పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు!
మంగళవారపు - సెప్టెంబరు మాసారంభ శ్రమ రీతులు - @3942*
స్థలం : గ్రామ చివరి వార్డులోని బండ్రేవుకోడు కాల్వ ప్రాంతం;
స్వచ్ఛ సైనిక బలం : 27;
వాళ్ళ ఉద్దేశం : ఊరికొక చివరి భాగమైనా సరే – గంగులవారిపాలెం రోడ్డులో పచ్చదనంలోను, పరిశుభ్రతలోను, ఆహ్లాదం సమకూర్చడంలోను ఏలోటూ ఉండనే రాదని; గుబురుగా పెరుగుతూ తొలి కాపుకు సిద్ధమౌతున్న – 3-4 ఏళ్ల క్రితం తాము నాటి పెంచుకొంటున్న మామిడి చెట్లకు ఏ పిచ్చి తీగలో అల్లుకొంటే సహించరాదని;
ఒక సమాంతర ఎత్తుకు మించి ఉన్నదని నలుగురు రెస్క్యూ టీము వారు ఏడాకుల వృక్ష కాండాన్ని మరరంపంతో నరికేసి, ఆనందించుట;
నేనంతకు ముందు చూస్తే శుభ్రంగానే ఉన్న బాట ఉత్తరపుటంచు నచ్చలేదని, పరిశుభ్రత చాలలేదని డజనుమంది కత్తుల వారు పొలం హద్దు దాక వంక బెట్టటానికి వీలులేనంతగా బాగుపరచుట;
ఆ ముప్పావు గంట కాలము శ్రమ తెలియకనో - లేక శ్రమానందమో కాని – ఆస్థాన పాటగాడు అశువుగా బుర్రకథను పాడుట – ఒక భారీ వృద్ధ కారకర్త “అహ-అహ” అంటూ వంత పలుకుట;
అచటికి కాస్త దూరములో రైతుద్వయమూ - తపాల ఉద్యోగీ ఇవేవీ పట్టించుకొనక కాల్వ లోతట్టున శుభ్రపరచుట;
వీధి మూల మలుపులో ఒక ఆకుల వారు గడ్డిని వేగంగా మరరంపంతో చెక్కుతుంటే – ఆ దుమ్మూ, గులకరాళ్లూ 10 గజాల దూరంలో ఉన్న నా వీపుకు తగులుట;
ఇద్దరు నర్సులు క్రొత్తగా మర రంపంతో మళ్లీ వచ్చిన గడ్డి ధూళిని 2 వ మారు క్షుణ్ణంగా ఊడ్చుచుండగా - పెద్ద డాక్టరమ్మ – మరో గృహిణి వాళ్ళకు సహకరించగా - ఒక వ్యాపార కార్యకర్త “ఈ చోటిప్పుడు ఇంటి కన్న చక్కగా ఉన్నది - పడుకొని చూద్దామా?” అని నన్ను అడుగుట,
ఎట్టకేలకు పనిని రేపటికి వాయిదా సూచకంగా 6:01 కు కాబోలు DRK గారి విజిలు మ్రోగుట;
నాలుగు నెలల విరామం తర్వాత ఈ శ్రమదానమును ప్రత్యక్షంగా చూసిన ఆనందముతో శంకర శాస్త్రి గారు కాస్త మార్చి, నినాదాలు పలికి, నిన్న 10,000/- చందా కాక – ఈ పూట చల్లపల్లిలో తన ప్రవేశక 11 వ వార్షికోత్సవమట – అందుకు గుర్తుగా లడ్డులు పంచుట;
ఇక - పెద్ద డాక్టరు గారు విజయవాడ / అమెరికాల వీర తాడేపల్లి గారి 5000/- నగదు చందాను నా ద్వారా స్వీకరించుట;
నిన్న SP గారు NTR పార్కులోని బాలల క్రీడా/ జిమ్ ను ప్రారంభించినప్పటి విశేషాలను వివరించుట;
ఈరోజు నుండి చల్లపల్లిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ల నిషేధ కార్యాచరణ శుభ సందర్భమును అందరూ తలచుకుని ఆనందించుట;
రేపటి శ్రమదాన స్థలి కూడ ఇదే గంగులవారిపాలెపు వీధి అని ప్రకటించుట!
నాదెళ్ల గారి చొరవ
ఒకొక దాత ఒకొక ట్రస్టు ఉద్యోగిని దత్తతగా
తీసుకొనే ప్రయత్నమును తీవ్రముగా చేయుచున్న
సురేశ్ నాదెళ్ల గారి చొరవ ప్రశంసార్హమనీ
ఇందు మూలముగా నేను అందరికీ ప్రకటిస్తా!
- నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
01.09.2026