంధన నిలయము ఎదుట నీటిగుంటలు పూడ్చిరి!
నలుగురు స్త్రీ, పురుష శ్రామికులు మాత్రము చీపుళ్ళు ధరించి, ఎగుడు దిగుడు రహదార్ల కూడలిలోని దుమ్మును, ఇసుకను తొలగించి శుభ్రపరుచుటలో కృత కృత్యు లైరి! వచ్చెడి – పోయెడి వాహనముల రద్దీలో వారాపని చేయుట విశేషము!
“అబ్బో! ఇదొక శ్రమదనమూ దానిని కీర్తించుచూచివరిలో సభా, నందేటి గాయక గానమూ, అవీ చాలక
ఈ విధమున వాట్సప్- ముఖ పుస్తకములందు ఇలా వ్రాసి, ప్రచురించడమూ, పనిలేనివారవి చదివి లైక్లు కొట్టడమూనా?” అని ఎవరూ తేలికగా చూడకుందురుగాక!
ఈ నిస్వార్ధ శ్రమదానమునూ, ఏ గ్రామమునకైన ఆదర్శప్రాయమగుదాని అంతర్యమును గ్రహింతురు గాక!
నేటి తుది సమావేశమున-
1)ఈమధ్యాహ్నము నడకుదురు బాటలోని వడ్లమర వద్ద మెహర్బాబా 61వ వార్షికోత్సవ
సమావేశమునకు వెళ్లుట,
2) రేపటి వేకువ NTR పార్కులో శ్రమదానమునకు వచ్చుటలు ప్రస్తావించబడినవి!
హర్డిక సౌజన్యముతో
నాయుడు శ్రీధర్ గారూ, కడియాల సురేశ్ గారూ
యార్లగడ్డ శివ ప్రసాదు – బందా జవహరు గారలు,
స్నేహ, వరుణ్, దిపీకలూ, ఉరిమి శాయి వంటి వారి
హర్డిక సౌజన్యంతో ఈ స్వచ్ఛ- హరిత – చల్లపల్లి!
- నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
30.08.2026